మళ్లీ ‘గాంధీ’కే జై అన్న కాంగ్రెస్

కాంగ్రెస్ కు విడవని నీడలాంటిది ‘గాంధీ’ అనే పదం. సోనియా గాంధీ ప్లేసులో రాహుల్ గాంధీ వస్తే ఇప్పుడు  రాహుల్ గాంధీ ప్లేసులో మళ్లీ సోనియా గాంధీ వచ్చారు. ‘గాంధీ’ కి తప్ప మరెవరికి పార్టీ చీఫ్ పోస్టు కట్టబెట్టినా కాంగ్రెస్ పార్టీ ఏమవుతుందోననే భయం ఇప్పటికీ కనిపిస్తోంది. సోనియా గాంధీ నియామకం టెంపరరీ అంటున్నారు కానీ ఏఐసీసీ సమావేశాల్లోనైనా ‘గాంధీ’ కానివారిని పార్టీ టాప్ పోస్టుకు ఎన్నుకుంటారా అనేది సందేహమేనంటున్నారు ఎనలిస్టులు.

కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా మళ్లీ సోనియా గాంధీనే ప్రకటిస్తూ  సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు ఎలాంటి  ఆశ్చర్యం  కలిగించలేదు. సోనియా గాంధీకి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం కొత్త కాదు. గతంలో 19 ఏళ్ల పాటు ఆమె పార్టీ చీఫ్ గా ఉన్నారు. రాహుల్ గాంధీ సడన్ గా కాడి కిందకు పడేయడంతో సోనియా మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. పార్టీ ప్రెసిడెంట్ గా ఎవరో ఒక ‘గాంధీ’ ఉంటే తప్ప ప్రజల దగ్గరకు వెళ్లలేమని కాంగ్రెస్ లీడర్లు ఇదివరకే ఫిక్సయిపోయారు. ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి అంగీకరించకపోయి ఉండొచ్చు. రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి రాహుల్ మరోసారి అంగీకరించకపోవడంతో  చివరి ఆప్షన్ గా సోనియా పేరు తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్  ప్రెసిడెంట్ నియామకం విషయంలో మరింత లేట్ చేస్తే పార్టీ చీలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదన్న  భయాందోళనలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమైనట్లు వార్తలొచ్చాయి. దీంతో  సీడబ్లూసీ  మీటింగ్ పెట్టి, ఉదయం నుంచి రాత్రి దాకా గ్రూపుల వారీగా చర్చలు జరిపి చివరకు సోనియాకు బాధ్యతలు అప్పగించారు. లాంగ్ రన్ లో పార్టీ  ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకుని కాంగ్రెస్ లీడర్ల ఒత్తిడికి  సోనియా తలొగ్గక తప్పలేదన్నది  ఢిల్లీ వర్గాల కథనం. సోనియా ను పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టి ఆమెకు సాయం చేసేందుకు కొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించి  సీనియర్లు వెనక ఉండి కాంగ్రెస్ బండి నడిపిస్తారన్న వార్తలు  వినిపిస్తున్నాయి.

సీడబ్ల్యూసీ  మీటింగ్ కు ముందే కాబోయే కాంగ్రెస్ చీఫ్ అంటూ చాలా పేర్లు చక్కర్లు   కొట్టాయి. ముకుల్ వాస్నిక్, సుశీల్ కుమార్ షిండే, మల్లికార్జున ఖర్గే  పేర్లు పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపించాయి. యూత్ కోటా కింది జ్యోతిరాదిత్య సింధియా, సచిల్ పైలెట్ పేర్లు కూడా బయటకు వచ్చాయి.అయితే ఈ లీడర్లు ఎవరికీ  జాతీయస్థాయిలో గుర్తింపు  లేదు. సుశీల్ కుమార్ షిండే ఎంత పెద్ద నాయకుడైనా మహారాష్ట్ర కే పరిమితం. అలాగే మల్లికార్జున్ ఖర్గే ఎంత సీనియరైనా కర్ణాటకకే పరిమితం. కాంగ్రెస్ లో అందరు సీనియర్ల పరిస్థితి ఇంతే. కాంగ్రెస్ అంటే చిన్న పార్టీ కాదు. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి దాకా విస్తరించిన పార్టీ. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఇంత పెద్ద పార్టీని  నడిపించాలంటే వారి నాయకత్వాన్ని  దేశవ్యాప్తంగా అందరు లీడర్లు, కార్యకర్తలు  ఆమోదించాల్సి ఉంటుంది. అందరి ఆమోదం పొందే లీడర్లు కాంగ్రెస్ లో ప్రస్తుతానికి ఎవరూ కనిపించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సోనియా గాంధీని సీనియర్లు ఒప్పించారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి  బాధ్యత వహిస్తూ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ ఈ ఏడాది మే 25న రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం సీడబ్ల్యుసీ సమావేశమై కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ గా మళ్లీ సోనియానే ఎంపిక చేసుకుంది.

