మున్సిపోల్స్​కు హైకోర్టు గ్రీన్​సిగ్నల్

  • ఎన్నికల నిర్వహణపై స్టేలు ఎత్తివేసిన హైకోర్టు
  • ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్​ రద్దు
  • కొత్త నోటిఫికేషన్​ ఇవ్వండి
  • జనం అభ్యంతరాలు తీసుకుని పరిష్కరించండి
  • 14 రోజులు గడువు ఇవ్వండి
  • అన్ని వివరాలతో ఈసీకి రిపోర్టు అందించండి
  • ఆ తర్వాతే ఎలక్షన్​ ప్రక్రియ మొదలవుతుంది
  • అంతా చట్ట ప్రకారం చేయాల్సిందేనని ఆదేశం

హైదరాబాద్​, వెలుగు:

మున్సిపల్​ ఎన్నికలకు హైకోర్టు లైన్​ క్లియర్​ చేసింది. అయితే, పాత నోటిఫికేషన్​ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్​ను ఇవ్వాలని ఆదేశించింది. ఓటర్ల లెక్కింపు, జాబితా తయారీ, వార్డుల విభజన వంటి అంశాలపై జులై 7న సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్​ను రద్దు చేసింది. తాజాగా నోటిఫికేషన్​ ఇవ్వాలని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందేనని తేల్చి చెప్పింది. అభ్యంతరాలు తీసుకునేందుకు 7 రోజులు, వాటిని పరిష్కరించేందుకు మరో 7 రోజుల టైం ఇచ్చింది.

15వ రోజు మున్సిపల్​ శాఖ డైరెక్టర్​కు కమిషనర్లు నివేదికఇవ్వాలని ఆదేశించింది. ఆయా నివేదికల ఆధారంగా మున్సిపల్​ డైరెక్టర్​ తుది నివేదికను తయారు చేసి సర్కారుకు అందించాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్​ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎ.రాజశేఖర్​ రెడ్డి తీర్పు చెప్పారు. ‘‘సర్కారు తరఫున మున్సిపల్​ శాఖ కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు నివేదిక ఇచ్చాక ఎన్నికల ప్రక్రియ షురూ అవుతుంది. అందుకు ముందస్తు ప్రక్రియను చేపట్టాలి. ఇప్పటికే పలు మున్సిపాలిటీలపై ఉన్న స్టే ఆర్డర్లను కొట్టేస్తున్నాం” అని జస్టిస్​ ఎ. రాజశేఖర్​రెడ్డి తెలిపారు. అభ్యంతరాలన్నింటినీ జీవో 78 ప్రకారం పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కరించలేకపోతే ఎందుకో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అధికారులు ఇష్టమొచ్చినట్టు చేయడం వల్లే…

వార్డుల విభజనప్పుడు ఓటర్ల మధ్య తేడా పది శాతం మించకూడదన్న నిబంధన అమలు కాలేదని, ఓటర్లను శాస్త్రీయ పద్ధతుల్లో విభజన చేయకుండా వార్డు మధ్యలోని వాళ్లను తీసుకెళ్లి వేరే వార్డులో చేర్చారని, ఇలాంటి చర్యల వల్ల వార్డుల్లో రిజర్వేషన్లు తారుమారయ్యాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల లెక్కింపు, రిజర్వేషన్లను తప్పులతడకగా చేశారని పేర్కొంటూ వేసిన 79కి పైగా రిట్లను హైకోర్టు అనుమతించింది. ఆయా రిట్లపై గతంలో జారీ అయిన స్టే ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. వాటితోపాటు పాలమూరు, కరీంనగర్​, వరంగల్​ వంటి కార్పొరేషన్లపై ఉన్న స్టేలనూ ఎత్తేసింది. అధికారులు నిర్లక్ష్యంగా ఇష్టమొచ్చినట్టు చేయడం వల్లే ఈ సమస్యలొచ్చాయని జస్టిస్​ రాజశేఖర్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాను ఉన్నది ఉన్నట్టుగా తయారు చేయడంలో సమస్య ఎందుకొచ్చిందో అర్థం కాలేదన్నారు. మున్సిపల్​ చట్టంలోని 4, 5, 7, 8 సెక్షన్ల కింద ముందస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. నోటిఫికేషన్​ ఇచ్చిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన సమాచారాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని సూచించారు. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలకు ఉపయోగించిన ఓటర్ల జాబితా ప్రకారం మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించొచ్చన్నారు.

రెవెన్యూ, సబ్ ​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లోనూ అంతే

రెవెన్యూ, సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయని, వాటితో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని జస్టిస్​ ఎ. రాజేశ్వర్​రెడ్డి అన్నారు. ఆఫీసుల్లో సరిగ్గా పనిచేస్తే చాలా కేసులు కోర్టులకు వచ్చే అవకాశాలే ఉండవన్నారు. ‘‘పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు నమోదు చేస్తారు. వాటిని  సరిచేయాలని రైతులు తిరగాల్సిన పరిస్థితి. ఇవన్నీ కేసుల విచారణ సందర్భంగా మాకు అవుతున్న అనుభవాలు. కోర్టులు ఆగ్రహిస్తేనో, కోర్టు ధిక్కార కేసులు వేస్తేనో, ఉన్నతాధికారులు మండిపడితేనో పనులు అవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి అడిషనల్​ అడ్వొకేట్​ జనరల్​ చెప్పాలి” అని ఆయన ఆదేశించారు.

The High Court cleared the line for the municipal elections.

Latest Updates