ఆఖరి పోరుకు 11 మంది ఎవరు.?. రేపటి నుంచి నాలుగో టెస్ట్

  • రేపటి నుంచి నాలుగో టెస్ట్‌‌   ప్రాక్టీస్‌‌లో చెమటోడ్చిన టీమిండియా
  • సిరీస్‌‌పై గురిపెట్టిన ఆసీస్‌‌   ఉదయం 5 నుంచి సోనీ సిక్స్‌‌లో

ఓవైపు గాయాలు.. మరోవైపు కుర్రాళ్లకు అనుభవలేమి.. ఈ నేపథ్యంలో ఇండియా టీమ్‌‌‌‌ కంగారూల గడ్డపై నాలుగో టెస్ట్‌‌‌‌కు రెడీ అవుతోంది..! సిరీస్‌‌‌‌ను నిర్ణయించే మ్యాచ్‌‌‌‌ కావడంతో.. ఫిట్‌‌‌‌గా ఉన్న ఆ 11 మంది కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది..! అయితే ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై సస్పెన్స్‌‌‌‌ కొనసాగుతున్నా.. ఈసారి టీమిండియా స్ట్రాటజీ మాత్రం చాలా డిఫరెంట్‌‌‌‌గా ఉండబోతున్నది..! పేస్‌‌‌‌, బౌన్స్‌‌‌‌కు నిలయమైన గబ్బా పిచ్‌‌‌‌పై.. కుర్ర పేసర్లతోనే ఆసీస్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది..! స్టార్లు, సీనియర్లు లేక బలహీనపడిన టీమ్‌‌‌‌తోనే బలమైన దెబ్బకొట్టాలని భావిస్తున్న రహానె బృందం.. బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీని నిలబెట్టుకోవడమే టార్గెట్‌‌‌‌గా బరిలోకి దిగబోతున్నది..!!

బ్రిస్బేన్‌‌‌‌: దాదాపు రెండున్నర నెలలుగా కొనసాగుతున్న టీమిండియా… ఆస్ట్రేలియా పర్యటన ఆఖరి అంకానికి చేరుకుంది. వన్డే, టీ20 సిరీస్‌‌‌‌ల్లో సమానంగా నిలిచిన ఇరుజట్లు.. లాస్ట్‌‌‌‌ పంచ్‌‌‌‌ ఎవరిదో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి బ్రిస్బేన్‌‌‌‌లో జరిగే నాలుగో టెస్ట్‌‌‌‌లో ఇండియా, ఆసీస్‌‌‌‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు మ్యాచ్‌‌‌‌ల బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీ.. ప్రస్తుతం 1–1తో సమంగా ఉంది. దీంతో ట్రోఫీని దక్కించుకోవాలన్న ఏకైక టార్గెట్‌‌‌‌తో రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. సిడ్నీ టెస్ట్‌‌‌‌ను అద్భుతంగా కాపాడుకున్న రహానె సేనలో చాలా మంది గాయాలతో ఇబ్బందిపడుతున్నారు. మ్యాచ్‌‌‌‌ టైమ్‌‌‌‌కు వీళ్లంతా ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధిస్తే ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో టీమిండియా కంప్లీట్‌‌‌‌గా కుర్రాళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలే కఠిన సవాలు విసిరే గబ్బా పిచ్‌‌‌‌పై యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ తో ఎంతమేరకు ఆసీస్‌‌‌‌ను నిలువరిస్తుంది..? అన్నదే అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇక అపోజిషన్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఫామ్‌‌‌‌లేమితో ఇబ్బందిపడుతున్నది. ఫలితంగా ఇరుజట్ల ఫైనల్‌‌‌‌ ఎలెవెన్‌‌‌‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

కూర్పు ఎలా..?