జోష్ లేని  కాంగ్రెస్ ఎంపీలు

లోక్ సభ సమావేశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే తొలిసారి  సభకు ఎన్నికైన బీజేపీ లీడర్లు సందడి చేస్తూ కనిపిస్తుంటారు.  కాంగ్రెస్ ఎంపీల్లో మాత్రం ఆ జోష్ ఎక్కడా కనపడటం లేదు. సభా కార్యక్రమాల్లో బీజేపీ ఫస్ట్ టైమ్ ఎంపీలు చాలా ఉత్సాహంగా పాల్గొంటుంటే  కాంగ్రెస్ ఎంపీల్లో ఆ ఉత్సాహం ఎక్కడా కనపడదు. దీనికి కారణం  రెండున్నర నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ఒక అనాథలా మారిపోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆర్నెల్లలోగా నాలుగు రాష్ట్రాల్లో  ఎన్నికలు

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇందులో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ …..ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ఉంది. ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు. కాంగ్రెస్ ఇప్పటికే బాగా దెబ్బతింది. కొంతకాలంగా కాంగ్రెస్ పొలిటికల్​ గ్రాఫ్​  డౌన్ ట్రెండ్ ను ఫాలో అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో  నాలుగు రాష్ట్రాల్లో పార్టీని ఎన్నికలకు రెడీ చేసే నాయకుడే లేకుండా పోయాడు.దీంతో ఆయా రాష్ట్రాల  పీసీసీ చీఫ్ లకు కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ చీఫ్ ఇష్యూ పై  మరింత జాప్యం చేస్తే  కాంగ్రెస్ ఇక ఎప్పటికీ  కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తుందని శశి థరూర్ వంటి కొంతమంది నాయకులు భావించి సీనియర్లను అలర్ట్ చేయడంతో  చివరకు సీడబ్ల్యుసీ మీటింగ్ పెట్టి  సోనియా పేరు ను ప్రకటించినట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ లో బయటి నాయకత్వమే లేదు

130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు ఇప్పటికీ ఇందిర  కుటుంబమే దిక్కయింది. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, కమలాపతి త్రిపాఠి వంటి  వారిని  మినహాయిస్తే ఇంత పెద్ద కాంగ్రెస్ లో   బయటి వ్యక్తులెవరూ పార్టీకి నాయకత్వం వహించే స్థాయికి ఎదగలేకపోయారు. దీనికి ప్రధాన కారణం పార్టీ ఐడియాలజీని అటకెక్కించడమే.  సిద్ధాంతాలను పక్కన పెట్టారు. పార్టీలో వ్యక్తి పూజ తారాస్థాయికి చేరింది. ఇందిర హయాంలో ఈ ట్రెండ్ జోరందుకుంది. ఐడియాలజీతో  ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగటం మానేశారు కాంగ్రెస్ నాయకులు.  అధినేత కరిష్మా నే   ఓట్ల వర్షం కురిపిస్తుందని ఫిక్సయ్యారు. పార్టీ పదవులకు ఎన్నికలు జరిపే పద్ధతికి ఎండ్ కార్డు పడింది. పీసీసీ చీఫ్ వంటి కీలక పదవులకు కూడా నియామకాలు మొదలయ్యాయి. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ పనిచేయడం మాదేసిందన్న విమర్శలు వచ్చాయి. మిగతా పార్టీల్లో మారుతున్న పరిస్థితులకనుగుణంగా   కొత్త నాయకత్వాలు వచ్చాయి.  ప్రజలకు దగ్గరవడానికి  ప్రయత్నించాయి. అందులో సక్సెస్​కూడా అయ్యాయి. కాంగ్రెస్ లో మాత్రం కొత్త నాయకత్వమనే  ముచ్చటే లేకుండా పోయింది.

19 ఏళ్ల పాటు కాంగ్రెస్ కు నాయకత్వం

ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ చనిపోవడంతో కాంగ్రెస్ లీడర్ల ఒత్తిడి మేరకు 1997 లో సోనియా గాంధీ  రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో తొలిసారి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2017 వరకు ఈ పదవిలో కొనసాగారు. 2017 లో కొడుకు రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. సోనియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే  2004 నుంచి 2014 వరకు వరుసగా రెండుసార్లు యూపీఏ కూటమి అధికారంలో కొనసాగింది. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు.

రాహుల్ ఏం చేయబోతున్నారు ?

