కరోనా ముట్టడిలో 3 సిటీలు

ఆ మూడు సిటీలు దేశానికి వెన్నుపూస లాంటివి. కానీ, ఇప్పుడు కరోనాతో ఆ సిటీలే ఊపిరి తీసుకోలేక సతమతమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఎకానమీకి మూలస్తంభమైన ముంబై, హెల్త్కేర్ క్యాపిటల్గా పిలిచే చెన్నై.. కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నాయి. మహమ్మారి విసురుతున్న విషపు వలల్లో కూరుకుపోతున్నాయి. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 40 శాతం కేసులు ఇక్కడే ఉన్నాయి. మొత్తంగా ఆ మూడు సిటీల్లో కలిపి లక్షా 26 వేల 233 కేసులు నమోదయ్యాయి. 3,706 మంది చనిపోయారు.

సెంట్రల్ డెస్క్, వెలుగు:దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా రోజూ 11 వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లోనే ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. రోజువారీ కేసుల్లో ఆ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 70 శాతం వరకు ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనే మొత్తం కేసులు లక్షా 86 వేల 213 ఉన్నాయి. దేశం మొత్తం కేసుల్లో వీటి వాటా 58%. 5,511 మరణాలు (59.8 శాతం) ఆ మూడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో అయితే పరిస్థితి మరింత సీరియస్గా ఉంది. రాష్ట్రంలో లక్షా 4 వేల 568 కేసులు నమోదైతే, శనివారం ఒక్కరోజే 3,427 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం 3,843 మంది కరోనాతో చనిపోయారు. ముంబై, ఢిల్లీ, చెన్నై.. ఈ మూడు సిటీల్లోనే లక్షా 26 వేల కేసులు, 3,706 మరణాలు నమోదయ్యాయి.

శనివారం 126 మంది బలయ్యారు. ఇప్పటిదాకా మహారాష్ట్రలో 6 లక్షల 26 వేల 521 టెస్టులు చేశారు.
ఆర్థిక రాజధాని అల్లాడుతోంది. ముంబైనిదేశ ఆర్థిక రాజధాని అని పిలుస్తుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ నడిచేది ఆ సిటీ నుంచే. స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నది ఇక్కడే. కానీ, అలాంటి సిటీ ఇప్పుడు కరోనాతో అల్లాడిపోతోంది. దేశంలో అత్యంత ఎక్కువగా ఎఫెక్ట్ అయిన సిటీ ఏదైనా ఉందంటే అది ముంబై మాత్రమే. ఇప్పటికే అక్కడ 56,831 కేసులు నమోదయ్యాయి. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేసులు సిటీలోనే నమోదవుతున్నాయి. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా మరణాలూ ముంబైలోనే ఎక్కువున్నాయి. మొత్తం 2,121 మంది చనిపోయారు. రోజూ రాష్ట్రంలో నమోదవుతున్న మరణాల్లో 61 శాతం సిటీలోనే ఉంటున్నాయి. నానాటికీ సిటీలో కంటెయిన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయి. ఇప్పటికి అక్కడ 815 కంటెయిన్మెంట్ ఏరియాలున్నాయి. దాదాపు సిటీ మొత్తం కంటెయిన్మెంట్ జోన్లున్నాయి.

ప్రైవేట్లో 25% బెడ్స్

సిటీలో బెడ్లు చాలినంత లేకపోవడం, కేసులు పెరిగిపోతుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో 25 శాతం బెడ్లను కరోనా పేషెంట్లకు రిజర్వ్ చేసి పెట్టాలని బృహన్ముంబై కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. 36 ప్రైవేట్ ఆస్పత్రులకు సర్క్యులర్స్ ఇచ్చారు. 50 కన్నా ఎక్కువ బెడ్లున్న ఆస్పత్రుల్లో కరోనా రోగుల కోసం స్పెషల్ బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు తగ్గట్టు కరోనా పేషెంట్లను ట్రీట్ చేయడానికి సరిపడా సిబ్బందిని నియమించాలని, అన్ని వసతులను చూసుకోవాలని సూచించారు. మరోవైపు కరోనా టెస్టుల రేట్లను మహారాష్ట్ర సర్కార్ తగ్గించింది. ఇప్పటిదాకా ఒక్కోటెస్టుకు రూ.4,500దాకా వసూలు చేస్తుండగా, దానిని రూ.2,200కు తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది. ఇంటి దగ్గరే శాంపిళ్లను కలెక్ట్ చేస్తే మ్యాగ్జిమమ్ రేటును రూ.2,800గా నిర్ణయించింది.