నాలుగో టెస్ట్‌‌‌‌కు తుది కూర్పు ఎలా అన్నదానిపైనే రవి అండ్‌‌‌‌ కో తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్‌‌‌‌ సెషన్‌‌‌‌లో ప్రతి ఒక్క ప్లేయర్‌‌‌‌ను పరిశీలించారు. వాళ్ల శక్తి సామర్థ్యాలను అంచనా వేశారు. ఓపెనర్లు రోహిత్‌‌‌‌, గిల్‌‌‌‌కు తిరుగులేదు. ఈ ఇద్దరు మరోసారి మెరిస్తే భారీ స్కోరు ఖాయం. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో పుజారా, ఆ తర్వాత రహానె ఫర్వాలేదనిపిస్తున్నా.. అసలు మిడిలార్డర్‌‌‌‌ భారం మోసేదెవరు? థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో హిట్టింగ్‌‌‌‌తో అదరగొట్టిన పంత్‌‌‌‌ గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దీనిని నుంచి అతను పూర్తిగా కోలుకుంటే ఇండియా కష్టాలు తీరినట్లే. ఒకవేళ పంత్‌‌‌‌ లేకపోతే సాహాకు చాన్స్‌‌‌‌ ఇవ్వాల్సిందే. అయితే ఆరో ప్లేస్‌‌‌‌లో ఎవర్ని తీసుకోవాలన్నదే ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. నెట్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌లో గాయపడిన మయాంక్‌‌‌‌ వైపు మొగ్గుతారా? ఫామ్‌‌‌‌లో లేని పృథ్వీ షాను తీసుకొస్తారా? మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏం నిర్ణయిస్తుందో చూడాలి. ఏడో స్థానంలో అశ్విన్‌‌‌‌ ఆకట్టుకున్నాడు. కానీ బ్యాక్‌‌‌‌ పెయిన్‌‌‌‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌లో అతను ఆడేందుకు 40 శాతం చాన్సెస్‌‌‌‌ మాత్రమే ఉన్నాయి.  ఒకవేళ అశ్విన్‌‌‌‌ అందుబాటులో లేకపోతే.. సుందర్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. అయితే కేవలం స్పిన్‌‌‌‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే కుల్దీప్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ దక్కొచ్చు. కానీ బ్యాటింగ్‌‌‌‌ కూడా కావాలనుకుంటే సుందర్‌‌‌‌ను తీసుకోవాల్సిందే. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో సుందర్‌‌‌‌ ఉపయుక్తమైన బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌. ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో 31.29 యావరేజ్‌‌‌‌ ఉంది.

నలుగురు పేసర్లు..

ఇప్పటివరకు జరిగిన మూడు టెస్ట్‌‌‌‌ల్లో ఇండియా ఐదుగురు బౌలర్ల స్ట్రాటజీని అవలంబించింది. ఇప్పుడు కూడా అదే వ్యూహానికి కట్టుబడి ఉన్నా.. పేస్‌‌‌‌, స్పిన్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ను ఎలా వర్కౌట్‌‌‌‌ చేస్తారన్నదే ప్రశ్న. ఎందుకంటే స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ జడేజా కంప్లీట్‌‌‌‌గా అందుబాటులో లేడు. అశ్విన్‌‌‌‌ ఆడటం కష్టమే. దీంతో నలుగురు పేసర్లు సిరాజ్‌‌‌‌, శార్దూల్‌‌‌‌, సైనీ, ఠాకూర్‌‌‌‌తో పాటు ఏకైక స్పిన్నర్‌‌‌‌గా కుల్దీప్‌‌‌‌, సుందర్‌‌‌‌లో ఒకర్ని తీసుకోవాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ భావిస్తోంది. ఒకవేళ అశ్విన్‌‌‌‌ వచ్చినా.. ఇదే స్ట్రాటజీని  అమలు చేసినా ఆశ్చర్యంలేదు.

