పునరావాసం కల్పించాకే తరలించాల్సింది: హైకోర్టు

the-high-court-said-that-the-tribes-should-be-relocated-only-for-resettlement

హైదరాబాద్‌‌, వెలుగుకొలాంగోందిగూడ అడవి నుంచి గిరిజనులను తీసుకెళ్లి ఫారెస్ట్​ టింబర్​ డిపోలో ఉంచడం ఏమిటని, వారికి పునరావాసం కల్పించాకే తరలించాల్సిందని హైకోర్టు పేర్కొంది. కొంత మందికి భూమిని కేటాయించి, మరికొందరికి చేస్తామని చెప్పి.. ముందే అటవీ ప్రాంతం నుంచి ఎందుకు తరలించారని ప్రశ్నించింది. ఆ కుటుంబాలకు చెందిన 16 మంది పెద్దలను ఆదివారం సాయంత్రం హైకోర్టులో హాజరుపర్చాలని అధికారులను ఆదేశించింది. వారి అభిప్రాయం వింటామంది.

అత్యవసర విచారణ కింద..

అడవిని ఖాళీ చేయించే పేరుతో అధికారులు గిరిజనుల హక్కులను దెబ్బతీస్తున్నారని, కొమురం భీం జిల్లాలో కొలంగొందిగూడ కు చెందిన 67 మందిని అటవీ శాఖ టింబర్‌‌ డిపోలో నిర్బంధించారని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్​ గడ్డం లక్ష్మణ్​ హైకోర్టులో హౌస్‌‌ మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్​ జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్, జస్టిస్​ షమీమ్​ అక్తర్​ల బెంచ్​ శనివారం అత్యవసరంగా విచారణ జరిపింది. పిటిషనర్​ తరఫున లాయర్​ రఘునాథ్​ వాదించారు. అటవీ అధికారులు గిరిజనుల ఇండ్లను, పశువుల కొట్టాలను కూల్చేసి, 67 మందిని టింబర్​ డిపోలో నిర్బంధించారన్నారు. అందులో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని, వారు తిండిలేక ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వ లాయర్​ మనోజ్​ వాదిస్తూ, అడవుల్ని రక్షించే క్రమంలోనే గిరిజనులను తరలిస్తున్నామని, వారంతా ఫారెస్ట్‌‌ డిపోలో ఉన్నారని, నిర్బంధించలేదని చెప్పారు.

కోర్టుకు తీసుకురండి..

అడవి నుంచి ఖాళీ చేయించే క్రమంలో గిరిజనులను టింబర్‌‌ డిపోలో ఉంచామన్న ప్రభుత్వ వాదనపై బెంచ్​ విస్మయం వ్యక్తం చేసింది. ‘‘అటవీ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని భావిస్తే.. వారందరికీ పునరావాస చర్యలు తీసుకున్నాకే ఆ పని చేయాలి. కొంతమందికి భూమి కేటాయించి, మరికొందరికి చేస్తామని చెప్పి ముందే ఎందుకు తరలించాలి, డిపోలో ఉంచడమెందుకు? పునరావాసం కల్పించాకే తరలిస్తే సరిపోయేది కదా?” అని స్పష్టం చేసింది. గిరిజన కుటుంబాల పెద్దలను కోర్టు ఎదుట హాజరుపర్చాలని  ఆదేశించింది. టూరిజం శాఖ వాహనాల్లో వాళ్లను తీసుకురావాలని, ఆదివారం సాయంత్రం ఐదింటికి కేసును తిరిగి విచారిస్తామని తెలిపింది. ఆ కుటుంబాల పెద్దలు చెప్పే విషయాలు తమకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రొఫెసర్లు మనోజ, జయధీర్‌‌ తిరుమలరావు కోర్టుకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.

 

 

Latest Updates