డైలీ కరోనా కేసులు వెయ్యికి చేరువలో

డైలీ కరోనా కేసులు వెయ్యికి చేరువలో
  • రాష్ట్రంలో ఒక్క రోజే 965 మందికి కరోనా 
  • గ్రేటర్‌‌లో 254, జిల్లాల్లో 711 కేసులు
  • నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం 
  • సిద్ధాపూర్​లో 30 మందికి పాజిటివ్​
  • రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు  
  • ఇప్పటివరకు 11,31,643 మందికి వ్యాక్సిన్ 

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ర్టంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గురువారం ఒక్క రోజే 965 కేసులు నమోదైనట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ఇందులో 711 కేసులు జిల్లాల్లో, 254 కేసులు గ్రేటర్ హైదరాబాద్‌‌లో నమోదైనట్టు పేర్కొంది. జిల్లాల్లో అత్యధికంగా మేడ్చల్‌‌ మల్కాజ్‌‌గిరి(నాన్‌‌ జీహెచ్‌‌ఎంసీ)లో 110, రంగారెడ్డి(నాన్‌‌ జీహెచ్‌‌ఎంసీ)లో 97, నిజామాబాద్‌‌లో 64 కేసులు నమోదైనట్టు చూపించారు. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,09,741కి పెరిగిందని, ఇందులో 3,01,876 మంది కోలుకున్నారని పేర్కొంది. ఇక కరోనా మరణాలు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నయి. గురువారం ఐదుగురు చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం డెత్స్‌‌1,706కు పెరిగినట్టు చూపించింది. గురువారం రాత్రి పదింటి నుంచి శుక్రవారం ఉదయం11 గంటల వరకే గాంధీలో ఐదుగురు చనిపోయినట్టు అక్కడి ఓ డాక్టర్ తెలిపారు. డెత్స్‌‌ రోజూ ఇలాగే ఉంటున్నాయని, సీరియస్‌‌ కేసులే ఇక్కడకు వస్తుండడం వల్ల గాంధీలో ఎక్కువ మంది మరణిస్తున్నట్టు చెప్పారు.  కేసులు, మరణాల విషయంలో సర్కార్ బులెటిన్లలో తప్పుడు లెక్కలు చూపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.   

ఒకే ఊరిలో30 మందికి.. 

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ లో ఒకే గ్రామంలో 30 మందికి కరోనా సోకింది. గ్రామంలో ఇటీవల జరిగిన పెండ్లి వేడుకల్లో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఊరి శివార్లలోని పొలాల్లో క్వారంటైన్ లో పెట్టారు. శుక్రవారం గ్రామంలో ప్రత్యేక క్యాంపు పెట్టి 85 మందికి టెస్టులు చేయగా, మరో 26 మందికి వైరస్ సోకినట్లు తేలింది. 

వెయ్యి సెంటర్లలో వ్యాక్సినేషన్‌‌

రాష్ర్టంలో గురువారం 59,439 మందికి, శుక్రవారం 42,334 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. వీరితో కలిపి వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 11,31,643కు చేరకుంది.