ఈజీ డెలివరీ కోసం..కుర్చీ, బాత్ టబ్, బెలూన్

  • రకరకాల పొజిషన్లలో కాన్పులకు అవకాశం
  • సంగారెడ్డి, ఖమ్మం, కింగ్ కోఠి హాస్పిటళ్లలో సక్సెస్
  • ఇతర సర్కా రు దవాఖాన్లలోనూ అమలు చేయాలని ఆలోచన

హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యామ్నాయ డెలివరీ మెథడ్స్‌‌‌‌పై దృష్టి పెట్టింది. లేబర్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌లో టేబుల్‌‌‌‌పైన ప్రసవాలు చేసే విధానానికి బదులు, గర్భిణికి సౌకర్యవంతంగా ఉండే ఇతర పద్ధతులను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి, ఖమ్మం, కింగ్ కోఠి దవాఖాన్లలో కుర్చీ, బాత్ టబ్‌‌‌‌, బెలూన్‌‌‌‌, హ్యాంగర్ వంటి మోడల్స్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పద్ధతుల ద్వారా గర్భిణులు పురిటి నొప్పుల నుంచి కొంత ఉపశమనం పొందుతారని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా, గర్భిణి తనకు కంఫర్ట్‌‌‌‌గా ఉన్న పొజిషన్‌‌‌‌లోనే ఉంటే, ప్రసవం కూడా సులువుగా అవుతుందంటున్నారు. చాలామంది మహిళలు  పురిటి నొప్పులు భరించలేక సిజేరియన్ డెలివరీలు చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నొప్పులను తగ్గించి, సుఖప్రసవం అయ్యేలా కొత్త మెథడ్స్‌‌‌‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

కూర్చునే ప్రసవించొచ్చు

ప్రస్తుతం సంగారెడ్డి, ఖమ్మం, కింగ్ కోఠి దవాఖాన్లలో 4 పద్ధతుల్లో ప్రసవాలు చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా తయారు చేసిన కుర్చీలో కూర్చుని ప్రసవం చేసుకోవడం, వేలాడుతున్న పెద్ద బెలూన్‌‌‌‌ ఊతంగా చేసుకుని ప్రసవించడం, గోడకు ఉన్న హ్యాంగర్‌‌‌‌ వంటిది‌‌‌‌ పట్టుకుని నిలబడి ప్రసవం చేసుకోవడం, బాత్ టబ్ వంటి దానిలో పడుకుని ప్రసవం చేసుకోవడం వంటి మెథడ్స్‌‌‌‌ ఉన్నాయి. ఈ పద్ధతుల్లో డెలివరీలకు గర్భిణులను ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లు చేయిస్తున్నారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో, ఇతర దవాఖాన్లలో కూడా ఈ విధానాలను పాటించాలని నిర్ణయించారు. సంగారెడ్డి దవాఖానలో స్టాఫ్ నర్సులకు ఈ కొత్త పద్ధతుల్లో డెలివరీ చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో వాక్యుమ్ క్లీనర్ వంటి ప్రత్యేక యంత్రాన్ని కూడా నార్మల్ డెలివరీల కోసం వినియోగిస్తున్నారు. విదేశాల్లో, మన దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో ఈ మెథడ్స్ సక్సెస్ అవడంతో మన దగ్గర కూడా ప్రవేశ పెట్టారు.

రెస్పాన్స్ మంచిగుంది : డాక్టర్‌‌‌‌‌‌‌‌ గాయత్రి

పురిటినొప్పుల భయంతో చాలా మంది సిజేరియన్‌‌‌‌ చేయించుకోవాలనుకుంటున్నారని, సిజేరియన్ కోసం రికమండేషన్లు కూడా చేయిస్తున్నారని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గాయత్రి చెప్పారు. సాధ్యమైనంత వరకూ నార్మల్ డెలివరీల కోసమే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం కొత్త మెథడ్స్ యూజ్ చేస్తున్నామన్నారు. టేబుల్‌‌‌‌పైన పడుకున్నప్పటి కంటే, కుర్చీలో కూర్చుని, టబ్‌‌‌‌లో పడుకుని, బెలూన్‌‌‌‌ మోడల్‌‌‌‌లో ప్రసవం చేసుకోవడం ద్వారా గర్భిణులు నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారని, డెలివరీ ఈజీగా అవుతుందన్నారు.

Latest Updates