భైంసాలో కర్ఫ్యూ.. భారీగా పోలీసుల బందోబస్తు

  • ఇరు వర్గాలమధ్య గొడవలు.. ఉద్రిక్తత
  • భారీగా పోలీసు బలగాల తరలింపు

నిర్మల్‍, భైంసా వెలుగు: ఇరువర్గాల మధ్య ఘర్షణలతో నిర్మల్​ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. సోమవారం రాత్రి ఏడుగంటల నుంచి మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్ప్యూ అమలులో ఉంటుంది. ఆదివారం రాత్రి బైక్​ సైలెన్సర్​ సౌండ్​ విషయంలో తలెత్తిన గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణలకు కారణమైంది. ఒక వర్గానికి చెందిన వారు రాళ్లు రువ్వడంతో పోలీసులతో సహ పలువురికి గాయాలయ్యాయి. పట్టణంలోని పలు చోట్ల కొందరు ఇండ్లను, వాహనాలను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం కూడా ఘర్షణలు కొనసాగాయి. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున పోలీసు బలగాలను తరలించారు. భయంతో కొందరు స్థానికులు ఊరు విడిచివెళ్లిపోయారు. భయాందోళనలను తగ్గించేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్​ విధించారు.ఇంటర్నెట్​ సేవలను నిలిపివేశారు. అయినా,  సోమవారం ఉదయం కూడా అక్కడక్కడ ఘర్షణలు జరిగాయి.  ఉదయం ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్‍కుమార్​, జిల్లా కలెక్టర్‍ప్రశాంతి గొడవలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. నిర్మల్​జిల్లాతో పాటు ఆదిలాబాద్​, కామారెడ్డి ఎస్పీలు, రామగుండం సీపీ బైంసాకు చేరుకుని శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.  ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినా..  తిరిగి ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించారు.

.భైంసా అల్లర్లకు సీఎం కేసీఆర్​ బాధ్యత వహించాలని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. ఎంఐఎం చీఫ్​, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ కూడా ఈ ఘటనలను  ఖండించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.  దోషులను కఠినంగా శిక్షించాలని  సీఎం కేసీఆర్​, డీజీపీలను కోరారు.  బాధితులను పరామర్శించేందుకు మంగళవారం భైంసా వెళ్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ చెప్పారు.  పట్టణంలో అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Latest Updates