మనం తినే ప్లాస్టిక్.. ఏటా పావుకిలో జీవితాంతం 20 కిలోలు

  • ఇదీ మనం జీవితం మొత్తంలో తింటున్న ప్లాస్టిక్

ఆకలేసిన పొట్టకు బువ్వ పెట్టి చల్లార్చుతున్నాం. కానీ, ఆ బువ్వలోనే మనకు కనిపించే సైజులోనే ప్లాస్టిక్​ కలిసిపోతోంది. మన కడుపులో చేరిపోతోంది. ఒక్కో ప్లాస్టిక్​ ముక్క నువ్వు గింజంత సైజులో ఉంటోంది. ఇటీవల మైక్రోప్లాస్టిక్స్​పై డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ (వరల్డ్ వైడ్​ ఫండ్​ ఫర్​ నేచర్​)  ఇంటర్నేషనల్​ ఓ స్టడీ చేసింది. సముద్రాల నుంచి ఆర్కిటిక్​ దాకా, మంచు కొండల నుంచి భూమి పొరల దాకా ప్లాస్టిక్​తో పాటు మైక్రోప్లాస్టిక్​ కలిసిపోతోందని ఆ స్టడీ హెచ్చరించింది. అవి మన కడుపులోకి చేరిపోతున్నాయని చెప్పింది. మనం నేరుగా తినకపోయినా, మనం తినే ఆహార పదార్థాల్లో కలిసిపోయి మన పొట్టల్లోకి చేరిపోతున్నాయని చెప్పింది. చేపలు, మాంసం, ఇతర ఆహార ధాన్యాలతో అవి ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. దానిపైనే ‘రాయిటర్స్​’ గ్రాఫిక్స్​ రూపంలో మనం ఎప్పుడెప్పుడు ఎంత మైక్రోప్లాస్టిక్​ తింటున్నామో వివరించింది.

వారానికి 5 గ్రాములు

వారానికి మన కడుపులోకి చేరిపోతున్న మైక్రోప్లాస్టిక్​ మొత్తం ఇది. అంటే ఓ బాటిల్​ క్యాప్​ లేదా ఓ స్పూన్​ నిండా నింపితే ఎంతైతే ప్లాస్టిక్​ వస్తుందో అంత మొత్తంలో మనం ప్లాస్టిక్​ను లాగించేస్తున్నాం.

పదేళ్లకు  రెండున్నర కిలోలు

ఈత నేర్చుకునేటప్పుడు మనం నడుముకు కట్టుకునే ప్లాస్టిక్​ బెండు బరువుతో సమానంగా మనం పదేళ్లలో ప్లాస్టిక్​ను హాంఫట్​ అనిపించేస్తున్నాం. రెండున్నర కిలోల మైక్రోప్లాస్టిక్స్​ కడుపులోకి చేరిపోతున్నాయి.

నెలకు 21 గ్రాములు

దీని బరువు కాసినోల్లోని 5 డైస్​ (స్క్వేర్​గా ఉండే పాచికలు) అంత మొత్తం. మినీ రైస్​బౌల్​లో సగం. ఓ నెలలో ఆహారంతో పాటు మనం తింటున్న మైక్రోప్లాస్టిక్​ 21 గ్రాములు.

6 నెలలకు 125 గ్రాములు

పిల్లలకు సిరీల్స్​ తినిపించే గిన్నె నిండుగా పోస్తే వచ్చేంత బరువు. మనకు తెలియకుండానే మనం 125 గ్రాముల ప్లాస్టిక్​ను పొట్టలోకి పంపిస్తున్నాం.

జీవితం మొత్తంలో 20 కిలోలు

ఓ చిన్న బియ్యం బస్తా బరువు 25 కిలోలుంటుంది. దాంట్లో ఐదు కిలోలు తీసేస్తే 20 కిలోల మైక్రోప్లాస్టిక్​ను మనం భోజనంతో పాటే కానిచ్చేస్తున్నాం. చెత్తపడేసే రెండు ప్లాస్టిక్​ బిన్నులకు (ఒక్కోటి పది కిలోల బరువు అనుకుంటే) సమానం.

ఏటా పావు కిలో

ప్లేట్​ నిండా పెట్టుకునే అన్నం బరువుతో సమానం. సరాసరి మనం పావు కిలో మైక్రోప్లాస్టిక్​ను తింటున్నాం.

ఇది చాలా సీరియస్​

కొన్నేళ్ల తరబడి మనం ప్లాస్టిక్​ను వాడుతున్నాం. కానీ, మైక్రోప్లాస్టిక్​, నానో ప్లాస్టిక్​ల వల్ల కలిగే నష్టాలు, మన హెల్త్​పై పడే ప్రభావాలను మాత్రం అంచనా వేయట్లేదు. మనం తినే ఆహారంతో పాటే అవి మన కడుపుల్లోకిచేరిపోతున్నాయి. చేయకూడని నష్టాన్ని చేస్తున్నాయి. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే.

– థవ పళనిస్వామి, యూనివర్సిటీ ఆఫ్​ న్యూ కేజిల్​, ఆస్ట్రేలియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ స్టడీలో పాల్గొన్న సైంటిస్ట్​

Latest Updates