కనికరంలేని తల్లి: కొడుకుని చంపింది

ప్రపంచంలో అత్యంత గొప్పదైనది అంటే తల్లి ప్రేమ. నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఏ తల్లి అయిన పిల్లలను అపురూపంగా పెంచుకుంటది. వారికి ఏ చిన్న గాయం తగిలినా తల్లడిల్లి పోతది. కానీ తల్లి ప్రేమ అన్న పదానికి మాయని మచ్చ తెచ్చింది ఓ మహిళ. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకునే చంపిన విషాద ఘటన నల్గొండ మండలంలోని బుద్ధారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. నల్గొం డ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన పాలేటి విజయ, వెంకన్న దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు నాగరాజు (9) 3వ తరగతి చదువుతున్నాడు. గ్రామంలోనే వీరు కూలి పనులు, వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. విజయ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో చనువుగా ఉంటుం దని తెలుసుకున్న భర్త వెంకన్న వారిద్దరి ని ఏడాది కిందట మందలించాడు. ఈ క్రమంలో శుక్రవారం విజయ భర్త వెంకన్న పక్కఊరు రాములబండకు పని మీద వెళ్లాడు. దీంతో విజయ తన ప్రియుడితో ఇంట్లో కలిసుండగా నాగరాజు నిజం ఎక్కడ తండ్రికి చెపుతాడేమో అన్న భయంతో కొడుకుని చంపాలని పన్నాగం పన్నింది. వెంట ఉన్న ప్రియుడుతో కలిసి ఉరి వేయాలని కుట్ర పన్నింది. ప్రియుడు నాగార్జున కాళ్లు పట్టు కోగా, విజయ టవల్ తో గొంతు నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తెలుస్తుంది.

విషయం వెలుగులోకొచ్చిందిలా..

నాగరాజును చంపిన అనంతరం ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తల్లి విజయ ఇంట్లోనే కొడుకుని మంచంపై పడుకోబెట్టి ఆరోగ్యం బాగాలేక చనిపోయాడని చెప్పి అందరినీ నమ్మించింది. ఆ తర్వాత గ్రామస్తులు నాగరాజు మృతదేహాన్ని బాగా పరిశీలించగా.. మెడ వద్ద బిగుసుకు పోయినట్లు, ఉరి వేసినట్లుగా అనుమానం రావటంతో వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మెడ బిగుసుకుపోయినట్లు ఉన్నట్లు గుర్తించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడినట్లు తెలుస్తోంది. తానే కొడుకును ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. విజయ భర్త వెంకన్న ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Latest Updates