ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్లు చనిపోతే ఎవరిది బాధ్యత.?

  • ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
  • కరోనా తీవ్రంగా ఉంటే ఎగ్జామ్ స్ కు పర్మిషన్ ఎట్ల అడుగుతరు?
  • స్టూడెంట్ల ప్రాణాలను ఫణంగా పెట్టలేం
  • పరీక్షల నిర్వహణ కంటే స్టూడెంట్ల జీవితాలే ముఖ్యమని స్పష్టం
  • హైకోర్టు నిర్ణయం తర్వాత ఎగ్జామ్స్ వాయిదా వేసిన ప్రభుత్వం
  • మళ్లీ ఎగ్జామ్స్ ఎప్పుడనే దానిపై నో క్లారిటీ
  • పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇచ్చే అంశంపై ఆలోచన!
  • సీఎంతో చర్చించాకే నిర్ణయమన్న ​మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్, వెలుగు: టెన్త్ పరీక్షల సమయంలో కరోనా సోకి ఎవరైనా అమాయక స్టూడెంట్ చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘మరణించిన స్టూడెంట్ కుటుంబానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చి ఆదుకుంటుంది? ఎన్ని కోట్లు ఇస్తే ఆ విద్యార్థి బతికి వస్తాడు? ఆ కుటుంబ కన్నీళ్లను ఎలా ఆపగలరు?’’ అని చీఫ్ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల బెంచ్ నిలదీసింది. హైదరాబాద్​లో పరీక్షా కేంద్రాలు ఉన్న ఏరియాలు కంటెయిన్​మెంట్ జోన్లుగా మారితే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీసింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో స్టూడెంట్ల ప్రాణాలను ఫణంగా పెట్టి పరీక్షలను నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పరీక్షల నిర్వహణ కంటే స్టూడెంట్ల ఆరోగ్యం, జీవితాలే ముఖ్యమని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున టెన్త్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ అనే వ్యక్తి పిల్ వేశారు. పరీక్షలను జరపరాదంటూ సీహెచ్‌ సాయిమణి వరుణ్‌ వేసిన పిల్, పరీక్షలు నిర్వహించకుండానే గ్రేడింగ్‌ ఇచ్చి ఫలితాలు వెల్లడించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వేసిన పిల్‌ను కలిపి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది.

ప్రాణాలు ముఖ్యమా? పేపర్ల సమస్యలు ముఖ్యమా?

జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో పరీక్షలను సోమవారం నుంచి నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖ సూచనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వ్యతిరేకించడంతో హైకోర్టు సీరియస్ అయింది. రెండుసార్లు పేపర్లను తయారు చేయడం కష్టమని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి స్టూడెంట్ల ప్రాణాలు ముఖ్యమా? మళ్లీ పేపర్లను సిద్ధం చేస్తే వచ్చే సమస్యలు ముఖ్యమా? అని ప్రశ్నించింది. అసలు పరీక్షలను నిర్వహించకుండానే స్టూడెంట్లకు గ్రేడింగ్‌ ఇస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. అయితే అది సాధ్యం కాదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. రాష్ట్రమంతా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సోమవారం నుంచి జరిగే పరీక్షలకు హాజరు కాని వారికి తర్వాత అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహిస్తామని, వారిని కూడా రెగ్యులర్‌ స్టూడెంట్లుగా పరిగణిస్తామని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ హైకోర్టుకు నివేదించారు. విచారణ 19కి వాయిదా పడింది.

ఎగ్జామ్స్ వాయిదా వేసిన ప్రభుత్వం

గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలుమినహా మిగిలిన చోట్ల పరీక్షలు పెట్టుకోవడానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా.. భవిష్యత్ లో సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో మొత్తంగా ఎగ్జామ్స్​ను సర్కారు పోస్ట్​పోన్ చేసిం ది. టెన్త్ పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

తెలంగాణ,ఏపీ నీళ్ల డ్రామా

Latest Updates