పార్లమెంటు కొత్త భవనం మన జాతి ఆత్మ నిర్భరతకు చిహ్నం

దేశ అవసరాలకు తగ్గట్టుగా ప్రతి దానిలోనూ మార్పులు రావాల్సిందే. చట్టాలు, వ్యవస్థలు మొదలు అన్ని రంగాల్లో 21వ శతాబ్దపు పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేస్తూ మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. ఇప్పటికే ప్రస్తుత పార్లమెంట్ బిల్డింగ్ అన్ని అవసరాలకు సరిపడా లేదు. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు భవిష్యత్తు అవసరాలకు  సరిపడేలా కొత్త పార్లమెంటు బిల్డింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రపంచంలోనే అత్యద్భుతమైన చారిత్రక కట్టడంగా చిరకాలం నిలిచిపోయేలా రూపకల్పన చేసిన ఈ కొత్త బిల్డింగ్‌‌కు ఇటీవలే ప్రధాని మోడీ భూమి పూజ చేశారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 2022 నాటికి పూర్తి స్వదేశీ శక్తితో దీనిని  పూర్తి చేసి ఆత్మ నిర్భర చిహ్నంగా నిలపబోతున్నాం.

21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గ నాయకత్వ స్థాయికి ఎదగడంలో భారత ప్రగతి ప్రస్థానానికి నాంది పలికిన కీలక క్షణమిది. పౌరుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా మన దేశం నేడు పయనం సాగిస్తోంది. జాతీయ లక్ష్యాలను అందుకోవడంలో అద్భుత విలువలను జోడిస్తూ.. దేశ ప్రగతికి మోడీ సర్కారు బాటలు వేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల ప్రారంభించిన పార్లమెంటు కొత్త బిల్డింగ్ నిర్మాణం జాతి విస్తృత వృద్ధిలో కీలకంగా నిలవబోతోంది.

బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్‌‌..

మన దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న సమయంలో మాంటెగ్యూ -చెమ్స్‌‌ఫ‌‌ర్డ్‌‌ సంస్కరణల ఫలితంగా భారత ప్రభుత్వ చట్టం–1919 అమలులోకి వచ్చింది. దీని ద్వారా భారతీయులు దేశ పరిపాలనలో పాలుపంచుకోగలిగారు. ఆ తర్వాత ఇదే చట్టం కింద 1921లో తొలిసారి ప్రజా ప్రతినిధులు ఎన్నికయ్యారు. నాడు వారు సమావేశమై చట్టాలు చేసేందుకు తగిన వసతి కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ బిల్డింగ్‌‌లో ‘సెంట్రల్ లెజిస్లేటివ్ హౌస్’ ను వాడుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ సంస్కరణల వల్ల శతాబ్దం కిందట రెండు సభలతో కూడిన శాసన నిర్మాణ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఆ నేపథ్యంలో రెండు సభల ప్రతినిధుల విధులకు వీలుగా అడ్విన్ లుటియన్, హెర్బర్ట్ బకర్ ప్రస్తుతం ఉన్న పార్లమెంటు బిల్డింగ్ నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. 1921లో ప్రారంభమైన నిర్మాణ పనులు ఆరేళ్లపాటు సాగాయి. 1927 నాటికి పార్లమెంటు భవన సముదాయం సంపూర్ణ రూపం సంతరించుకుంది. ఈ బిల్డింగ్‌‌లో నే నాటి నుంచి ఉభయ సభల సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే 93 ఏండ్లు గడిచిపోయింది.

