మీరేం చేస్తున్నరు..ప్లాస్టిక్​ వాడకంపై పీసీబీకి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగుహైదరాబాద్​లో గణేశ్​ ఉత్సవాల పేరిట ప్లాస్టిక్​ను ఎక్కువగా వాడుతున్నారని, దాన్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు స్పందించింది. ఈ అంశంపై ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని (పీసీబీ) ఆదేశించింది. గణపతి విగ్రహాలకు ప్లాస్టిక్​ కవర్లు చుట్టి తీసుకెళ్లకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఎల్​బీ నగర్​కు చెందిన మురళి అనే వ్యక్తి పిటిషన్​ వేశారు. గురువారం ఆ పిటిషన్​ను చీఫ్ జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్​, జస్టిస్​ ఏ అభిషేక్​రెడ్డిల డివిజన్​ బెంచ్​ విచారించింది. వీధివీధిలో వినాయకుడి మండపాలను ఏర్పాటు చేసి విగ్రహాలను పెడుతుంటారని, వాటికి ప్లాస్టిక్​ కవర్లను చుట్టి తీసుకొస్తే ఆ తర్వాత ఎదురయ్యే పర్యావరణ ముప్పు దారుణంగా ఉంటుందని పిటిషనర్​ తరఫు లాయర్​ పవన్​కుమార్​ వాదించారు. కవర్లు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని, భూగర్భజలాలు పెరగకుండా అవి అడ్డుకోవడంతో పాటు మొక్కలు పెరగకుండా చేస్తాయని వివరించారు. ప్లాస్టిక్​ వల్ల చేపలు, పక్షులు, ఆవులు, ఇతర జంతువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందన్నారు. 50 మైక్రాన్ల సైజు కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్​ను వాడొద్దని చట్టంలో ఉన్నా ఇష్టానుసారంగా వాడేస్తున్నారన్నారు. ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Latest Updates