వంద మిలియన్ల ఫాలోవర్లను సాధించిన మొట్టమొదటి టిక్‌టాక్ స్టార్

అమెరికాకు చెందిన చార్లీ డి అమేలియో అనే 16 ఏళ్ల యువతి 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్లను సాధించిన మొట్టమొదటి టిక్‌టాక్ స్టార్‌గా నిలిచింది. చార్లీ ఈ ఘనతను కేవలం ఏడాదిన్నరలోనే సాధించడం విశేషం. చార్లీ తాను చేసిన డ్యాన్స్ వీడియోలను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. టిక్‌టాక్‌లో చార్లీ తర్వాత ఆడిసన్ రే 69.9 మిలియన్ల ఫాలోవర్లతో చార్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. అలాగే మరో ఇద్దరు టిక్‌టాక్ స్టార్లు 50 మిలియన్ల ఫాలోవర్లతో తర్వాతి ప్లేస్‌లో ఉన్నారు.

చార్లీకి ఉన్న ఈ ఫాలోవర్లు విల్ స్మిత్ కంటే రెండు రెట్లు, రాక్ కంటే మూడు రెట్లు, సెలెనా గోమెజ్ కంటే నాలుగు రెట్లు, కైలీ జెన్నర్ మరియు అరియానా గ్రాండే కంటే ఐదు రెట్లు ఎక్కువ.

యూట్యూబ్‌లో ఏ ఛానెల్ అయినా 100 మిలియన్ల ఫాలోవర్లను చేరడానికి 14 సంవత్సరాలు పట్టింది. కానీ చార్లీ మాత్రం ఏడాదిన్నరలోనే ఈ ఘనతను సాధించింది. ఆమె మే 2019 నుంచి టిక్‌టాక్‌లో పోస్టులు చేయడం ప్రారంభించింది.

గత సంవత్సరం ఆమెకు టిక్‌టాక్‌లో ఆరు మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆమె ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. గతవారం చార్లీ తన టిక్‌టాక్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేయడంతో దాదాపు ఒక మిలియన్ ఫాలోవర్లను కోల్పోయింది. అయినప్పటికీ ఆమె టిక్‌టాక్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లతో ఈ మైలురాయిని చేరుకుంది.

Latest Updates