ప్రధానులకొక మ్యూజియం

72 ఏళ్ల స్వతంత్రం. 14 మంది ప్రధాన మంత్రులు.  నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్​పేయి వంటి ఒకటికి రెండు మూడుసార్లు ప్రధానులుగా చేసినవాళ్లుకూడా ఉన్నారు. దేశాన్ని అటు సంక్షేమంగా, ఇటు ఆర్థికంగా డెవలప్​ చేసి తమ ముద్రను బలంగా వేసిన పి.వి.నరసింహారావు, మన్మోహన్​ సింగ్​ వంటి వాళ్లున్నారు. వీరికి సంబంధించిన జ్ఞాపకాలు ఒకచోటకు చేర్చాలన్న ఆలోచనమాత్రం ఇప్పటివరకు ఎవరికీ రాలేదు. వరుసగా రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఈ లోటు తీర్చాలని నిర్ణయించుకున్నారు.

దీనికోసం ఢిల్లీలోని తీన్ ​మూర్తి కాంప్లెక్స్​ని ఎంచుకున్నారు. 30 ఎకరాలలోగల ఈ కాంప్లెక్స్​ని… 1930లో సుప్రసిద్ధ బ్రిటిష్​ ఆర్కిటెక్ట్​ రాబర్ట్​ టోర్​ రస్సెల్​ డిజైన్​ చేశారు. తీన్‌‌ మూర్తి కాంప్లెక్స్‌‌కి, నెహ్రూ కుటుంబానికి విడదీయలేని బంధం ఉంది. దేశ తొలి ప్రధాని పండిట్‌‌ నెహ్రూ సుమారు 16 ఏళ్ల పాటు నివసించినచోటు అది.

ప్రధాని ఊహిస్తున్న ఈ మ్యూజియంలో ఇప్పటికే పని ఆరంభమైంది. తీన్​ మూర్తి భవన్​లోనే 10,‌‌‌‌‌‌‌‌‌‌‌‌000 చదరపు మీటర్లలో నిర్మించబోయే ఈ మ్యూజియంలో… ప్లాన్ డాక్యుమెంట్​ ప్రకారం ఇండియన్​ ప్రైమ్​ మినిస్టర్లకు సంబంధించిన సకల సమాచారాన్ని పొందుపరుస్తారు. దేశానికి వారందించిన సేవల వివరాలను, పరిశోధనకు కావలసిన విజన్​ డాక్యుమెంట్లను, వారు ఉపయోగించిన వస్తువులు, వారుసేకరించినవి అరుదైన జ్ఞాపికలను ప్రదర్శిస్తారు. రీసెర్చర్లకు అందుబాటులో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సొసైటీ వర్గాలు చెబుతున్నాయి.  మ్యూజియం నిర్మాణపు ప్లాన్​ని అంతర్జాతీయ స్థాయిలో పోటీ నిర్వహించి ఓకే చేశారు. సిక్కా అసోసియేట్స్​ ఇచ్చిన డిజైన్​ ప్రకారం నిర్మాణం జరుగుతోంది.

ఇండియన్​ డెమొక్రసీకి ఇదొక అద్భుత నమూనాగా నిలుస్తుందనడంలో సందేహం ఉండదంటున్నారు. ఇప్పటివరకు ఆయా ప్రధాన మంత్రులు సాధించిన ల్యాండ్​మార్క్​ లక్ష్యాలు, నిర్ణయాలు, ఆలోచనావిధానాలు, వారి సేవలు అన్నీ డిజిటలైజేషన్​ చేస్తారని ప్లాన్​ డాక్యుమెంట్​చెబుతోంది. ఆయా ప్రధానుల ఫొటోలు, వారి చేతిరాతలు, ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు అన్నీకూడా ఉంటాయి. ఈ మ్యూజియం ఖర్చు మొత్తం 2226.20 కోట్ల రూపాయలుగా అంచనా. ఈ మొత్తంలోనే డిజిటల్ మ్యూజియంకోసం 89 కోట్లను కేటాయించారు. సాధారణంగా మ్యూజియంలకు వచ్చే విజిటర్లు మాత్రమేకాకుండా, విద్యార్థులు,  టూరిస్టులు, మేధావులు… ఇలా సొసైటీలోని అన్ని వర్గాలవారిని ఆకట్టుకునేలా ‘ప్రధానుల మ్యూజియం’ని రూపొందిస్తున్నారు.

ఒక్కొక్క ప్రధాని జీవిత విశేషాలను, ఇతర సమాచారాన్ని డిజిటల్​ స్టోరీ టెల్లింగ్​ కాన్సెప్ట్​తో సిద్ధం చేస్తున్నారు. విజిటర్లకు చక్కటి అనుభవం మిగిలేలా ఆత్యాధునికమైన త్రీ–డీ టెక్నిక్​ని, టచ్​ స్క్రీన్​ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆయా ప్రధానుల జీవిత కాలంలోకి వెళ్లి స్వయంగా తెలుసుకునే అనుభూతికోసం టైమ్​ మెషీన్​ తరహాలో ఎక్విప్​మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఆడియో–విజువల్​ ప్రొజెక్షన్​, హాలోగ్రామ్​లుకూడా జోడిస్తున్నారు. మోడీ సర్కారు పెట్టుకున్న టార్గెట్​ ప్రకారం  దీనిని 2020 అక్టోబర్​లో ప్రారంభించాల్సి ఉంటుంది.  ఇంతవరకు దేశానికి విశేష సేవలందించిన 14 మంది ప్రధాన మంత్రుల గురించి తెలుసుకునే అవకాశం ఈ మ్యూజియంద్వారా ప్రపంచానికి లభించనుంది.

Latest Updates