కార్డు లేనోళ్లకు రేషన్ ఉత్తదే..సీఎం ప్రకటించినా బియ్యం అందట్లే

హైదరాబాద్‌‌, వెలుగురేషన్‌‌ కార్డు లేకున్నా ఉచితంగా బియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అది ఆచరణకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా మంది రేషన్‌‌ కార్డు కోసం దరఖాస్తు చేసి ఏండ్లుగా ఎదురుచూస్తున్నరు. రేషన్‌‌ కార్డు లేకున్నా రేషన్‌‌ అందిస్తామని, రాష్ట్రంలో ఎవరినీ ఆకలితో అలమటించనీయమని ఇటీవల సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు వారి ఆధార్‌‌ కార్డును ఆధారం గుర్తించి 12కిలోల బియ్యం, రూ.500 ప్రభుత్వం అందిస్తోంది. కానీ మన రాష్ట్రంలో రేషన్‌‌ కార్డుకు దరఖాస్తు చేసుకొని పెండింగ్‌‌లో ఉన్న వారికి మాత్రం రేషన్‌‌ అందడం లేదు.

5 లక్షల 63వేల 138 కుటుంబాల ఎదురు చూపులు..

కుటుంబాల్లో పిల్లల పెండ్లిళ్లు, వేర్వేరు సంసారాలు కావడంతో లక్షల్లో కొత్త ఫ్యామిలీలు ఏర్పడ్డయి. వీరంతా రేషన్‌‌ కార్డుల కోసం మీ సేవ సెంటర్లు, పౌరసరఫరాల శాఖ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకున్నారు. పౌరసరఫరాల శాఖ, డీఎస్‌‌వో, తహసీల్దార్‌‌ ఆఫీసుల్లో ఇప్పటికే చేసుకున్న 5,63,138 దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉన్నాయి.

పెండింగ్‌‌తో కోల్పోతున్న రేషన్‌‌..

కార్డు కోసం ఎదురుచూసిన వారంతా నేడు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో పేదలకు రేషన్‌‌ అందడం లేదు. దీంతో కరోనా కాలంలో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. లాక్‌‌డౌన్‌‌తో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాలు ఆదుకునే ప్రోగ్రామ్స్‌‌ చేస్తున్నారు. తాజాగా రేషన్‌‌ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి, అసలు కార్డు లేని పేదలకు కూడా రేషన్‌‌ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్‌‌ నోటి మాటగా ప్రకటించారు తప్పితే అందుకు అవసరమైన గైడ్‌‌లైన్స్‌‌ ఏవీ ప్రకటించలేదు. దీంతో సర్కారు నుంచి వారికి ఎటువంటి సాయం అదడంలేదు.

20 లక్షల మందికి బియ్యం అందుతలేవ్‌‌…

రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా 35,166 దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉండగా,  నల్గొండ 30,071, హైదరాబాద్‌‌లో 30,045, సంగారెడ్డి 27,101, ఖమ్మంలో 26,956, వికారాబాద్‌‌లో 26,742, నిజామాద్‌‌లో 20,592 ఇలా రాష్ట్రవ్యాప్తంగా 5.63లక్షల దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉన్నాయి.  దీంతో దాదాపు 20 లక్షల మంది ఉచిత రేషన్‌‌ అందుకోలేక పోతున్నారు.

Latest Updates