దంచికొడుతున్న ఎండలు..44 డిగ్రీలకు పైగా టెంపరేచర్

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. టెంపరేచర్లు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల మేర ఎక్కువగా ఉంటున్నాయి. ఆదివారం సుమారు 20 ప్రాంతాల్లో 44 డిగ్రీలకుపైగా గరిష్ట టెంపరేచర్​ నమోదైంది. పొద్దున తొమ్మిది గంటల నుంచే మొదలవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం ఆరు గంటల వరకూ అలాగే ఉంటోంది. అర్ధరాత్రి వరకు కూడా గాలి వేడిగా ఉంటోంది. ఉక్కపోత పెరిగిపోవడంతో జనం ఇబ్బందిపడుతున్నారు. మున్ముందు మరింతగా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

ఈ సీజన్‌‌లో అత్యధికంగా..

రెండు, మూడు రోజులతో పోలిస్తే ఆదివారం ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ఇటీవలి వరకు మూడు, నాలుగు ప్రాంతాల్లో మాత్రమే టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటగా.. ఆదివారం 20 చోట్ల ఏకంగా 44 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కవ్వాల్‌‌ టైగర్‌‌ రిజర్వ్‌‌ ఉన్న జన్నారంలో 44.5 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. జగిత్యాల జిల్లాలోని కొల్వాయి, నేరెళ్ల, మంచిర్యాలలోని నస్పూర్‌‌లలో 44.4, పెద్దపల్లిలోని శ్రీరాంపూర్‌‌లో 44.3, నిజామాబాద్‌‌ జిల్లా మోర్తాడ్‌‌, జగిత్యాల జిల్లా జైన, మల్లాపూర్‌‌, నిర్మల్‌‌ జిల్లా కద్దంపెద్దూర్‌‌, సోన్‌‌ ఐబీలలో 44.2 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

వడగాడ్పులు మొదలుకాలే..

ఈసారి ఇంకా వడగాడ్పులు మొదలుకాలేదని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గత ఏడాది ఎండాకాలంలో 20 రోజులకుపైగా వడగాడ్పులు వీచాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండలు తక్కువగానే ఉన్నాయని.. గతేడాది ఈ సమయానికి 45 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయని వివరించారు.

సీజనల్‌‌  వ్యాధుల ప్రమాదం!

టెంపరేచర్లు బాగా పెరుగుతుండటంతో కొన్ని సీజనల్ వ్యాధులు మొదలయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. జ్వరాలు, జలుబు, అతిసారం (గ్యాస్ట్రో ఎంటరైటీస్), నీళ్ల వీరేచనాలు (డయేరియా) వంటివాటితోపాటు ఈ సీజన్​లో చికెన్‌‌ పాక్స్, కామెర్లు, టైఫాయిడ్​ వంటివి రావొచ్చని హెచ్చరిస్తున్నారు. ఆరుబయట పనిచేసే వారికి ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఆరు బయట, ఎండలో పనిచేసేవాళ్లు నీళ్లు, ఓఆర్ఎస్​ వాటర్​ ఎక్కువగా తాగాలని, పుచ్చకాయ, ద్రాక్ష, దోసకాయలు తినాలని, వదులుగా ఉండే కాటన్‌‌ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

రేపు, ఎల్లుండి ఎండలు.. వానలు

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను బట్టి సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో ఓ మోస్తరు వానలు పడే చాన్స్​ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత పెరగవచ్చని ప్రకటించారు. 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదవుతాయని వెల్లడించారు. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, మరో ఐదారు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు.

Latest Updates