ఏపీ డీపీఆర్ లు ఇస్తే చాలు..తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలట

హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్‌‌ఎంబీ) మరోసారి పక్షపాతాన్ని బయట పెట్టుకుంది. మంగళవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు లెటర్లు రాసిన బోర్డు.. ఏపీని కేవలం ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలని కోరగా…తెలంగాణను మాత్రం ప్రాజెక్టుల పనులు ఆపాలని ఆదేశించింది. ఒకేరోజు ఇరు రాష్ట్రాలకు లెటర్లు రాసినా.. ఏపీ ప్రాజెక్టుల పనులను ప్రస్తావించకుండా, తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తీరు సరికాదని రాష్ట్ర ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురే మంగళవారం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీకి.. బోర్డు మెంబర్ హరికేశ్​ మీనా ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీకి లెటర్లు రాశారు.

పర్మిషన్లు వచ్చేదాకా పనులొద్దు

తెలంగాణ కృష్ణానదిపై నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్ స్కీంలు, వాటర్ గ్రిడ్ (మిషన్ భగీరథ), ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుల పనులను.. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, ఇతర పర్మిషన్లు పొందే వరకూ చేపట్టవద్దని తెలంగాణకు రాసిన లేఖలో కృష్ణాబోర్డు ఆదేశించింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలని తాము గతంలోనే లెటర్​ రాసినా ఇప్పటివరకు ఇవ్వలేదని గుర్తు చేసింది. వెంటనే డీపీఆర్​లు ఇవ్వాలని  సూచించింది.

డీపీఆర్​లు ఇవ్వండి

కృష్ణా బోర్డు ఏపీని మాత్రం ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని కోరడంతో సరిపెట్టింది. ఏపీ విభజన యాక్టును అతిక్రమించి, కృష్ణా మిగులు జలాలపై ఆధారపడి కడుతున్న తోపుదుర్తి, ముత్తాల, దేవరకొండ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్లు, కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దల చెరువు లిఫ్ట్ స్కీంల డీపీఆర్ లు బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. ఆ ప్రాజెక్టుల పనులు ఆపాలని ఏపీకి ఎటువంటి సూచనలూ చేయలేదు.

Latest Updates