చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

హైదరాబాద్: సిటీ శివార్లలో చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా సికింద్రాబాద్ తాడ్ బండ్ ప్రాంతంలో నివాసం ఉంటారు. కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెకు వైద్యం కోసం కర్ణాటకకు బయలుదేరి వెళ్తూ ప్రమాదంలో మొత్తం ఏడుగురు కన్నుమూశారు. కారులో నలుగురు చిన్నారులు సహా మొత్తం 11 మంది బయలుదేరారు. ఘటనా స్థలంలోనే ఆరుగురు చనిపోగా..  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కుటుంబ సభ్యురాలైన నజియా భాను (36) కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యం కోసం కర్ణాటకలోని గురుమిటీకల్ వెళ్తున్నారు. తెల్లవారుజామున ఇంటి నుండి బయలుదేరారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో చేవెళ్ల దగ్గర కందవాడ స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయబోగా.. బోర్ వెల్ వాహనం ఎదురు వచ్చింది. గుర్తించి బ్రేక్ వేసేలోగానే.. వేగంగా వెళ్లి బోర్ వెల్ లారీని ఢీకొట్టారు. రెండు వాహనాలు వేగంగా ప్రయాణిస్తున్నాయి. పరస్పరం ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ఉన్నవారు నుజ్జు నుజ్జయ్యారు. స్పాట్ లో ఆరుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో మృతి చెందిన వారు అసిఫ్‌ఖాన్(50), మెహక్ శాంతా(18), నజియాబేగం(45), హర్ష(28‌), నజియాభాను(36‌), హర్షభాను ‍(6‌)ఖాలీద్ (40) గా గుర్తించారు. గాయపడిన కరీనా బేగం, అయూమ్‌ఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక బాలుడు చిన్న గాయం కూడా లేకుండా ప్రమాదం నుండి బయటపడ్డాడు. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాలకు పోస్ట్ మార్టం ఏర్పాట్లు చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కాలే యాదయ్య స్పందించారు. ప్రమాదం గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

For more News..

ప్రపంచంలో సింగపూర్‌లోనే తొలిసారిగా ల్యాబ్ చికెన్

Latest Updates