కిల్లర్ ను పట్టిస్తే లక్ష డాలర్లు

భయంకరమైన​ కిల్లర్​పై ఎఫ్​బీఐ ఆఫర్

ఢిల్లీ: కట్టుకున్న భార్యను దారుణంగా చంపేసి, నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న భద్రేష్​కుమార్​ చేతన్​భాయ్​ పటేల్​అనే నేరస్థుడి కోసం అమెరికా పోలీసులతో పాటు మన పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్(ఎఫ్​బీఐ) వెతుకుతున్న టాప్​ 10  నేరస్థుల్లో  భద్రేష్​ పేరు అందరికన్నా పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రేష్​ను పట్టిచ్చిన వారికి లక్ష డాలర్ల ప్రైజ్​మనీ అందిస్తామని ఎఫ్ బీఐ ప్రకటించింది. నేరస్థుడికి చెందిన రకరకాల ఫొటోలతో పాంపెట్లు ముద్రించి పంచడంతో పాటు, అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల డిస్ ప్లే బోర్డుల్లోనూ భద్రేష్​ ఫొటో పెట్టినట్లు ఎఫ్​బీఐ అధికారులు చెప్పారు. గుజరాత్​లోని భద్రేష్​ సొంతూరులో, బంధువులు, ఫ్రెండ్స్.. ఎందరిని ప్రశ్నించినా, ఎన్నిచోట్ల వెతికినా దొరకడంలేదట. దీంతో ఎఫ్​బీఐ ఈ ఏడు విడుదల చేసిన టాప్​ టెన్​ వాంటెడ్​ క్రిమినల్స్​ లిస్ట్​లో భద్రేష్​ పేరును టాప్​లో చేర్చింది.

అమెరికాలోని మేరీలాండ్​లో డంకిన్​ డోనట్స్​ స్టోర్​లో 2015 ఏప్రిల్​ 12న  ఓ మర్డర్​ జరిగింది. నైట్​ షిఫ్ట్​ డ్యూటీలో ఉన్న పాలక్(21) హత్యకు గురైంది. శరీరంలో చాలాచోట్ల కత్తిపోట్లతో పాలక్​ మృతదేహం ఆ మరుసటి రోజు కిచెన్​లో బయటపడింది. ముందురోజు రాత్రి భర్త భద్రేష్​ కుమార్​ చేతన్​ భాయ్​ పటేల్(24) తో విధులకు హాజరైన పాలక్.. తెల్లారేసరికి డెడ్​బాడీగా మారడం, భద్రేష్​ ఆచూకీ లేకుండా పోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్టోర్​లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. రాత్రి విధులు ముగించుకున్నాక, చివరగా భార్యాభర్తలు ఇద్దరూ కిచెన్​లోకి వెళ్లడం రికార్డయింది.

ఆ తర్వాత కాసేపటికి భద్రేష్​ ఒక్కడే బయటికొచ్చి, డోర్​ లాక్​ చేసి అసలేం జరగనట్లే కామ్​గా వెళ్లిపోవడం గమనించారు. స్టోర్​ నుంచి బయటికొచ్చిన భద్రేష్ తిన్నగా అక్కడికి దగ్గర్లోనే ఉన్న తన అపార్ట్​మెంట్​కు వెళ్లి, కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లిపోయాడని తేలింది. ఆ తర్వాత భద్రేష్​ ఓ హోటల్​లో రూం తీసుకుని పడుకున్నాడని, తెల్లారిన తర్వాత ఎక్కడికి వెళ్లిపోయాడో ఎవరికీ తెలియలేదని ఎఫ్​బీఐ అధికారులు చెప్పారు. అమెరికాలోని అన్ని సిటీల్లో గాలిస్తున్నా కనీసం చిన్న క్లూ కూడా దొరకలేదట.. ఇండియా పారిపోయి ఉంటాడనే అనుమానంతో మన పోలీసుల సాయం కోరారు. ఇక్కడి పోలీసులు నాలుగేళ్లుగా గాలిస్తూనే ఉన్నారు.

Latest Updates