ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక తీర్పు

ఢిల్లీ: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధ‌వారం ఈ కేసుపై తీర్పు వెలువ‌రించిన జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్… 50 కోట్ల రూపాయల పాక్షిక నష్టపరిహారాన్ని పర్యావరణ పునరుద్ధరణకు, బాధితులకు పంచాలని తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు రెండు నెలల్లో ప్రణాళిక రూపొందించాలని సూచించింది. ఇందుకోసం కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామ‌న్న ఎన్జీటీ.. తుది నష్టపరిహారాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ కాలుష్య నియంత్రణ మండలి కలిసి అధ్యయనం చేయాలని‌ తెలిపింది. ఈ కమిటీని రెండు వారాల్లో ఏర్పాటు చేయాలని, రెండు నెలల్లో నివేదిక అందజేయాలని తెలిపింది.

కంపెనీకి అనుమతుల విషయంలో చట్ట ప్రకారంగా నడుచుకోని అధికారిని గుర్తించి, ఆ వ్య‌క్తిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఎల్ జి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించకూడద‌ని, ఒకవేళ కంపెనీకి అనుమతులు ఇస్తే వాటి వివరాలు ట్రిబ్యునల్ కు తెలియజేయాలని చెప్పింది. రసాయనాలతో కూడిన ప్లాంట్లలో పర్యావరణ నిబంధనలు తనిఖీ చేయడానికి  కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Latest Updates