ఈరోజే చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నిక

కొలువుదీరనున్న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు
ఉదయం 11 గంటలకు ఎక్కడికక్కడ సమావేశాలు
మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక.. కరీంనగర్​ కార్పొరేషన్​కు 29న

హైదరాబాద్‌‌, వెలుగుమున్సిపల్‌‌ చైర్‌‌ పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక కోసం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల  కొత్త పాలకవర్గాలు సోమవారం సమావేశం కానున్నాయి. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సమావేశపరుస్తారు. కలెక్టర్లు నియమించిన స్పెషల్‌‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఎక్కడికక్కడ సమావేశాలు ప్రారంభం కాగానే..  కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మున్సిపల్​ చైర్‌‌ పర్సన్‌‌, వైస్‌‌  చైర్‌‌ పర్సన్‌‌, కార్పొరేషన్​ మేయర్‌‌, డిప్యూటీ మేయర్​ ఎన్నిక చేపడుతారు. కరీంనగర్‌‌ కార్పొరేషన్‌‌ ఓట్లను సోమవారం లెక్కిస్తుండగా.. అక్కడ మేయర్‌‌, డిప్యూటీ మేయర్​ ఎన్నికను బుధవారం నిర్వహించనున్నారు.

ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఓటర్ల వివరాలను ఎలక్షన్‌‌ అథారిటీలుగా ఉన్న కమిషనర్లు ఇప్పటికే ప్రకటించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు ఎక్స్‌‌ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్‌‌ అఫీషియో సభ్యుడిగా ఓటు వేసే ఆస్కారం ఉంది. రాజ్యసభ సభ్యులు, గవర్నర్‌‌ కోటాలో, ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన సభ్యులు మాత్రం రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలోనైనా ఎక్స్‌‌ అఫీషియోగా ఆప్షన్‌‌ ఇచ్చుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్స్‌‌ అఫీషియోకు తమ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సోమవారం నిర్వహించే ఎన్నికల్లో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

చేతులు ఎత్తే పద్ధతిలో..

120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నికకు శనివారమే ఆయా యూఎల్‌‌బీల ఎలక్షన్‌‌ అథారిటీలు నోటీస్‌‌ జారీ చేశాయి. సోమవారం మధ్యాహ్నం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగానే ఏ పార్టీ మెజార్టీ స్థానాలను సాధిస్తే ఆ పార్టీ తమ అధికారిక అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఏ పార్టీకి మెజార్టీ దక్కనప్పుడు చైర్‌‌ పర్సన్‌‌, మేయర్‌‌ పదవికి పోటీ పడే వారిని ఒక సభ్యుడు ప్రతిపాదించాల్సి ఉంటుంది. మరో సభ్యుడు మద్దతు తెలిపితే వారు పోటీకి నిలుస్తారు. ఇలా ఎంతమంది పోటీలో ఉంటే వారికి మద్దతు తెలిపే వారిని చేతులు ఎత్తాలని ఎలక్షన్‌‌ అథారిటీ కోరుతుంది.  ఎవరికి ఎక్కువ మంది మద్దతు లభిస్తే వారే చైర్‌‌ పర్సన్‌‌, మేయర్‌‌గా ఎన్నికవుతారు. పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థిని ఇదే రీతిలో ప్రతిపాదించాల్సి ఉంటుంది. సదరు అభ్యర్థికి మరో సభ్యుడి ఆమోదమూ తప్పనిసరి.

పార్టీ గీత దాటితే వేటు

మేయర్‌‌, చైర్‌‌ పర్సన్‌‌ ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులు పార్టీ గీత దాటి మరో పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థికి గానీ, ఇతర ఎవరికైనా గానీ మద్దతునిస్తే ఆ సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది.  కొత్త మున్సిపల్‌‌ యాక్ట్‌‌తోపాటు చైర్​పర్సన్​, మేయర్‌‌ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మేయర్‌‌, చైర్‌‌ పర్సన్ల ఎన్నికకు విప్​ వర్తిస్తుందని ఇప్పటికే ఎస్​ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్​పర్సన్​, మేయర్​ ఎన్నిక జరిగే రోజు ఉదయం 11 గంటల్లోపు జిల్లా ఎలక్షన్‌‌ అథారిటీ (కలెక్టర్‌‌)కి సంబంధిత పార్టీలు తమ తరఫున విప్ నియామకపు పత్రాన్ని అందజేయాలి. మున్సిపల్‌‌, కార్పొరేషన్​ సమావేశం ఏర్పాటుకు గంట ముందు ఆ పార్టీ తమ సభ్యులకు విప్‌‌ జారీ చేయవచ్చు. ఎవరైనా సభ్యుడు పార్టీ విప్‌‌ను తీసుకోవడానికి నిరాకరించినా.. విప్‌‌ను ధిక్కరించి వేరేవాళ్లకు ఓటు వేసినా.. జిల్లా కలెక్టర్​కు మూడు రోజుల్లోగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుపై సంబంధిత కలెక్టర్‌‌.. ఆ సభ్యుడికి షోకాజ్‌‌ నోటీస్‌‌  ఇస్తారు. రెండు రోజుల్లోగా ఆ నోటీస్‌‌పై సదరు సభ్యుడు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఏడు రోజుల్లోగా  స్పందించకుంటే ఆ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది.

see also: ‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?

see also: ఇండియా గ్రాండ్ విక్టరీ

Latest Updates