కాంగ్రెస్ హయాంలోనే కొత్త బిల్డింగ్ ప్రతిపాదనలు

పార్లమెంటుకు కొత్త బిల్డింగ్ నిర్మించాలన్న ప్రతిపాదన ఇప్పటికిప్పుడు వచ్చిందికాదు. గతంలో ఇద్దరు లోక్ సభ స్పీకర్లు కూడా ఈ ఆలోచనను ముందుకు తెచ్చారు. ప్రస్తుత భవన సముదాయం 1927లో పనిచేయడం ప్రారంభించింది. అయితే, ఆనాటితో పోలిస్తే నేడు పార్లమెంటు ఉద్యోగులు, భద్రత సిబ్బంది, మీడియా, సందర్శకుల సంఖ్యతోపాటు  పార్లమెంటరీ కార్యకలాపాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. మరోవైపు ఉభయసభల సంయుక్త సమావేశం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ కిక్కిరిసిపోతోంది. దీంతో కొందరు ఎంపీలు అదనంగా ఏర్పాటుచేసిన కుర్చీల్లో కూర్చోవాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత భవనం వారసత్వ విభాగం–1లో భాగమైనందున దానికి మరమ్మతు, మార్పుచేర్పులు, రీమోడలింగ్ వంటివి చేయాలంటే అనేక పరిమితులు అడ్డొస్తున్నాయి. అలాగే ప్రస్తుత పార్లమెంటు భవన సముదాయానికి- భూకంప భద్రత, ప్రామాణిక అగ్ని నిరోధక వ్యవస్థల కొరత సహా పరిమిత కార్యాలయ వసతి వంటి అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే 2012లో కాంగ్రెస్ హయాంలో నాటి లోక్‌‌స‌‌భ స్పీకర్ మీరాకుమార్ కొత్త పార్లమెంటు భవనం ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ పురాతన భవనాన్ని అప్పటికే పరిమితికి మించి ఉపయోగించడాన్ని ఆ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అదేవిధంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా 2016లో అప్పటి స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవనం, ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, ప్రస్తుత లోక్‌‌స‌‌భాపతి ఓమ్ బిర్లా సహా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంటు సభ్యుల, సంబంధిత ఇతర భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానించారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బిల్డింగ్ నిర్మాణానికి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు.

ప్రపంచంలోనే అద్భుత చారిత్రక నిర్మాణంగా..

మన జాతి ఆత్మనిర్భర భారత్ ఆశలను మరింత ప్రోత్సహించే స్ఫూర్తి, చిహ్నంగా కొత్త పార్లమెంటు భవనం నిలవబోతోంది. ఆ మేరకు ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్’ కింద పూర్తి స్వదేశీ ప‌‌రిజ్ఞానంతో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ‘ఐక్య భారతం – -శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని బలోపేతం చేసేలా సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచించనుంది.  రాజస్థాన్ నుంచి ఎర్ర ధోల్పూర్ రాతితో నిర్మాణం ద్వారా ఈ ప్రజాస్వామ్య ఆలయం సుందర రూపం సంతరించుకోనుంది. ఈ  విశాలమైన, ఇంధన పొదుపుతో కూడిన, సాంకేతిక- సౌలభ్య సహిత భవనం 1224 మంది ఎంపీలు కూర్చోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మనదైన సాంస్కృతిక నైతికత నుంచి ప్రజాస్వామ్య విలువలను, వాటి సుసంపన్న అనుభవాలను భారతదేశం నరనరాన జీర్ణించుకుంది. ఆ మేరకు 12వ శతాబ్దపు భగవాన్ బసవేశ్వర అనుభవ మంటపం కావచ్చు లేదా 6వ శతాబ్దంనాటి బౌద్ధం కావచ్చు… మానవాళి విషయంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌహార్దం తదితర ప్రజాస్వామ్య మూల విలువల సహజీవనాన్ని మనకు బోధించాయి. అలాగే రాజ్యాంగ చట్టసభపై చర్చల సందర్భంగా డాక్టర్ భీమ్‌‌రావ్ అంబేద్కర్ ఈ వాస్తవాలను సుస్పష్టంగా వివరించారు. అమెరికాలో ప్రస్తుత పార్లమెంటరీ భవనం ఆ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన పాతికేళ్ల వ్యవధిలోగా నిర్మితమైంది. అలాగే ఆస్ట్రేలియా, బ్రెజిల్ దేశాలు కూడా వలసపాలన అనంతరం నిర్మించిన పార్లమెంటు భవనాలను సగర్వంగా జాతికి అంకితం చేశాయి. అదే తరహాలో మనం కూడా వలస పాలనానంతర, అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రజల పార్లమెంటును రూపొందించుకునే చారిత్రక కసరత్తుకు శ్రీకారం చుట్టడం అవశ్యం. ఆ మేరకు ఇది ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ, అద్భుత చారిత్రక కట్టడంగా చిరకాలం నిలిచిపోతుంది. ప్రజాస్వామ్యానికి తల్లివంటి భారత ప్రజాస్వామ్య సంప్రదాయాల పయనం వాస్తవరూపాన్ని ఈ ఉజ్వల పథకం ప్రతిబింబిస్తుంది.

