చట్టాలు రద్దు చేయాలన్న రైతులు.. కుదరదన్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య 8వ విడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఈ నెల 15న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. మీటింగ్ లో రైతు సంఘాల నేతలంతా చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలు వాపస్ తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే… ప్రభుత్వం మాత్రం సవరణలు చేస్తామంటుందన్నారు. సవరణలపైనే చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. క్లాజ్ బై క్లాజ్ చర్చ కూడా తాము కోరుకోవడంలేదన్నారు. వ్యవసాయ చట్టాలపై తాము కోర్టుకు వెళ్లబోమన్నారు రైతు సంఘాల నేతలు. చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని తాము చెప్పడంలేదన్నారు. ప్రభుత్వమే చట్టాలను రద్దు చేయాలని… అప్పటివరకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ నెల 26న పిలుపునిచ్చిన మేరకు పరేడ్ నిర్వహిస్తామన్నారు.

ఇవాళ్టి చర్చల్లో  అభిప్రాయం కుదరలేదన్నారు వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్. చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప… ఏ డిమాండ్ అయినా నెరవేరుస్తామని ప్రభుత్వం తరపున స్పష్టం చేశామన్నారు. అయితే రైతులు మరే డిమాండ్ ఇవ్వలేదన్నారు. ఇతర డిమాండ్లపై మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తోన్న రైతులు కోరుతున్నారని… అయితే దేశంలో అనేకమంది చట్టాలను సమర్థిస్తున్నారని తోమర్ చెప్పారు.

Latest Updates