దసరాకూ పెరగని రద్దీ.. ఆర్టీసీకి ఆదాయం అంతంతే

పండుగకు నో ప్యాసింజర్స్!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెద్ద పండుగ అయిన దసరాకు కూడా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ కనిపించడం లేదు. ఆదివారం దసరా ఉండగా.. శుక్ర, శనివారాల్లోనూ బస్సులు నిండలేదు. ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ ఆదాయం అంతంతగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 6వేల వరకు బస్సులు నడుపుతుండగా, ప్రతిరోజు 50 శాతమే ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదవుతోంది. పండుగ నేపథ్యంలో ఓఆర్ కొద్దిగా పెరిగి, శుక్రవారం 52 శాతంగా నమోదైంది. శనివారం నాటి ఓఆర్ 60 శాతం వరకు నమోదవుతుందని అధికారులు భావిస్తున్నారు. బస్సులు పోయేటప్పుడు కొద్దిగా రద్దీగా ఉన్నా, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా వస్తున్నాయి. బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగకపోవడంతో కలెక్షన్ కూడా అంతంతగానే ఉంది. శుక్రవారం రూ.6 కోట్లు రాగా, శనివారం మరో కోటి దాకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. యావరేజ్ గా రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల దాకా కలెక్షన్ వస్తోంది. కరోనాకు తోడు వానలు, వరదలతో జనాలు సొంతూళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.

బార్డర్ లో బస్సులు పెట్టలే…

ఏపీ, తెలంగాణ మధ్య ఇంటర్ స్టేట్ ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో మార్చి 22 నుంచి బస్సులు ఆగిపోయాయి. ఏపీ మీదుగా వెళ్లాల్సి ఉండడంతో బెంగళూరుకు కూడా బస్సులను ఆపేశారు. రెండు రాష్ట్రాల అధికారులు పలుసార్లు చర్చలు జరిపినా ఏమీ తేలలేదు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏపీ సర్కార్ బార్డర్ లో ఏర్పాట్లు చేసింది. తెలంగాణ బార్డర్ కు ఆనుకొని ఉన్న అన్ని ప్రాంతాల్లో స్పెషల్ బస్సులను పెట్టింది. మన రాష్ట్రం మాత్రం అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. దీంతో ఏపీ నుంచి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

Latest Updates