కరోనాపై కేసులను మీకు వ్యతిరేకమనుకుంటే ఎట్ల?

హైదరాబాద్, వెలుగు‘‘కరోనా అంశంపై కోర్టుల్లో కేసులు నమోదైతే అవి మీకు వ్యతిరేకమనుకోవద్దు. వాటిని ప్రజల కోసం దాఖలయ్యే పిటిషన్లుగానే చూడాలి” అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హితవుపలికింది. ‘‘ప్రజాహితం కోసమే కోర్టులు ఉత్తర్వులు ఇస్తాయి. కోర్టు ఆదేశాల్ని అమలు చేయకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ తీరును ఏ విధంగా అర్థం చేసుకోవాలి?” అని ఘాటుగా వ్యాఖ్యానించింది.  ఇలాంటి కేసుల విషయంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వమే ముందుకు రావాలని సూచించింది. ‘‘ ప్రజల సంక్షేమం, రక్షణ, ఆరోగ్యానికి పెద్దపీట వేయడమే ప్రభుత్వాల ప్రధాన ధ్యేయంగా ఉండాలి” అని వ్యాఖ్యానించింది. శ్రామిక్‌  రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ రెడీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రెడీగా లేదని హైకోర్టు ప్రశ్నించింది.  వలస కార్మికులకు వసతి, ఆహారం అందించడంపై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ రిటైర్డ్​ లెక్చరర్‌ జీవన్‌కుమార్‌ దాఖలు చేసిన పిల్‌ను మంగళవారం చీఫ్  జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్​ మరోసారి విచారించింది.

వలస కార్మికుల సంక్షేమం పట్టదా?

వలస కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్న తమ ఉత్తర్వులు అమలు కావడం లేదని, ఈ విషయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లి చూస్తే కనిపిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అప్లికేషన్​ పెట్టుకున్న 24గంటల్లో శ్రామిక రైళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం చెబుతుంటే జిల్లా కలెక్టర్లు ఎందుకు అప్లయ్​ చేయడం లేదని ప్రశ్నించింది. వివిధ జిల్లాల్లోని ఇటుక బట్టీ కార్మికులు తొమ్మిది వేల మంది వరకూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో రద్దీ పెరిగిపోయిందని పిటిషనర్​ తరఫు అడ్వకేట్​ వసుధా నాగరాజ్​ కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు ఆదేశించినా వారికి ఆహారం, వసతి, వైద్యం వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. శ్రామిక్‌ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని, ఈ నెల 1 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ వినతీ రాలేదని రైల్వే తరఫు స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు  పి.కౌర్‌ చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రత్యేక రైళ్ల కోసం ఒక్క జిల్లా కలెక్టర్‌ కూడా అప్లికేషన్‌ పెట్టలేదంటే ఏపాటి శ్రద్ధ చూపుతున్నారో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ‘‘శ్రామిక్‌ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉన్నా ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు. శ్రామిక్‌ రైళ్లు కావాలని ఒక్క జిల్లా కలెక్టర్‌ కూడా అప్లికేషన్‌ పెట్టలేదంటే.. కోర్టు ఆదేశాలు అమలు కాలేదంటే.. ఏ విధంగా భావించాలి?” అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వలస కార్మికుల్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిందని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పడంతో విచారణ బుధవారానికి
వాయిదా వేసింది.

ఆఫీసులు ఓపెన్..పనులు క్లోజ్ 

Latest Updates