సాహో జడేజా..! నీ పోరాటం అద్భుతం

గెలుపు ఆశలే లేనిచోట..

విజయం ముంగిట్లోకి ఇండియాను తీసుకొచ్చిన జడేజా

బౌలింగ్.. ఫీల్డింగ్ లోనూ మెరుపులు

అసలైన ‘మ్యాన్ ఆఫ్ ద 2డే మ్యాచ్’  రవీంద్ర జడేజా

మాంచెస్టర్ : వారి పేరు చెబితేనే ప్రపంచ బౌలర్లకు వణుకు. వాళ్లు క్రీజులో ఉంటే బౌలర్లు ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు. కానీ.. ఇండియాను సెమీస్ గండం దాటించడం వాళ్లవల్ల కాలేదు. కానీ.. ఓ ఆల్ రౌండర్ గెలుపు గడప దాటించాలనుకున్నాడు. 11మందిలో ఒకే ఒక్కడై కష్టపడ్డాడు. అతడే రవీంద్ర జడేజా.

5 రన్స్ కే 3 వికెట్లు.. 24 రన్స్ కే 4 వికెట్లు… 92 రన్స్ కే 6 వికెట్లు డౌన్.. కొట్టాల్సింది 240 రన్స్. ఆ దశలో ఇండియా పనైపోయిందనే అనుకున్నారంతా. చాలామంది టీవీల ముందు వెళ్లిపోయారు కూడా. ఐతే… క్రీజులో ఉన్న ధోనీకి జోడీగా ఒక్కడొచ్చాడు. అతడే రవీంద్రజడేజా.

మ్యాచ్ మొదట్లోనే పోయిందనుకున్నవాళ్లే.. చివరి 15 ఓవర్లలో టీవీల ముందు కూర్చున్నారంటే అందుక్కారణం జడేజా. ఒక్కో ఓవర్ కు లెక్కలేసుకుని… మాట్లాడుకున్నారంటే అందుక్కారణం జడేజా.

దుమ్ములేపుతున్నాడనుకున్న ధోనీ జిడ్డుగా ఆడిన వేళ… అంచనాలు లేని జడ్డూ(జడేజా) దుమ్ములేపి.. భారత్ ను గెలుపు పొలిమేరల్లోకి తీసుకొచ్చాడు. అందుకే అతడి ఆటకు సాహో అనాల్సిందే.

ఇండియా మ్యాచ్ గెలిచిందా.. ఓడిందా అన్నది కాదు పాయింట్. ఎలా ఆడామన్నదే.. అసలైన పాయింట్. ఆట స్ఫూర్తి నింపాలి. ఆ స్ఫూర్తిని అభిమానుల గుండెల నిండా నింపాడు రవీంద్ర జడేజా. మ్యాచ్ పై పోయిన ఆశలను చిగురింపజేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో… గెలుపు ఆశలు రేపాడు. బౌండరీలు బాదుతూ… మెరుపులు మెరిపిస్తూ.. విజయం కనుచూపుమేరలోకి తీసుకొచ్చాడు.

సీనియర్ బ్యాట్స్ మన్ ధోనీ ఇచ్చిన సమన్వయంతో.. జడేజా సమయోచితంగా గేర్ మార్చాడు. బౌండరీలు బాదాడు. టార్గెట్ కొండను తగ్గిస్తూ వచ్చాడు. జడేజా బాదుతూనే ఉన్నా… మరో ఎండ్ లో ధోనీ సింగిల్స్ , డబుల్స్ కే పరిమితం ఐనా.. కూడా.. జడేజా మాత్రం దూకుడుగా ఆడాడు. 39 బాల్స్ లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. అదే జోరు కొనసాగించాడు. 59 బాల్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 రన్స్ చేశాడు. విజయానికి 32 రన్స్ దూరంలో జడేజా ఔటయ్యాడు. దురదృష్టవశాత్తూ జడేజా వికెట్ తో పాటు.. ఇండియాకు విజయం దూరమైంది.

జడేజా ఇన్నింగ్స్ మామూలుది కాదు…

8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఇలా ఆడటం మామూలు విషయం కాదు. ప్రపంచకప్ చరిత్రలోనే ఇది 8వ స్థానంలో దిగిన బ్యాట్స్ మన్ కొట్టిన సెకండ్ బెస్ట్ స్కోర్. అదేదో ధోనీ ఇచ్చిన సహకారంతో కొట్టిన ఇన్నింగ్స్ కానే కాదు. గెలిపించాలన్న కసితో ఆడిన ఇన్నింగ్స్. తన శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. మరో ఎండ్ లో ఆ స్థాయిలో సపోర్ట్ లేకపోవడంతో.. ప్రత్యర్థి గెలుపు సంబురం ముందు.. చిన్నబోయి.. నిస్సహాయంగా నిలబడిన ఇన్నింగ్స్ లా కనిపించొచ్చు. కానీ..  జడేజా పోరాటం భారత్ కు కొండంత స్ఫూర్తి ఇస్తుంది.

సెమీస్ లో జడేజా ఆల్ రౌండ్ షో

రెండోరోజు మొదలైన ఆటలో జడేజా ఓ రనౌట్ చేశాడు. ఓ క్యాచ్ పట్టాడు. భారత ఇన్నింగ్స్ లో 77 రన్స్ సాహసోపేత ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందురోజు ఓ వికెట్ కూడా పడగొట్టాడు. 91 సెకన్లలోనే ఓ ఓవర్ ను పూర్తిచేసి స్పెషాలిటీ చాటుకున్నాడు.  అలా.. రవీంద్రజడేజాది 2019 వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ లో ఆల్ రౌండ్ షో.

ఆడింది 2 మ్యాచ్ లే కానీ…

రవీంద్రజడేజా వరల్డ్ కప్ 2019లో ఆడింది కేవలం 2 మ్యాచ్ లే. ఒకటి శ్రీలంకతో మ్యాచ్. ఇంకోటి సెమీఫైనల్. ఐతే… సబ్ స్టిట్యూట్ గా విశేషమైన సేవలు అందించాడు జడేజా. ఈ వరల్డ్ కప్ లో బౌండరీ లైన్ ఇవతల.. బంతి ఆపి 41 రన్స్ చేశాడు జడేజా.

చెత్తవాగుడు వాగే సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్లకు ఈ ఇన్నింగ్స్  చెంపపెట్టులాంటిది. రవీంద్ర జడేజా ‘బిట్స్ అండ్ పీసెస్’ లాంటి ప్లేయర్ కాదు.. ఎప్పటికీ ఇండియా క్రికెట్ అమ్ములపొదిలో ఓ విలువైన అస్త్రం.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ హెన్రీకి ఇచ్చినప్పటికీ.. రవీంద్ర జడేజానే అసలైన ‘మ్యాన్ ఆఫ్ ద 2డేస్’ మ్యాచ్.

Latest Updates