సుప్రీం తీర్పుతో ముందడుగు

19, 20 శతాబ్దాల పాలన విధానాల కట్టడితో ప్రస్తుత 21వ శతాబ్దపు సవాళ్లను అధిగమించడం కష్టం. వీటిని పరిష్కరించేందుకు శ్రద్ధతో కూడిన వివేకవంతమైన విధానాల ద్వారా ఆచరణాత్మకంగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం అవసరం. ఇందులో భాగంగా నేడు  సంస్కరణాత్మక పనితీరు, ప్రజాస్వామ్య నైతికత బలోపేతం దిశగా పరివర్తనాత్మక, చిత్తశుద్ధిగల విధానాలతో అమేయ విజ్ఞాన, ఆర్థికశక్తిగా రూపొందడానికి భారత్ నిర్ణయాత్మక పయనం సాగిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’ ముందడుగు దిశగా ప్రభుత్వానికి సర్వోన్నత ఆమోదం లభించడం హర్షణీయం. ఈ సందర్భంగా నిర్మాణ సమయంలో అత్యున్నత, సున్నిత పర్యావరణ ప్రమాణాలకు కట్టుబడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఆత్మ నిర్భరతకు సింబల్‌‌

మన ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయత బలోపేతానికి వ్యక్తిగత, సామూహిక, జాతీయవాద లక్ష్యాల సమ్మేళనం ఎంతైనా అవసరం. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ప్రారంభం కావడం ఆత్మ నిర్భరతకు ప్రతీక కానుంది. అలాగే స్వాతంత్య్రం సిద్ధించాక 75వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న భారత ప్రజాస్వామ్యానికి తగిన గౌరవంగా దీన్ని పేర్కొనవచ్చు. జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయడంలో మనందరికీ ఇది తగిన స్ఫూర్తిని ఇవ్వగలదు. ఈ ప్రజాస్వామ్య ఆలయ స్ఫూర్తితో భారతదేశ సౌభాగ్య సాధన కృషిలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాలుపంచుకోవడం తప్పనిసరి.

ప్రస్తుత అవసరాలకే చాలని బిల్డింగ్

స్వతంత్ర భారతంలో తొలి లోక్‌‌స‌‌భ‌‌ 489 మంది పార్లమెంటు సభ్యులతో కొలువుదీరింది. నాడు ప్రతి 7 లక్షల మంది జనాభాకు ఒక లోక్‌‌సభ సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో దేశ రాజధానిలో ఉన్న జనాభా 14 లక్షల మంది. ప్రస్తుతం ఈ సంఖ్య 2.5 కోట్లకు పైగా ఉంది. ఇక 1951లో దేశ జనాభా 36.1 కోట్లు కాగా, నేడు 135 కోట్లకు పైగా జనాలు ఉన్నారు. అలాగే పార్లమెంటు సభ్యులు ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య కూడా పెరిగింది. ఈ రోజుల్లో మన ఎంపీలు తమ క్యాంపు కార్యాలయాల నుంచి రోజువారీ వ్యవహారాల నిర్వహణతోపాటు అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ అవసరాలకు తగ్గట్టుగా ప్రస్తుత పార్లమెంట్ బిల్డింగ్ సరిపోవడంలేదు. దీంతో పార్లమెంటులోని విభాగాలతో సమన్వయ సౌలభ్యం కోసం, ఎంపీలు రాజధానిలో ఉండగా వారికి అవసరమయ్యే సంస్థాగత, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దీంతో కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం వచ్చింది.

2026 నాటికి పార్లమెంటు నియోజకవర్గాల పెంపు

పార్లమెంటరీ నియోజకవర్గాల హద్దులు నిర్ణయించేందుకు రాజ్యాంగ నిబంధన 81 అనుమతిస్తోంది. ఆ మేరకు చివరిసారిగా 1971 జనాభా లెక్కల ఆధారంగా 2007లో  పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మళ్లీ 2026నాటికి రాష్ట్రాలవారీ స్థానాల విభజనకు అనుగుణంగా హద్దుల నిర్ణయ ప్రక్రియ జరుగుతోంది. దీంతో రాబోయే ఎంపీల సంఖ్య నిస్సందేహంగా పెరుగుతుంది. ఫలితంగా కొత్తగా ఎన్నికయ్యే చట్టసభల సభ్యులకు తగు వసతి ఏర్పాటు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల నడుమ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యేనాటికి 2022లో దేశానికి కొత్త పార్లమెంటు భవనాన్ని అంకితం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎంతో దూరదృష్టితో సంకల్పించారు.-అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర పార్లమెంటరీ వ్యవవహారాల శాఖ సహాయ మంత్రి.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

అది నా బెస్ట్‌.. అందుకే వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నా..

హోమ్‌‌ లోన్లపై ఎస్‌‌బీఐ గుడ్‌‌న్యూస్

Latest Updates