వార్నర్‌‌‌‌పైనే దృష్టి

ఇంజ్యురీస్‌‌‌‌తో వీక్‌‌‌‌ అయిన ఇండియాను దెబ్బకొట్టి సిరీస్‌‌‌‌ను పట్టేయాలని భావిస్తున్న ఆసీస్‌‌‌‌ కూడా భారీ కసరత్తులే మొదలుపెట్టింది. అయితే మిగతా విషయాల కంటే డేవిడ్​ వార్నర్‌‌‌‌ ఫామ్‌‌‌‌పైనే అందరూ దృష్టిపెట్టారు. లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఫెయిలైన వార్నర్‌‌‌‌ గాడిలో పడితే మంచి ఆరంభం లభిస్తుందని ఆశిస్తోంది. రెండో ఓపెనర్‌‌‌‌గా పుకోవ్‌‌‌‌స్కీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షోల్డర్‌‌‌‌ ఇంజ్యురీ నుంచి అతను కోలుకుంటే టీమ్‌‌‌‌లోకి వస్తాడు. లేదంటే అతని స్థానంలో మార్క్‌‌‌‌ హారిస్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌ చేస్తాడని కోచ్‌‌‌‌ జస్టిన్​ లాంగర్‌‌‌‌ సంకేతాలిచ్చాడు. పుకోవ్‌‌‌‌స్కీ ప్రాక్టీస్‌‌‌‌కు కూడా రాకపోవడంతో అతను ఆడటంపై సందేహాలు మరింత పెరిగాయి. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో  స్టీవ్​ స్మిత్‌‌‌‌, మార్నస్​ లబుషేన్‌‌‌‌, కామోరూన్​ గ్రీన్‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌లో ఉండటం ఆసీస్‌‌‌‌కు కలిసొచ్చే అంశం. వేడ్‌‌‌‌, పైన్‌‌‌‌ బ్యాట్లు ఝుళిపించాల్సిన అవసరం చాలా ఉంది. ఇన్నాళ్లూ బలంగా కనిపించిన ఆసీస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌పై ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌‌‌‌కు బౌలింగ్‌‌‌‌ మార్పులు చేయకపోయినా.. స్టార్క్‌‌‌‌, కమిన్స్‌‌‌‌, హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌పై ఒత్తిడి మాత్రం ఉంది.

ఫుల్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌

నాలుగో టెస్ట్‌‌‌‌కు పెద్దగా టైమ్‌‌‌‌ లేకపోవడంతో టీమిండియా బుధవారమే ప్రాక్టీస్‌‌‌‌లోకి దిగిపోయింది. అబ్డామినల్‌‌‌‌ స్ట్రెయిన్‌‌‌‌తో బాధపడుతున్న పేసర్‌‌‌‌ బుమ్రా కూడా ట్రెయినింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌కు వచ్చాడు. అయితే ప్రాక్టీస్‌‌‌‌ చేయకుండా కోచ్‌‌‌‌ భరత్‌‌‌‌ అరుణ్‌‌‌‌తో మాట్లాడాడు. రోహిత్‌‌‌‌, గిల్‌‌‌‌, రహానె.. నెట్స్‌‌‌‌లో చెమటోడ్చారు. ‘సిడ్నీలో అద్భుతమైన పోరాటం తర్వాత టీమ్‌‌‌‌ రీ గ్రూప్‌‌‌‌ అయ్యింది. ఫైనల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ కోసం గబ్బాలో మా ప్రిపరేషన్స్‌‌‌‌ మొదలుపెట్టాం’ అని బీసీసీఐ ట్వీట్‌‌‌‌ చేసింది.  చైనామన్‌‌‌‌ బౌలర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌.. నెట్స్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌ చేశాడు. జడేజా ప్లేస్‌‌‌‌లో అతనికి చాన్స్‌‌‌‌ రావొచ్చనే సంకేతాలున్నాయి. శార్దూల్‌‌‌‌, సుందర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌తో బిజీగా గడిపారు. టీమ్‌‌‌‌ మొత్తాన్ని అడ్రెస్‌‌‌‌ చేస్తూ చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి మాట్లాడాడు.  ఆ తర్వాత ఫైనల్‌‌‌‌ ఎలెవెన్‌‌‌‌ గురించి సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌తోనూ డిస్కస్‌‌‌‌ చేశాడు. రోహిత్‌‌‌‌.. కుర్రాళ్లకు విలువైన సూచనలు ఇస్తూ కనిపించాడు.

జట్లు (అంచనా)

ఇండియా: రహానె (కెప్టెన్‌‌‌‌), రోహిత్‌‌‌‌, గిల్‌‌‌‌, పుజారా, మయాంక్‌‌‌‌ / పృథ్వీ, పంత్‌‌‌‌, అశ్విన్‌‌‌‌ / సుందర్‌‌‌‌, సిరాజ్‌‌‌‌, సైనీ, శార్దూల్‌‌‌‌, నటరాజన్‌‌‌‌.

ఆస్ట్రేలియా: పైన్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), వార్నర్‌‌‌‌, పుకోవ్‌‌‌‌స్కీ / హారిస్‌‌‌‌, లబుషేన్‌‌‌‌, స్మిత్‌‌‌‌, గ్రీన్‌‌‌‌, వేడ్‌‌‌‌, స్టార్క్‌‌‌‌, కమిన్స్‌‌‌‌, లైయన్‌‌‌‌, హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌.

Latest Updates