హెల్త్సిటీకి కోయంబేడు ఎఫెక్ట్

కొన్ని రోజుల క్రితం దాకా కేసుల్లో తమిళనాడు ఆరు, ఏడు ప్లేసుల్లో ఉండేది. కానీ, ఒక్క కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో కేసులు ఎక్కువైపోయాయి. రాష్ట్రాన్ని రెండో స్థానానికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 42,687 కేసులు నమోదవగా, శనివారం ఒక్కరోజే 1,989 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం 30 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 397కు చేరింది. అయితే, చెన్నైలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. హెల్త్క్యాపిటల్గా పిలిచే చెన్నైలోనూ కరోనా కేసులు నానాటికీ ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 71 శాతం కేసులు సిటీలోనే ఉన్నాయి. అక్కడ 30,444 కేసులు రికార్డ్ కాగా, 314 మంది చనిపోయారు. అంటే 80 శాతం మరణాలు చెన్నైలోనే నమోదయ్యాయి. మొత్తం 312 కంటెయిన్మెంట్ జోన్లున్నాయి. కేసులు పెరుగుతుండడంతో సిటీలో అదనపు బెడ్ల కోసం సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. 4,900 అదనపు బెడ్లను కరోనా కోసం కేటాయిస్తున్నట్టు చెబుతోంది. ఇప్పటిదాకా సిటీలోని ప్రభుత్వ దవాఖాన్లలో 6,700 బెడ్లుండగా, 2,700 బెడ్లు నిండాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రైవేట్లోని 5,300 బెడ్లలో 1,188 బెడ్లున్నట్టు చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్లను కరోనా కోసం కేటాయించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం 60 శాతం మందికిపైగా కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. ఇటు, ఇంటింటికీ తిరిగి థర్మల్ చెకప్లు చేస్తోంది చెన్నై కార్పొరేషన్. అందుకోసం 12 వేల సివిక్ వర్కర్లను నియమించింది. ఒక్కో సివిక్ వర్కర్ రోజూ 150 ఇళ్లలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ–పాస్ లేనిదే వేరే రాష్ట్రాల వారికీ ఆ రాష్ట్ర సర్కారు అనుమతివ్వడం లేదు. దేశంలో టెస్టులు ఎక్కువ చేసిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. 6 లక్షల 73 వేల 906 టెస్టులు చేశారు.

ఢిల్లీ టెస్టుల్లో 36 శాతం పాజిటివ్

దేశ రాజధాని ఢిల్లీపై మర్కజ్ ఎఫెక్ట్ బాగానే పడింది. ఆ ఎఫెక్ట్తోనే రాష్ట్రంలో కేసులు పెరిగిపోయాయి. రెండు రోజులుగా రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం తొలిసారి 2 వేల మార్కును దాటగా, శనివారం కూడా ఆ మార్కును దాటేసింది. ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 2,134 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,958కి పెరిగింది. ఇప్పటిదాకా 1,271 మంది చనిపోగా, శనివారం 57 మంది బలయ్యారు. శనివారం 5,947 శాంపిళ్లను టెస్ట్ చేయగా, 2,137 శాంపిళ్లు పాజిటివ్గా తేలాయి. చేసిన టెస్టుల్లో 36 శాతం పాజిటివ్గా తేలాయి. ఇప్పటి దాకా ఢిల్లీ సర్కార్ 2,77,463 టెస్టులు చేసింది. అ యితే, జులై చివరి నాటికి ఐదున్నర లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో 242 కంటెయిన్మెంట్ జోన్లున్నాయి. ఇక్కడ కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండడంతో వసతుల కల్పనపై ఢిల్లీ సీఎంతో హోం మంత్రి అమిత్ షా ఆదివారం రివ్యూ చేస్తారని అధికార వర్గాలు ప్రకటిం చాయి. కరోనా కోసం 9,558 బెడ్లు కేటాయించగా, ఇప్పటిదాకా 5,361 బెడ్లను వాడారు. 4,197 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 598 వెంటిలేటర్లకుగానూ 253 ఖాళీగా ఉన్నాయి. 17,261 మంది పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉన్నారు. గుజరాత్లోని అహ్మదాబా ద్ (16,306 కేసులు), ఠాణే (17,306), పుణే (11,72 2) ల్లోనూ పరిస్థితి సీరియస్గానే ఉంది. పది వేలకు పైగా కేసులు నమోదైంది ఈ ఆరు సిటీల్లోనే.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates