యువతకూ కరోనా వైరస్ ముప్పు ఎక్కువే

  •     అమెరికాలో 40% మంది కరోనా బాధితుల వయసు 20–54
  •     క్రిటికల్ కేర్​లోని 12 శాతం మంది 20–44 ఏళ్ల వారే

ఇప్పటి వరకు వృద్ధుల్లోనే కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని మనకు తెలుసు. అయితే తాజాగా  యువతకూ వైరస్​ ముప్పు ఎక్కువేనని అమెరికా నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ అలర్జీ అండ్​ ఇన్​ఫెక్షియస్​ డిసీజెస్​ చెబుతోంది.  అమెరికాలో నమోదైన దాదాపు 4వేలకు పైగా కరోనా కేసులను పరీక్షించగా ఈ విషయం వెల్లడైంది. మార్చి 16 వరకు కరోనాతో అమెరికా హాస్పిటల్స్​లో చేరిన వారిలో 40% మంది 20–54 ఏళ్ల లోపు వారే. ఇక క్రిటికల్ సిచ్యువేషన్​తో ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 12 శాతం మంది 20–44 ఏళ్ల లోపు వారుండగా, 36 శాతం మంది  45–65 ఏళ్ల లోపు వారున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో 55 శాతం మంది బాధితులు 18-–49 ఏళ్ల వారే.

ఊహించలే…

‘‘మేం ఊహించిన దానికంటే ఎక్కువ మంది యువత కరోనాతో హాస్పిటల్​లో చేరుతున్నారు. ఇదొక ముఖ్యమైన సమస్య. దీనిని క్లోజ్​గా పరిశీలిస్తున్నాం” అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోని ఫాసీ తెలిపారు. కరోనా ప్రభావం చైనా, యూరప్​లలో విభిన్నంగా ఉందని చెప్పారు. అక్కడి డేటాను బట్టి చైనాలో కరోనాతో పెద్దలకే ఎక్కువ రిస్క్ ఉందని తెలుస్తోందన్నారు. యువతలోనూ కరోనా లక్షణాలు తీవ్రంగా  ఎందుకు ఉన్నాయనే దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆంథోనీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న యువతకు వేరే అనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాకు ఇటలీ లాంటి పరిస్థితి వస్తుందని అంచనా వేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సునామీ లాంటిదని, వస్తే ఆపడం కష్టమని అన్నారు.

Latest Updates