వేధింపులు తట్టుకోలేక.. అర్థరాత్రి తండ్రికి ఉరేసిన కూతుళ్లు

హైదరాబాద్, వెలుగు: తాగుడుకు బానిసై రోజు వేధిస్తున్న తండ్రిని కూతుళ్లు హత్య చేశారు. కొన్నేళ్లుగా నిత్యం తాగి హింసించటం, పలుమార్లు అఘాయిత్యానికి కూడా పాల్పడేం దుకు ప్రయత్నించిన తండ్రి తీరుతో విసిగిపోయిన ఇద్దరు కూతుళ్లు అతనికి ఉరి బిగించి చంపేశారు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని సీసల బస్తీలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఇన్ స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సీసల బస్తీలో నివాసం ఉంటున్న రాజు (45) రోజు కూలీ. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద  కూతురు ఇంటర్మీడియట్, చిన్నకూతురు 8 వ తరగతి చదువుతున్నారు. తల్లి చిన్నప్పుడే  చనిపోవడంతో తండ్రి రాజుతో కలిసి ఉంటున్నారు. తాగుడుకు బానిసైన రాజు రోజు తాగి రావటం, కూతుళ్లను హింసచటం చేసేవాడు. కొన్నిసార్లు అఘాయిత్యానికి కూడా ప్రయత్నించే వాడు. తండ్రి చేసే దారుణాలను కూతుళ్లు భయంతో భరిస్తుండేవారు. సోమవారం రాత్రి కూడా తాగిన మైకంలో
కూతుళ్లను భోజనం పెట్టాలంటూ కొట్టాడు. దీంతో విసిగిపోయిన ఇద్దరు కూతుళ్లు తండ్రిని
చంపాలని నిర్ణయించుకున్నారు. తాగి పడుకున్న తండ్రికి అర్థరాత్రి  ఉరి బిగించి మర్డర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులిద్దరూ మైనర్సే కావటంతో వారిని జువైనల్
హోమ్ కు తరలిస్తామని పోలీసులు చెప్పారు.

Latest Updates