రూల్స్ చెప్పాల్సింది మీరు కాదు..ఏపీ తీరుపై సీడబ్ల్యూసీ అభ్యంతరం

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నది వరద నీటి వినియోగంపై ఏం చేయాలో, ఎలా చేయాలో ఏపీ తమకు చెప్పాల్సిన అవసరం లేదని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. గత 30 ఏండ్లుగా రెండు రాష్ట్రాలు వాడుకున్న వరద నీటి లెక్కలు వెల్లడిస్తే జూన్ మొదటి వారంలో మరోసారి సమావేశమై చర్చిద్దామని స్పష్టం చేసింది. కృష్ణా నదిలో వరదలు వచ్చిన రోజుల్లో ఏపీ, తెలంగాణ ఉయోగించుకున్న నీటి లెక్కలపై ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సీడబ్ల్యూసీ సీఈ విజయ్ శరణ్, కేఆర్ఎంబీ టెక్నికల్ కమిటీ మెంబర్ హరికేశ్ మీనా, తెలంగాణ, ఏపీ ఇంటర్ స్టేట్ సీఈలు నర్సింహారావు, నాగేశ్వర్రావు మీటింగ్​లో పాల్గొన్నారు.

వాటాను మించి వాడుకున్న ఏపీ

తెలంగాణ ఇంటర్ స్టేట్ సీఈ నర్సింహారావు మాట్లాడుతూ, నికర జలాల్లోనూ ఈ ఏడాది ఏపీ తన వాటాకు మించి వాడుకుందని, వరద నీటిని ఎక్కువగానే తీసుకుందని తెలిపారు. ఏపీ మూడో వంతు నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే తీసుకుందన్నారు. ఏపీ ఎక్కువ మొత్తం నీటిని వాడుకుంటున్నందున ఏ లెక్కన వరద జలాలను ఉపయోగించుకోవాలో టెక్నికల్ కమిటీనే నిర్దారించాలని కోరారు. ఏపీ ఇంటర్ స్టేట్ సీఈ నాగేశ్వర్రావు మాట్లాడుతూ, ఫ్లడ్ ఇయర్ ఈ నెలాఖరుతో ముగుస్తుందని, ఆ తర్వాతే వరద నీటి వినియోగంపై తేల్చాలని సూచించారు. కృష్ణాలో ఈ ఏడాది మిగులు జలాల్లో ఏ రాష్ట్రానికి ఎంత వాటా దక్కుతుందో తదుపరి మీటింగ్​లోనే తేల్చేయాలని కోరారు. ఏపీ సీఈ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీడబ్ల్యూసీ సీఈ.. ఎక్కువగా నీటిని తీసుకుని ఇప్పటికిప్పుడు లెక్కలు తేల్చాలని కోరడం సరికాదన్నారు. మిగులు జలాల పంపిణీపై బ్రజేశ్ ట్రిబ్యునల్ తేల్చేవరకూ రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామన్నారు. ఈ నెలాఖరులోగా రెండు రాష్ట్రాలు 30 ఏండ్ల ఫ్లడ్ డేటాను ఇవ్వాలని ఆదేశించారు. జూన్ మొదటివారంలో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావాలని నిర్ణయించారు.

ఏపీని ఆపండి రాయలసీమ లిఫ్ట్ ను కట్టనివ్వొద్దు

Latest Updates