ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్..​ మద్యం మత్తులో భర్తను చంపేసింది

రాజేంద్రనగర్, వెలుగు:  ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టరే మద్యం మత్తులో భర్తను చంపేసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి  చెందిన విశాల్, అదే రాష్ట్రానికి చెందిన సబీనా గతంలో ఆర్మీలో పని చేశారు. ఉద్యోగం చేసేటప్పుడు వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. మొదట వివాహం చేసుకున్న వారితో విడాకులు తీసుకొని 14 ఏండ్ల క్రితం ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆర్మీలో రిటైరైన తర్వాత హైదరాబాద్ కు వచ్చి రాజేంద్రనగర్ బండ్లగూడ విల్లాస్ లో నివాసముంటున్నారు. సబీనా ఓ ప్రైవేటు హాస్పిటల్​లో డాక్టర్​గా చేస్తుండగా విశాల్  సెక్యూరిటీ ఆఫీసర్‌‌‌‌గా చేస్తున్నాడు. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. నెల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.  సబీనాను విశాల్ చితకబాదడంతో తీవ్రంగా గాయపడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవు. శనివారం అర్ధరాత్రి ఉన్నట్లుండి ఇద్దరూ కలిసిపోయారు. ప్రేమగా మాట్లాడుకుంటూ కలసి  మద్యం తాగారు. అతిగా తాగిన తర్వాత వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో సబీనా ఇంట్లో ఉన్న కత్తితో విశాల్ చాతిపై బలంగా పొడిచింది. విశాల్ అరుపులు విన్న స్థానికులు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. హాస్పిటల్​కు తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు సబీనాను అదుపులోకి తీసుకున్నారు.

 

 

Latest Updates