15 లక్షల ఎకరాల్లో పంటలు మునిగినా పట్టించుకుంటలె

  • పంటనష్టం అంచనా వేయని అధికారులు
  • ఆగస్టులో ప్రైమరీ రిపోర్ట్ తెప్పించుకున్న ప్రభుత్వం
  • 3.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు నివేదిక
  • సెప్టెంబర్​లో నష్టం నివేదిక  ఊసే ఎత్తని సర్కార్
  • ఫసల్ బీమా అమలు చేయలె.. ఇన్​పుట్ సబ్సిడీ ఇస్తలె

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు15 లక్షల ఎకరాల్లో పంటలు డ్యామేజ్ అయ్యాయి. వానలు, వరదలతో వరి, పత్తి, మిరప, సోయా, కంది, పెసర వంటి ప్రధాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పునాస పంటలు ఇలా చేతికందే దశలోనే వానలపాలు అయిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు బీమా లేకపోవడంతో పరిహారం వచ్చే పరిస్థితి లేదు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వమైనా పరిహారం ఇచ్చి ఆదుకుంటుందేమోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా మొగ్గు చూపడం లేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతులు నిండా మునిగిపోక తప్పని పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో రెండు నెలలుగా కురిసిన వానలు రైతులను నిండా ముంచేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 26 జిల్లాల్లో ఏకధాటిగా కురిసిన వానల వల్ల సుమారు15 లక్షల ఎకరాల్లో పంటలు డ్యామేజ్ అయ్యాయి. ప్రధానంగా వరి, పత్తి, కంది, పెసర వంటి పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. ఆగస్టులో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని పంటలు ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. ఈ నెలలో ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, కామారెడ్డి, కరీంనగర్‌‌‌‌ జిల్లాల్లో పంటలకు పెద్ద ఎత్తన నష్టం జరిగింది. వరిపొలాలు వెన్ను ఈనే దశలో వానలు పడుతుండటంతో నేలవాలుతున్నాయి. పత్తి చేన్లకు పూత రాలుతూ.. కాత దశలో పంటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. కంది, పెసర, మిరప వంటి పంటలూ డ్యామేజ్ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆదేశాలు రాలే..

రాష్ట్రంలో వర్షాల వల్ల పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా ప్రభుత్వం మొగ్గు చూపడంలేదు. గతనెలలో వ్యవసాయ శాఖ మండలాలు, జిల్లాలవారీగా పంటనష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్రమంతటా కలిపి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు డ్యామేజ్ అయ్యాయని తేలినట్లు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. 3,200 గ్రామాల్లో 1.80 లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపింది. అయితే, గతనెలలోనే రాష్ట్రవ్యాప్తంగా10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని భావిస్తున్నారు. ఇక ఈ నెలలో అసలు పంట నష్టాన్ని అంచనా వేయాలన్న ఆదేశాలు సైతం ప్రభుత్వం నుంచి రాలేదని అధికారులు చెప్తున్నారు. రైతులవారీగా ఏఈవోలు వివరాలు సేకరించి, క్లస్టర్ వారీగా నివేదికలు సిద్ధం చేశారని, ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఈ నెలకు సంబంధించిన నివేదికల ఊసే ఎత్తడం లేదని అంటున్నారు. అయితే ఈ నెలలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు డ్యామేజ్ అయ్యాయని రెండు నెలల్లో కలిపి 15 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని పేర్కొంటున్నారు.

ఆదుకునే ఆలోచన చేయని సర్కార్

సర్కార్ వైఖరిని చూస్తుంటే.. పంట నష్టం జరిగితే రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో రైతుల వ్యక్తిగత వివరాలు, పంట వివరాలు, ఆధార్‌‌‌‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుల బ్యాంక్‌‌‌‌ వైజ్‌‌‌‌ డీటెయిల్స్‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టులో పంట నష్టం జరిగి నెలరోజులైనా  ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆగస్టులో హడావుడిగా అంచనా వేసిన 3.50 లక్షల ఎకరాల పంట నష్టం వివరాలు తప్పితే.. ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయి నివేదిక కూడా లేదని, అసలు ఫుల్ డీటైల్స్ తీసుకోవాలన్న ఆలోచనా సర్కారుకు లేదని తెలుస్తోంది.

రైతులు మునగాల్సిందేనా? 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అమలు చేయలేదు. దీంతో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేక బీమా పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోయింది. గత రెండు సంవత్సరాల్లో ఫసల్ బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 513 కోట్ల ప్రీమియం కట్టాల్సి ఉండగా, పెండింగ్ లో పెట్టింది. దీంతో పంటలు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ. 960 కోట్ల పరిహారం సొమ్మును బీమా కంపెనీలు చెల్లించలేదు. ఈసారి ఫసల్ బీమాను అసలు అమలే చేయకపోవడంతో ఇన్సూరెన్సే లేకుండాపోయింది. ఇక పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ఒక్క రూపాయి ఇన్ పుట్ సబ్సిడీని కూడా విడుదల చేయడం లేదు. ఈసారైనా ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ రిలీజ్ చేయకుంటే పంటలు నష్టపోయిన రైతులు నిండా మునగక తప్పని పరిస్థితి నెలకొంది.

Latest Updates