సోనియాను  కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ గా ప్రకటించిన తర్వాత రాహుల్ ఏం చేయబోతున్నారనే ప్రశ్న తెర మీదకు వచ్చింది.  రాహుల్ టీం మెంబర్స్ గా ముద్రపడ్డ జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలెట్, మిలింద్ దేవరా వంటి యూత్ లీడర్ల  రాజకీయ భవిష్యత్తు  ఏంటి అనే  అనుమానాలు కూడా వస్తున్నాయి. రాహుల్ బాటలో నడుస్తూ కొంతమంది లీడర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ  ఆ పదవులు వాళ్లకు వస్తాయా ? ఆ పదవుల్లో  కొత్తవారిని నియమిస్తారా అనేది తెలియడం లేదు. రాహుల్ లేరు కదా అని మహారాష్ట్ర , కర్ణాటకల్లో కొంతమంది ఛోటా మోటా నాయకులు వేరే పార్టీల్లోకి జంపయ్యారు. రాహుల్ కాకపోయినా ఆయన  కుటుంబానికి పార్టీ  ప్రెసిడెంట్  పదవి దక్కడంతో వీరంతా హ్యాపీయేనా ?  ఇలా పార్టీ మారిన తన విధేయులను రాహుల్ చొరవ చూపి మళ్లీ పార్టీలోకి  తీసుకువస్తారా ? ఈ ప్రశ్నలకు క్లారిటీ రావాల్సి ఉంది.

రెండున్నర నెలల పాటు లీడరే లేని కాంగ్రెస్

పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేసి రెండున్నర నెలలకు పైగా అయింది. ఒక జాతీయ పార్టీ ఇంత సుదీర్ఘకాలం నాయకుడు లేకుండా  కొనసాగడం  ఆశ్చర్యమే. రాహుల్ పార్టీ పగ్గాలు వదిలేసిన తర్వాత దేశంలో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. కర్ణాటకలో జేడీ (ఎస్) – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పడిపోయింది. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి పరోక్షంగా కారణం కాంగ్రెస్ పార్టీ బలహీనపడటమే  అంటున్నారు  పొలిటికల్ ఎనలిస్టులు. కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక అడ్డంకులు  వచ్చినా వాటన్నిటినీ తట్టుకుని  సర్కార్ నిలబడింది. కర్ణాటక కాంగ్రెస్ కు ఢిల్లీ నుంచి స్పష్టమైన గైడ్ లైన్స్ వస్తుండేవి. అవసరమైతే ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్లు ఒకరిద్దరు బెంగళూరు వచ్చి పరిస్థితి సద్దుమణిగేలా చూసేవారు.  పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఎవరూ లేకపోవడంతో  కూటమి  ప్రభుత్వం పుట్టి మునిగిపోతున్నా ఢిల్లీ నాయకులెవరూ పట్టించుకోలేదన్న అభిప్రాయం బలంగా  వినిపిస్తోంది. సిద్దరామయ్యను ఒంటరిగా వదిలేశారన్నది  కన్నడ పొలిటీషియన్స్ కథనం.

ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ లో తలోమాట

జమ్మూ కాశ్మీర్ కు కొన్నేళ్ల పాటు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 370 రద్దు తో బీజేపీ ప్రజల దగ్గర మార్కులు కొట్టేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం పై  కాంగ్రెస్ రకరకాలుగా  స్పందించింది. గులాం నబీ ఆజాద్ నాయకత్వంలో అధికారికంగా  మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే  జనార్దన్ ద్వివేది వంటి సీనియర్లు చాలా మంది వ్యక్తిగత హోదాలో ఆర్టికల్ 370 రద్దుకు వెల్ కం చెప్పారు. అది కూడా ఎక్కడో  రహస్యంగా కాదు.ట్విట్టర్ లో ఓపెన్ గానే తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.ఇదంతా పార్టీకి ఒక నాయకుడంటూ ఎవరూ లేకపోవడం వల్ల జరిగిన అనర్థమన్న  వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇందిర కుటుంబ సభ్యులకే ఆదరణ

ప్రజల  దృష్టిలో కాంగ్రెస్ అంటే ఇందిర  కుటుంబ పార్టీయే. ఇందిర  కుటుంబమే   కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తారని భావిస్తారు.  పార్టీ ప్రెసిడెంట్ గా ఎవరున్నా  పేరు పక్కన ‘ గాంధీ ’ అనే పదం ఉంటే చాలనుకుంటారు.  నెహ్రూ కుటుంబానికున్న ఆదరణే తమ రాజకీయ జీవితానికి ఓ సేఫ్ గార్డులా పనిచేస్తుందని కాంగ్రెస్ లీడర్లు బాగా నమ్ముతారు.కాంగ్రెస్​లో నాయకులకు కొదవ లేదుగానీ, బయటి వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే ప్రజలు కాదు అసలు పార్టీలోని  మిగతా లీడర్లే అంగీకరించరు. కాంగ్రెస్ లీడర్లందరూ  ఇందిర కుటుంబానికి విధేయులే కానీ తమలాంటి వేరే నాయకులకు కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఈక్వేషన్స్‌‌  అన్నీ  చివరకు సోనియాను  పార్టీ ప్రెసిడెంట్ గా ప్రకటించడానికి దారితీశాయంటున్నారు ఎనలిస్టులు.

Latest Updates