లాక్ డౌన్ పై సర్కారు డైలమా..సగం సిటీ ఖాళీ!

లాక్ డౌన్ పై సర్కారు డైలమా..సగం సిటీ ఖాళీ!
  • ఎక్కడ చూసినా లాక్​డౌన్​పైనే చర్చ.. మంత్రులు, ఆఫీసర్లలోనూ ఇదే ముచ్చట
  • కేసుల పరిస్థితిపై సీఎంకు ఎప్పటికప్పుడు రిపోర్టులు
  • లాక్​డౌన్​తో ఆర్థిక పరిస్థితి దిగజారుతుందంటున్న ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్

గ్రేటర్ హైదరాబాద్​లో మళ్లీ లాక్ డౌన్ పెట్టాలా? వద్దా? అనే విషయంపై రాష్ట్ర సర్కారు ఎటూ తేల్చుకోలేకపోతున్నది. మూడు నాలుగు రోజుల్లో కేబినెట్​ సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఫైనల్​ డెసిషన్​ తీసుకుంటామని సీఎం ప్రకటించి ఐదురోజులవుతోంది. అయినా.. ఇంతవరకు కేబినెట్​ భేటీ ఎప్పుడన్న దానిపై కూడా నిర్ణయం జరుగలేదు. మళ్లీ లాక్​డౌన్​ ఉండొచ్చన్న వార్తలతో ఐదురోజులుగా వలసజీవులు హైదరాబాద్​ను ఖాళీ చేసి సొంతూళ్ల బాటపట్టారు. లాక్​డౌన్​ పెడితే తమకు పూటగడవడం కష్టమవుతుందని గ్రేటర్​లోని చిన్న చిన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు సీనియర్​ ఆఫీసర్లు మాత్రం ‘కేబినెట్​ భేటీ లేదు.. లాక్​డౌన్​ లేదు’ అని అంటున్నారు. ప్రభుత్వమేమో క్లారిటీ ఇవ్వలేక ఊగిసలాడుతోంది.

హైదరాబాద్, వెలుగు: గత ఐదురోజులుగా ఏ ఇద్దరు ఎదురైనా.. ఫోన్​లో మాట్లాడుకున్నా.. ‘‘మళ్లీ హైదరాబాద్​లో లాక్​డౌన్​ అంటున్నరు. ఏంది నిజమేనా..? ఎప్పట్నించి పెడుతరట’’ అని మాట్లాడుకుంటున్నారు. ఆఫీసర్లలోనూ.. టీఆర్​ఎస్​ లీడర్లలోనూ ఇదే చర్చ. మంత్రుల పేషీల్లో కూడా దీనిపైనే ముచ్చట్లు. కిరాణ షాపు ఓనర్లు, సూపర్ మార్కెట్లు, హోటల్ నిర్వాహుకులు, చిన్నచిన్న వ్యాపారుల వరకు లాక్ డౌన్ ఎప్పుడని ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం మాత్రం డైలమాలో ఉంది. జూన్ 28న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్​ హైదరాబాద్​లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పాజిటివ్ కేసుల ఉధృతిని అడ్డుకోవచ్చని హెల్త్ డిపార్ట్​మెంట్ ప్రతిపాదించింది. లాక్ డౌన్ అంశంపై మూడునాలుగు రోజుల్లో కేబినెట్ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలా ప్రకటించి ఐదు రోజులవుతున్నా ఎలాంటి నిర్ణయం జరుగలేదు. అసలు లాక్ డౌన్ ఉంటుందా.. లేదా.. అనే విషయం మంత్రులకు కూడా తెలియట్లేదు. ‘‘మళ్లీ లాక్ డౌన్ అంటూ సీఎం కేసీఆర్ ఎందుకు ప్రకటించారో, ఆయన మనస్సులో ఏముందో ఎవరికి అంతుపట్టడం లేదు’’ అని ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

లాక్ డౌన్ ఎప్పట్నించి విధిస్తారనే దానిపై ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​ స్పందిస్తూ.. ‘కేబినెట్ లేదు.. లాక్ డౌన్ లేదు’ అని కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని, లాక్ డౌన్ నిర్ణయం కోసం కేబినెట్ ప్రత్యేకంగా భేటీ జరపాల్సిన పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ లాక్ 2.0 అమలవుతుంటే మళ్లీ లాక్ డౌన్ ఎందుకని ప్రశ్నించారు. ఓ మంత్రి స్పందిస్తూ.. ‘‘అన్ని సిటీల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. హైదరాబాద్ ను ప్రత్యేకంగా చూడొద్దు. ప్రజలు జాగ్రత్తగా ఉంటే చాలు’’ అని అన్నారు. ఒకవేళ మళ్లీ లాక్ డౌన్ అమలు చేయాలని అనుకుంటే సీఎం పరిధిలో నిర్ణయం తీసుకుంటే చాలని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసుల పరిస్థితిపై సీఎంకు అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నారు.

ఆదాయం పడిపోతుందనే..!

గ్రేటర్​లో లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఆందోళన చెందుతోంది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత పుంజుకుంటున్న ఆర్థిక పరిస్థితి.. మళ్లీ ఫుల్​ లాక్​డౌన్​ పెడితే దిగజారే ప్రమాదం ఉందని భావిస్తోంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో వచ్చే రాబడిలో గ్రేటర్ నుంచే 50 శాతంపైగా వస్తుంది. జూన్​ నెలలో స్టేట్ ఓన్ టాక్స్ రూపంలో దాదాపు 6 వేల కోట్ల రాబడి వచ్చింది. ఇందులో సగం గ్రేటర్ పరిధి నుంచే వచ్చిందని, మళ్లీ ఇక్కడ ఫుల్​ లాక్ డౌన్ పెడితే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ అభిప్రాయపడుతోంది.

సగం సిటీ ఖాళీ!

మళ్లీ లాక్ డౌన్ ఉంటుందన్న వార్తలతో హైదరాబాద్​ సగం ఖాళీ అయిందని ప్రభుత్వ వర్గాలు అంచనాకు వచ్చాయి. రోడ్లపై వెహికల్స్ రద్దీ తగ్గింది. బిజీగా ఉండే ప్రాంతాలు కూడా బోసిపోతున్నాయి. చాలా చోట్ల వ్యాపారస్తులు సెల్ఫ్​ లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు. దీంతో సిటీలో ప్రజల కదలికలు తగ్గాయని సీఎం కేసీఆర్ కు ఆఫీసర్లు రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. మళ్లీ లాక్ డౌన్ విధిస్తామనే ప్రకటన ప్రజలను అలర్ట్​ చేసిందని ఓ పోలీసు ఆఫీసర్​ అన్నారు. ఇప్పటికే ఐటీ సంస్థలు వర్క్ ప్రం హోం అవకాశం ఇవ్వడంతో టెకీలు సొంతూళ్లలోనే ఉంటూ పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో ఒక్కరోజే 1213 మందికి కరోనా