పంజా విసురుతోంది: మెదక్‌ లో మళ్లీ చిరుత కలకలం

మెదక్‌ లో మళ్లీ చిరుత కలకలం
పశువులపై వరుస దాడులు
నాలుగు రోజుల్లో మూడు ఘటనలు
భయాందోళనలో ప్రజలు
అడవిలో బోన్ల ఏర్పాటు

మెదక్‌‌ జిల్లాలో మళ్లీ చిరుత కలకలం మొదలైంది. పొలాల వద్ద కట్టేసిన పశువులు, గొర్రెల మందలు, వీధి కుక్కలపై పంజా విసురుతోంది. చిరుత వరుస దాడులతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పట్టుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

మెదక్/రామాయంపేట, వెలుగు మెదక్‌‌ జిల్లాలో 58,185 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. మెదక్, రామాయంపేట, చిన్నశంకరం పేట, చేగుంట, కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో దట్టమైన అడవి ఉంది. ఫారెస్ట్ డిపార్టుమెంట్ లెక్కల ప్రకారం జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆరు చిరుతలు ఉన్నాయి. సాధారణంగా చిరుతలు ఎప్పుడూ దట్టమైన అడవిలోనే ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. కానీ, గత కొన్నేళ్లుగా ఆహారం లభించకపోవడం, నీటి కొరత కారణంగా ఆకలి, దాహం తీర్చుకునేందుకు అడవిని దాటి బయటకు వస్తున్నాయి. పొలాల వద్ద కట్టేసిన పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. రామాయంపేట, మెదక్, హవేళీ ఘనపూర్, చేగుంట ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.

ఇవీ ఘటనలు..

ఈ నెల 27న రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన మెంగమ్మగారి కిషన్ తన వ్యవసాయ పొలం వద్ద ఉదయం పాడి గేదెకు పాలు పిండుకుని దూడను విడిచి పెట్టి ఇంటికి వెళ్లాడు. కొద్ది సేపటికి తిరిగి వచ్చే సరికి ఆ దూడపై చిరుత దాడిచేసి చంపేసింది.

28న పొద్దున తొనిగండ్లకు చెందిన సూరన్నగారి భూపాల్​తన వ్యవసాయ పొలం వద్ద గొర్రెలను కట్టేసి టీ తాగేందుకు  ఇంటికి వచ్చి తిరిగి వెళ్లే సరికి చిరుత ఓ గొర్రెను చంపేసి, మరో రెండింటిని తీవ్రంగా గాయపర్చింది.

30న తెల్లవారుజామున చిరుత ఏకంగా మెదక్ మండలం రాయిన్ పల్లి గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామంలోని వీధి కుక్కలపై దాడి చేసి గాయపరిచింది.

గతంలోనూ దాడులు..

2017 లో, 2018 చివరలో రామాయంపేట, మెదక్ మండలాల్లో చిరుత దాడులు ఎక్కువగా జరిగాయి. రామాయంపేట మండలం లక్ష్మాపుర్, తోనిగండ్ల, మెదక్ మండలం రాయిన్పల్లి, ఖాజీపల్లి గ్రామాల పరిధిలో రైతులు పొలాల వద్ద కొట్టాల్లో కట్టేసిన  దాదాపు 30 ఆవులు, దూడలను చిరుత చంపేసింది. చిరుత వరుస దాడులతో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి  ప్రత్యేక బృందాన్ని ఇక్కడికి పంపించారు. వారు చిరుత దాడులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో పర్యటించి పలు చోట్ల, సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేయించారు. ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో  చిరుత సంచారం, అది పొలాల వద్ద పశువులపై దాడి చేసి చంపేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కానీ ఫారెస్ట్ అధికారులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చిరుత చిక్కలేదు. ఆ తరువాత చిరుత సంచారం, దాడులు ఆగిపోవడంతో ఇటు ప్రజలు, అటు ఫారెస్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మళ్లీ చిరుత దాడులు మొదలయ్యాయి. వారం రోజుల్లో రామాయంపేట మండలం తొనిగండ్లలో రెండు చోట్ల, మెదక్ మండలం రాయిన్పల్లిలో ఒకచోట పశువులపై దాడి చేసింది.

పొద్దటి పూటే..

గతంలో చిరుత రాత్రి వేళలో పశువులపై దాడులు చేసేది. కానీ ఇప్పుడు ఎన్నడూ లేనివిధంగా ఉదయం పూటనే దాడులు చేస్తున్నది.  పొద్దటి పూట చిరుత వ్యవసాయ బావులు, గ్రామాల చెంతకు వస్తుండడంతో స్థానికులు
వణికిపోతున్నారు.

బోన్లు ఏర్పాటు చేసినం

పశువులపై జరిగిన దాడుల తీరు చూస్తే చిరుత పులిగానే ఉన్నాయి.  అందుకే ఆయా ప్రాంతాల్లో పటాకులు కాలుస్తున్నం. రాత్రి వేళ ఫారెస్ట్ సిబ్బంది గస్తీ తిరుగుతున్నరు. తొనిగండ్లలో రెండు చోట్ల బోన్లు ఏర్పాటు చేశాం. పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.                                                     – విష్ణువర్ధన్‌‌రెడ్డి, ఎఫ్ఆర్వో, రామాయంపేట

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..

Latest Updates