ఎయిర్ క్వాలిటీలో హైదరాబాద్​ రికార్డ్ బ్రేక్

హైదరాబాద్​, వెలుగు: గొట్టం నుంచి పొగను ఉఫ్​న ఊదే బండ్లు రోడ్లెక్కలేదు. నీలాకాశంలోకి నల్లని పొగను చిమ్మే ఫ్యాక్టరీలు నడవట్లేదు. వెరసి, హైదరాబాద్​ గాలి తేటగైంది. ఇదంతా కరోనా ఎఫెక్ట్​. దాని వల్ల ప్రకటించిన లాక్​డౌన్​ గాలిని కడిగేసింది. దీంతో ఎన్నడూ లేనంతగా రికార్డ్​ స్థాయిలో పార్టిక్యులేట్​ మ్యాటర్​ (పీఎం– కాలుష్యకారకం)కు సంబంధించి ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ (ఏక్యూఐ) మెరుగుపడింది. జనతా కర్ఫ్యూ నిర్వహించిన రోజు ఏక్యూఐ 94గా నమోదైంది. ఇప్పుడు అది 48కి తగ్గిపోయింది. సీపీసీబీ (సెంట్రల్​ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు) రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. అంతకుముందు 2004లోనే ఏక్యూఐ 42గా నమోదైంది. ఆ తర్వాత ఎప్పుడూ అంత తక్కువ ఏక్యూఐ రికార్డ్​ కాలేదు. 2011లో తార్నాక స్టేషన్​లో అతి తక్కువగా 60, బాలానగర్​లో ఎక్కువగా 111గా ఏక్యూఐ నమోదైంది.

రోడ్డెక్కని వాహనాలు..

రాష్ట్రమంతా కోటి 20 లక్షల వాహనాలు ఉన్నాయి. అందులో హైదరాబాద్​లోనే 60 లక్షలకుపైగా ఉంటాయని అంచనా. కరోనా ఎఫెక్ట్​ వల్ల సర్కార్​ లాక్​డౌన్​ ప్రకటించింది. పోలీసులు ఆ రూల్స్​ను కఠినంగా అమలు చేస్తుండడంతో అవసరమైతే తప్ప పెద్దగా బండ్లు రోడ్లపైకి రావట్లేదు. దీంతో కాలుష్య కారకాల విడుదల 90 శాతం వరకు తగ్గి గాలి నాణ్యత పెరుగుతోందని పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు అధికారులు చెబుతున్నారు. సీపీసీబీ ప్రకారం ఏక్యూఐ విలువ 50 కన్నా తక్కువగా ఉంటే గాలి మంచిగా ఉన్నట్టు. 50 నుంచి 100 మధ్య నమోదైతే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులొస్తాయి. 100 దాటితే పరిస్థితి తీవ్రమన్నట్టే. దాని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ఉబ్బసంతో పాటు గుండె జబ్బులున్నోళ్లకు గాలి తీసుకోవడం కష్టమవుతుంది. హైదరాబాద్​లో ఈ ఏడాది చాలా రోజులు ఏక్యూఐ వంద పైనే రికార్డ్​ అయింది. కానీ, ఇప్పుడది 50 లోపే నమోదవుతోంది. లాక్​డౌన్​ మరో 15 రోజులుండడంతో గాలి మరింత తేటగైతుందని అధికారులు చెబుతున్నారు.

Latest Updates