పిల్లల బియ్యం పురుగుల పాలు..సర్కార్ బడుల్లో 20 వేల క్వింటాళ్లు

హైదరాబాద్, వెలుగులాక్​డౌన్​ఎఫెక్ట్ అనేక రంగాలతో పాటు సర్కారు బడుల్లోని స్టూడెంట్స్​కు అందించే మిడ్​డే మీల్స్​బియ్యంపైనా పడుతోంది. నెలన్నర నుంచి బడుల్లో ఉన్న వాటిగురించి పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. మరో నెలన్నర వరకూ బడులు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో బియ్యం ఎలుకలు, పురుగుల పాలవుతాయని హెడ్మాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం స్టూడెంట్లకు అందించే భోజనంపైన పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీటిని వెంటనే పిల్లలకైనా అందించాలని లేకుంటే, ప్రభుత్వం రిటర్న్​తీసుకుని స్కూళ్లు స్టార్ట్ అయ్యాక తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.

రాష్ట్రంలోని 28,621 స్కూళ్లలో మిడ్​డే మీల్స్​పథకం కొనసాగుతోంది. 22,73,043 మంది స్టూడెంట్స్ కు భోజనం అందుతోంది. దీంట్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు 11,37,547 మంది, ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు 11,35,496  మంది స్టూడెంట్లు ఉన్నారు. ప్రైమరీ స్టూడెంట్స్​కు రోజుకు100 గ్రాములు, హైస్కూళ్ల స్టూడెంట్స్​కు 150 గ్రాములు సన్నబియ్యంతో నిత్యం భోజనాన్ని అందిస్తున్నారు. 8వ తరగతి వరకు అయ్యే భోజన ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా ఉండగా, స్టేట్​ గవర్నమెంట్​ది 40 శాతం ఉంది. 9,10 తరగతుల పిల్లలకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. లాక్​డౌన్​తో మార్చి16 నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. బడుల్లో ఉన్న బియ్యాన్ని సక్రమంగా నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

నెలకు సరిపడా ఒకేసారి..

ప్రతి స్కూల్​హెడ్మాస్టర్ నెలనెలా ఎల్ఎంఎస్ పాయింట్ వద్దకెళ్లి స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా బియ్యాన్ని తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం ప్రతినెలా 40 వేల టన్నుల బియ్యం స్కూళ్లకు సరఫరా అవుతుంది. మార్చి నెలలోనూ అంతే క్వాంటిటీలో బియ్యం కోటాను హెడ్మాస్టర్లు స్కూళ్లకు తీసుకుపోయారు. అయితే లాక్ డౌన్​తో రాష్ట్రంలో మార్చి14 తర్వాత బడుల్లో స్టూడెంట్స్​కు మీల్స్​పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దాదాపు నెలన్నర నుంచి ఎక్కడి బియ్యం బస్తాలు అక్కడే పడి ఉన్నాయి. తక్కువ మంది స్టూడెంట్లున్న స్కూళ్లలో బియ్యం నిల్వలు తక్కువగానే ఉన్నా, ఎక్కువ స్టూడెంట్స్​ఉన్న దగ్గర మాత్రం భారీగానే నిల్వలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 20 వేల క్వింటాళ్లు బడుల్లోనే ఉన్నాయని తెలుస్తోంది. అయితే చాలా స్కూళ్లలో తరగతి గదులు సరిగా లేవు. అనేక బడుల్లో బియ్యం నేల మీద ఉండటంతో వాటికి పురుగులు పడుతున్నాయి. చాలా బడుల్లో పందికొక్కులు, ఎలుకల బెడద కూడా ఉంది. మరోపక్క అకాల వర్షాలతోనూ కొన్ని స్కూళ్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఈ పరిణామాలన్నింటితో  బియ్యం ఖరాబ్ అయ్యే అవకాశముందని హెడ్మాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్లు స్టార్ట్ అయ్యాక ఇలా పాడైన బియ్యాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోరని, పాత నిల్వల ప్రకారం భవిష్యత్​లో బియ్యం ఇస్తారని చెప్తున్నారు. బడుల్లోని ఈ బియ్యాన్ని రిటర్న్​తీసుకోవాలని లేదా స్టూడెంట్స్​కు పంచాలని హెచ్ఎంలు కోరుతున్నారు. అయితే స్కూళ్లకు బియ్యాన్ని ఇచ్చినపుడుకంటే, తీసుకుపోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు. రేషన్​ షాపులకు దొడ్డు బియ్యం వస్తుందని, స్కూళ్లకు సన్నబియ్యం వస్తాయని పేర్కొన్నారు. మూడు నెలలకే బియ్యం ఖరాబ్ కావని అంటున్నారు.

ఇప్పుడు తీసుకుని..స్టార్ట్ అయినంక ఇవ్వాలె

మా స్కూల్​లో 700 మంది వరకు పిల్లలున్నారు. మార్చినెల బియ్యం స్టాక్ లో ఇంకా సగం స్కూల్​లోనే ఉన్నాయి. ఇప్పుడు అవి పాడవకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నం. అయినా పాడవుతాయనే భయం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ బియ్యాన్ని డీలర్లకు ఇచ్చి, స్కూళ్లు స్టార్ట్ అయ్యాక తిరిగి మా బియ్యం మాకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

‑ పరబ్రహ్మమూర్తి,సిరిసిల్ల బాయ్స్ హైస్కూల్ హెచ్ఎం

పిల్లలకే ఇస్తే బెటర్

మా హైస్కూల్​లో 1,007 మంది స్టూడెంట్లున్నారు. ప్రతి నెలా30 క్వింటాళ్ల వరకు అవసరమవుతాయి. మార్చి నెలకు సంబంధించి మరో15 క్వింటాళ్లు స్కూల్​లోనే ఉన్నాయి. ప్రస్తుతం వాటికి పెద్దగా రక్షణ లేదు. ఎలుకలు, పందికొక్కుల బెడద ఉంది. కరోనా నేపథ్యంలో స్కూళ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలియదు. కాబట్టి బియ్యం ఇలా ఖరాబయ్యే కంటే పిల్లల బియ్యమే కాబట్టి వారికే ఇచ్చేస్తే బెటర్.

‑ రామస్వామి, ఇందిరానగర్ హైస్కూల్ హెచ్ఎం, సిద్దిపేట

Latest Updates