క్లైమాక్స్ కి చేరిన మధ్యప్రదేశ్‌‌ రాజకీయ సంక్షోభం

అటు గవర్నర్‌‌-ఇటు స్పీకర్‌‌ ‘పరీక్ష’పై పంతం
మంత్రుల రాజీనామాలకు ఆమోదం
మధ్యప్రదేశ్‌‌లో ఊగిసలాడుతున్న కమల్‌‌ సర్కార్‌‌
112కు తగ్గిన మ్యాజిక్​ ఫిగర్ గెలుస్తామని సర్కారు ధీమా

న్యూఢిల్లీ/భోపాల్మధ్యప్రదేశ్​ రాజకీయాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల రాజీనామాలతో కాంగ్రెస్ సర్కారుకు అసెంబ్లీలో బలం తగ్గిందనే ఆరోపణల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగే అవకాశం ఉంది. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్​ లాల్ జీ టాండన్ ​స్పీకర్​ను ఇప్పటికే ఆదేశించారు. దీనిపై ముందస్తుగా ప్రకటనలు చేయబోనని, తన నిర్ణయం ఏమిటన్నది సభలోనే చెబుతానని స్పీకర్​ ఎన్​పీ ప్రజాపతి చెప్పారు. మరోవైపు, సోమవారం ఫ్లోర్​ టెస్టు జరుగుతుందనే వార్తలతో క్యాంపులకు తరలించిన ఎమ్మెల్యేలను బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు వెనక్కి రప్పిస్తున్నాయి. రెబెల్‌‌ ఎమ్మెల్యేలు తమకు సీఆర్​పీఎఫ్​సెక్యూరిటీ కావాలని కోరారు.

నా ప్రసంగం తర్వాత ఫ్లోర్ ​టెస్ట్: గవర్నర్

మధ్యప్రదేశ్ గవర్నర్​ లాల్​జీ టాండన్​ సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్​ను ఆదేశించారు. సోమవారం ఉదయం 11 గంటలకు మధ్యప్రదేశ్​ అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతుందని, తన ప్రసంగం ముగిసిన వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్​ ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ ప్రతినిధులు గవర్నర్​ను కలిసి సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని కోరారు. ఇది జరిగిన కొద్ది గంటలలోపే గవర్నర్​ విశ్వాస పరీక్షకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని మంత్రి శర్మ చెప్పారు.

భోపాల్​ చేరుకున్న కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

సోమవారం నుంచి బడ్జెట్​ సమాశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా రాజస్థాన్ క్యాంప్​లో ఉన్న మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సొంత రాష్ట్రానికి చేరారు. ఆదివారం జైపూర్​ నుంచి విమానంలో వీరంతా భోపాల్​ చేరుకున్నారు. కాంగ్రెస్​ లెజిస్లేచర్​ పార్టీ ఎమ్మెల్యేలకు విప్​ జారీ చేసింది. అసెంబ్లీ సెషన్​కు తప్పకుండా సభ్యులంతా హాజరు కావాలని ఆదేశించింది.

22 మంది రాజీనామాతో సంక్షోభం

కొద్ది రోజుల క్రితం జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కమల్​నాథ్​ సర్కారుకు ఇబ్బందులు మొదలయ్యాయి. మెజారిటీ మార్కును తగ్గించేందుకు ఆరుగురు మినిస్టర్లు సహా 22 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే మంత్రుల రాజీనామాలను స్పీకర్​ నర్మదా ప్రసాద్​ ప్రజాపతి శనివారం ఆమోదించారు. ఒక వేళ మిగతా 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్​ ఆమోదిస్తే.. 107 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అవతరిస్తుంది. మంత్రుల రాజీనామాల ఆమోదం తర్వాత అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 222కు తగ్గనుంది. దీంతో మెజార్టీ మార్కు 112కు తగ్గింది. పార్టీలో తిరుగుబాటుకు ముందు 114 మంది సభ్యులున్న కాంగ్రెస్​ పార్టీ బలం ప్రస్తుతం 92. ఆ పార్టీకి నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సపోర్ట్​ ఉంది. ప్రస్తుతం బీజేపీ బలం 107. మెజారిటీకి ఆ పార్టీకి ఇంకా ఐదుగురు సభ్యులు కావాలి. రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై కమల్​నాథ్ సర్కారు భవిష్యత్తు ఆధారపడి ఉంది.

అసెంబ్లీలో బలాబలాలు

మొత్తం సభ్యులు 222(230)

మెజారిటీ మార్కు      112

కాంగ్రెస్                       92

బీజేపీ                       107

ఎస్పీ                             1

బీఎస్పీ                          2

ఇండిపెండెంట్లు               4

కాంగ్రెస్ రెబెల్స్             16

(ఖాళీలు                       8)

సభలోనే నిర్ణయం: స్పీకర్

అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించడంపై సోమవారమే నిర్ణయం తీసుకుంటానని మధ్యప్రదేశ్​ అసెంబ్లీ స్పీకర్​ ఎన్పీ ప్రజాపతి స్పష్టం చేశారు. సీఎం కమల్​నాథ్​కు గవర్నర్​ ఆదేశాలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. దీంతో సోమవారం సభలో విశ్వాస పరీక్ష ఉంటుందా?, లేదా? అనేదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన స్పీకర్ తాను ఏం చేస్తాననేది సోమవారం సభలోనే తెలుస్తుందని చెప్పారు.

Latest Updates