దుబ్బాక హీట్..రంగంలోకి కేంద్ర ఎన్నికల సంఘం‌

  • పోలీస్​ అబ్జర్వర్​గా తమిళనాడు ఐపీఎస్‌ సరోజ్​కుమార్ నియామకం
  • ఇటీవలే సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్​రెడ్డిపై బదిలీ వేటు
  • ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం.. వచ్చే నెల 3న పోలింగ్​

హైదరాబాద్‌, వెలుగు : దుబ్బాకలో బై ఎలక్షన్​ హీట్​ పెరిగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ  మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. మూడునాలుగు రోజుల కిందటే కలెక్టర్‌పై బదిలీ వేటు వేసింది. తాజాగా పోలీస్​ అబ్జర్వర్​గా  ఐపీఎస్‌ ఆఫీసర్​ను నియమించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువులు, ఇతరుల ఇండ్లపై పోలీసుల సోదాలు, ఈ  సందర్భంగా తలెత్తిన వివాదాలు, లాఠీచార్జ్​, అరెస్టులు సంచలనం సృష్టించాయి. ఆఫీసర్లు, పోలీసులు టీఆర్‌ఎస్​కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాలతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దుబ్బాక బైపోల్​ను సీరియస్​గా తీసుకుంది. తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ సరోజ్‌ కుమార్‌ ఠాకూర్‌ను పోలీస్‌ అబ్జర్వర్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పోలింగ్​ అబ్జర్వర్లను నియమిస్తుంటారు. కానీ.. పోలీస్​ అబ్జర్వర్​ను నియమించడం అనేది చాలా అరుదు. మరోవైపు సీఆర్​పీఎఫ్​, పోలీస్​ బలగాలతో దుబ్బాక టౌన్​లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

కలెక్టర్​ను బదిలీ చేయటంతో పాటు తాజాగా తమిళనాడు ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్​ను రంగంలోకి దింపటంతో దుబ్బాక  బై ఎలక్షన్​పై  సీఈసీ స్పెషల్​ ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తున్నది. సిద్దిపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వెంకట్రామ్​రెడ్డిని బదిలీ చేయాలని బీజేపీతో పాటు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మొదటి నుంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ వచ్చాయి. వెంకట్రామ్​రెడ్డి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సన్నిహితుడని, అధికార పార్టీకి  అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో  ఆయనను తప్పించి భారతీ హోళికేరికి బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్​ వెంట్రామ్​రెడ్డిని బదిలీ చేసి రెండు రోజులు తిరక్కముందే సిద్దిపేట సీపీ జోయల్​ డేవిస్​ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. సీపీ ఏకపక్షంగా వ్యవహరించి.. సిద్దిపేటలో  రఘునందన్​ రావు బంధువులు, ఇతరుల ఇండ్లలో సోదాలు జరిపించారని ఆందోళనలు చెలరేగాయి. సోదాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్న డబ్బుపై పెద్ద ఎత్తున వివాదం తలెత్తింది. పోలీసులు తనపై దాడి చేశారని బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు చెప్తుండగా.. ఆయనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు కారులోకి బలవంతంగా తోసేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ సంజయ్‌‌‌‌‌‌‌‌ దీక్షకు దిగగా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా ఘటనపై ఆరా తీశారు.  ఘటనను నేషనల్​ బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌ సుమోటోగా తీసుకుంది. నేషనల్‌‌‌‌‌‌‌‌ బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ తుల్లోజు ఆచారి బుధవారం సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పోలింగ్‌‌‌‌‌‌‌‌కు పది రోజుల ముందు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను తప్పించిన సీఈసీ.. సరిగ్గా ఆరురోజుల ముందు పోలీస్‌‌‌‌‌‌‌‌ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌గా సీనియర్‌‌‌‌‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ను నియమించింది.

పోటాపోటీగా ప్రచారం

దుబ్బాక సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో వచ్చిన బై ఎలక్షన్​లో  గెలుపు కోసం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్వశక్తులు ఒడ్డుతున్నది.రామలింగారెడ్డి భార్య సుజాతను ఆ పార్టీ క్యాండిడేట్​గా నిలిపింది. మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ముమ్మర  ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకటించడానికి ముందు నుంచే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు ప్రచారం చేసుకుం టున్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ ఆశించి భంగపడ్డ చెరుకు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తరపున బరిలోకి దిగారు. ఆదివారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలు బై పోల్​ను  ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాయి. రోడ్‌‌‌‌‌‌‌‌ షోలు, ప్రచార సభలకే పరిమితం కాకుండా బైక్‌‌‌‌‌‌‌‌ ర్యాలీలు, డోర్‌‌‌‌‌‌‌‌ టు డోర్‌‌‌‌‌‌‌‌ క్యాంపెయినింగ్‌‌‌‌‌‌‌‌తో హోరెత్తిస్తున్నారు. ఆయా సందర్భాల్లోనూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. పరస్పర విమర్శలు ఒక్కోసారి హద్దులు దాటుతున్నాయి. వచ్చే నెల 3న పోలింగ్​ జరుగనుంది.

Latest Updates