దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ప్లానిటోరియం

  • దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ప్లానిటోరియం
  • బిర్లా మ్యూజియంలో 2డి, 3డి ఫార్మాట్​లో శాటిలైట్​ నమూనాలు

హైదరాబాద్, వెలుగునిప్పులు చిమ్ముతూ రివ్వుమంటూ ఆకాశంలోకి దూసుకెళ్లే రాకెట్ నమూనాలు బిర్లా ప్లానిటోరియంలో 2డి, 3డి నమూనాల్లో ప్రదర్శనకు ఉంచారు. అంతరిక్షంలోకి పంపిన తొలి శాటిలైట్ ఆర్యభట్ట స్పేస్ క్రాఫ్ట్ నుంచి మొన్నటి మిషన్ మంగళ్​యాన్​ దాకా ప్రాజెక్ట్ మోడల్స్, ప్రయోగాల విజయాలు ఇవన్నీ చూడొచ్చు. బీఎం బిర్లా సైన్స్ ప్లానిటోరియంలోని దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సహకారంతో ఏర్పాటైన ఈ మ్యూజియంలో భావితరాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను పొందుపరిచారు. బిర్లా పురావస్తు, సాంస్కృతిక పరిశోధన సంస్థ (బీఎసీఆర్ఐ)ను 1969లో స్థాపించింది. ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియం, డైనోసారియం, పురావస్తు ప్రదర్శన శాల, నిర్మలా బిర్లా ఆర్ట్ గ్యాలరీ, జీపీ బిర్లా అబ్జర్వేటరీ అండ్ ఆస్ట్రానామికల్ రీసెర్చ్ సెంటర్ వంటి విభిన్న రకాల మ్యూజియాలున్నాయి. ఈ ప్లానిటోరియాన్ని సందర్శిస్తే ఎన్నో కొత్త అంశాలను తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. బిర్లా మందిర్ ని సందర్శించుకోవడానికి వచ్చే అనేకమంది ఈ మ్యూజియాన్ని కూడా విజిట్ చేస్తుంటారు. శని, ఆదివారాల్లో తెలంగాణ, ఏపీలోని పలు ప్రైవేటు స్కూళ్లు తమ స్టూడెంట్స్ ని తీసుకుని మ్యూజియం చూడడానికి వస్తుంటారు. పురావస్తు తవ్వకాలు, ప్రచురణలు, దేవాలయాల పరిరక్షణ, పరిశోధనల గురించి ఇక్కడ ఎన్నో అంశాలను తెలుసుకోవచ్చు.

మొదటి స్పేస్ మ్యూజియం

జులై 26 నాటికి బిర్లా సైన్స్ మ్యూజియం 50 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇస్రో సహకారంతో దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇస్రో సాధించిన విజయాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. జీఎస్ఎల్ వీ ఎమ్ కే 3, చంద్రయాన్ లాంచ్ వెహికల్, రోహిణి, యాపిల్, చంద్రయాన్ 1, మంగళ్​యాన్​ లాంటి ఉపగ్రహాల మోడల్స్ ఉన్నాయి. మొట్టమొదటి రాకెట్ ఏ విధంగా తయారు చేశారు.. ఎలా తీసుకెళ్లారు అనే అంశాలతో పాటు స్పేస్ లోకి పంపే ప్రాజెక్ట్స్ ని ఎలా రూపొందిస్తారనే విషయాలు తెలుసుకోవచ్చు. స్పేస్ మ్యూజియంలోకి ఎంటర్ కాగానే మొదటి శాటిలైట్ ఆర్యభట్ట నుంచి మంగళ్​యాన్​ దాకా ప్రతి మోడల్​ని చూడొచ్చు. వీటికోసం ఉపయోగించిన లాంచ్​ వెహికల్​ మోడల్స్, వాటి వివరాల పట్టికల రూపంలో ఏర్పాటు చేశారు.

ఆర్యభట్ట నుంచి మంగళ్ యాన్ దాకా

ఆర్యభట్ట, భాస్కర, రోహిణి ఆర్ఎస్-1, యాపిల్, స్రాస్, ఐఆర్ఎస్ 1ఏ, ఐఆర్ఎస్-1సీ, ఐఆర్ఎస్- 1డీ, ఐఆర్ఎస్ -పీ6 / రీసోర్స్ శాట్-1, (ఫస్ట్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కేబుల్) కార్టోశాట్ -1 ఇన్ శాట్ -3 డీఆర్ (అడ్వాన్స్​డ్​ మెట్రోలాజికల్ శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అండ్ అట్మాస్ఫెరిక్ సౌండర్), జీ శాట్-16 (అడ్వాన్స్​డ్​ కమ్యూనికేషన్ శాటిలైట్), వికాస్ ఇంజిన్, చంద్రయాన్ -1, మంగళ్​యాన్​ (మార్స్ ఆర్బిటర్ మిషన్), పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్ వీ ఎంకే 3 వెహికల్​ మోడల్స్..  ఇలా ఇప్పటి దాకా ఇస్రో ప్రయోగించి సాధించిన విజయాల నమూనాలు ప్రదర్శనలో ఉంచారు.

త్వరలోనే ప్రొజెక్టర్ షో

స్పేస్ మ్యూజియంని విజిట్ చేసేందుకు వచ్చే స్కూల్ స్టూడెంట్స్ మరింత నాలెడ్జ్​ని పెంచేందుకు ప్రొజెక్టర్ ద్వారా స్పేస్ కి సంబంధించిన విజువల్స్​ని చూపించనున్నారు. స్పేస్ మ్యూజియంలో దీనికి సంబంధించి ఒక రూమ్ ఏర్పాటుచేశారు. ఈ రూమ్ లో ప్రొజెక్టర్ ద్వారా అంతరిక్షంలోకి శాటిలైట్లను ఏ విధంగా పంపిస్తారు, వాటిని ఎలా రూపొందిస్తారనే అంశాలన్నీ చూపించనున్నారు. త్వరలోనే ఈ ప్రొజెక్టర్ రూమ్ అందుబాటులోకి తేనున్నట్టు మ్యూజియం నిర్వాహకులు చెప్పారు.

 

Latest Updates