టీఆర్​ఎస్​లో పాతోళ్లకు, కొత్తోళ్లకు అదే లొల్లి!

  • నియోజకవర్గాల్లో ముదురుతున్న పోరు
  • రోడ్డుకెక్కుతున్న ఇరు వర్గాలు    
  • పరస్పర విమర్శలు, ఆరోపణలు   
  • కేసులు, జైళ్లకు దారితీస్తున్న వ్యవహారం

టీఆర్ఎస్ నేతల మధ్య రోజురోజుకూ అంతర్గత పోరు పెరిగిపోతోంది. నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం పాతోళ్లు, కొత్తోళ్లు పోటీ పడుతున్నారు. ఎదుటి వర్గాన్ని  బలహీనపరిచేందుకు కేసులు పెడుతున్నారు. అవసరమైతే జైలుకు కూడా పంపుతున్నారు. కొందరు నేతలైతే తమ వర్గాన్ని పురమాయించి ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలను అడ్డుకునేలా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. వలసలు మొదలైనప్పటి నుంచే ఈ లొల్లి షురూ కాగా.. ఇప్పుడు అది మరింత ముదిరింది. వలస వచ్చిన నేతలకే పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని పాత లీడర్లు, వారి అనుచరులు భగ్గుమంటున్నారు.   – హైదరాబాద్, వెలుగు

తుమ్మల వర్సెస్ ​ఉపేందర్​

ఖమ్మం జిల్లా పాలేరులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్గం మధ్య లొల్లి  మరింత ఎక్కువైంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్​రెడ్డిని టీఆర్​ఎస్​లో చేర్చుకోవడం తుమ్మల వర్గానికి మొదటి నుంచి ఇష్టంలేదన్న చర్చ స్థానిక నేతల్లో ఉంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఒక వివాదంలో తుమ్మల వర్గానికి చెందిన ఓ స్థానిక నేతపై పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపించారు. ఉపేందర్ రెడ్డి వర్గం ప్రోత్సాహంతోనే పోలీసులు ఈ కేసు పెట్టించారన్న అనుమానాలు తుమ్మల వర్గంలో బలంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం తుమ్మల.. జైలుకు వెళ్లి తన అనుచరుడ్ని పరామర్శించి వచ్చారు. అనంతరం ఆయన.. ‘చిల్లర రాజకీయాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయి. ప్రమోషన్ల కోసం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు’ అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఉపేందర్​రెడ్డి వర్గాన్ని ఉద్దేశించే చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తుమ్మల మాటలపై ఉపేందర్​రెడ్డి వర్గం కూడా కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా తుమ్మల వర్గంపై ఆరోపణలు చేసింది.

కృష్ణారెడ్డి వర్సెస్​ సబిత

ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన నియోజకవర్గం మహేశ్వరంలోని మీర్​పేట పరిధిలో వాటర్ ట్యాంక్ ప్రారంభించడానికి వెళ్లారు. కొందరు స్థానికులు మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గెలిచి ఏడాదైనా ఏం పనులు చేయడం లేదంటూ నిరసన తెలిపారు. వారికి సర్దిచెప్పి అక్కడ్నించి బయటికి వచ్చిన మంత్రి.. ఆందోళన వెనుక ఎవరి హస్తం ఉందని ఆరా తీసినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అనుచురులే ఘెరావ్ చేసినట్లు సబితా వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనిపై కేటీఆర్ కు సబిత ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

పట్నం వర్సెస్​ పైలెట్ 

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య అంతరం పెరుగుతోంది. ఎమ్మెల్సీ హోదాలో మహేందర్​రెడ్డి తాండూరు నియోజకవర్గంలో పర్యటించేవారు. మహేందర్ రెడ్డి తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని కేటీఆర్ కు రోహిత్​రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో తాండూరు కు వెళ్లొద్దని మహేందర్ ను కేటీఆర్​ వారించినట్లు సమాచారం. గత వారం తాండూరులో ఒక శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి నిరసన సెగ తగిలింది. ఇదే పనికి గతంలో మంత్రి హోదాలో మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, మళ్లీ ఎందుకు చేస్తున్నారని ఆయనను స్థానికులు నిలదీశారు. ఈ నిరసన వెనుక మహేందర్ రెడ్డి వర్గం హస్తం ఉందని రోహిత్​రెడ్డి వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

జూపల్లి వర్సెస్​ హర్షవర్ధన్​రెడ్డి

కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. నియోజకవర్గంలో జూపల్లి వర్గం తమ ఆధిపత్యం పోకుండా  ప్రయత్నాలు చేస్తున్నాయి. హర్షవర్దన్ రెడ్డి వర్గం వెంట స్థానిక టీఆర్ఎస్  కేడర్​ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. టీఆర్ఎస్ లోని తన అనుచరులతో జూపల్లి తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి వారి సాదకబాదకాలు తెలుసుకుంటున్నారు. వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా  ఎమ్మెల్యే హర్షవర్ధన్  వర్గం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ను వెపన్ గా చేసుకున్నట్లు అంటున్నారు. ఎమ్మెల్యే నుంచి వెళ్లిన దరఖాస్తులకు ఎక్కువ రిలీఫ్ ఫండ్ వస్తుందని, దీంతో స్థానిక కేడర్ తమ వద్దకు వస్తుందని ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి వర్గం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎక్కడైనా అదే లొల్లి

  • నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గానికి పడటం లేదు. మంత్రి జగదీశ్ రెడ్డి కూడా లింగయ్య వర్గానికే  ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వీరేశం వర్గం భావిస్తున్నట్లు నకిరేకల్​ టీఆర్​ఎస్​ కేడర్​లో చర్చ నడుస్తోంది.
  • ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అనుచరుల్లో ఒక ఎంపీపీ తప్పుడు క్యాస్ట్​ సర్టిఫికెట్​తో పోటీ చేశారని ఇటీవల కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్లింది. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య వర్గం హస్తం ఉన్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు.
  • భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా మాజీ స్పీకర్ మధుసుదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వర్గాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది.
  • ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి.  ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వర్గాల మధ్య సఖ్యత లేదు.
  • కొత్త గూడెం నియోజకవర్గంలోని వనమా వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావు వర్గాల మధ్య కుమ్ములాటలు సాగుతున్నాయి.

Latest Updates