నేతలపై కేసులు కొట్టేస్తున్నరు

ప్రత్యేక కోర్టున్నా ఇదే పరిస్థితి
గవర్నర్‌కు ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ నివేదిక

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను కొట్టేస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. చార్జ్‌షీట్‌లో తప్పులుండటం, విచారణకు సాక్షులను తీసుకురాకపోవడం వంటి కారణాలతో కేసులు వీగిపోతున్నాయంది. ‘ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన అన్ని కేసులను ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలి. సరైన పద్ధతిలో చర్యలు తీసుకుని శిక్ష పడేలా అధికారులను ఆదేశించాలి’ అని గవర్నర్ తమిళిసైని కోరింది. ఈ మేరకు కేసుల వివరాలతో నివేదికను సమర్పించింది. రాష్ర్టంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై 300 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏళ్ల తరబడి విచారణ జరుగుతోంది. నేతలపై నమోదైన కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైనా మార్పు లేదు. 300 కేసుల్లో ఇప్పటికి 118 కేసులనే ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఇలా బదిలీ అయిన వాటిలో 33 కొట్టేశారు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్దోషులుగా బయటపడ్డారు. మరోవైపు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం కొన్ని కేసులను ఉపసంహరించిందని, ఇది సరికాదని గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడింది.

పోలీసు శాఖ ఆధారాలు అందించాలి

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులు వీగిపోతున్నాయని, ఇలాంటప్పుడు బుక్ చేయకుంటే సరిపోతుంది కదా అని ఎఫ్‌జీజీ కార్యదర్శి  ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసులను స్పెషల్​ కోర్టకు బదిలీ చేసి సరైన పద్ధతిలో చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గుర్తు చేశారు. కోర్టులో శిక్షలు పడేలా పోలీసులు శాఖ తగిన ఆధారాలు అందించాలన్నారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

Latest Updates