భూమిపూజ చేసి ఏడాది.. కొత్త సెక్రటేరియట్ ఎప్పుడో?

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియట్​కు భూమి పూజ చేసి ఏడాది కావొస్తున్నా ఇంకా ఇటుక కూడా పడలేదు. నిర్మాణం విషయం కోర్టు వివాదాల్లో చిక్కుకోవడంతో అడుగు ముందుకు జరగలేదు. ఎంప్లాయీస్​ అందరినీ బీఆర్కే భవన్​కు తరలించడంతో.. ఆ చాలీచాలని ప్లేస్​లో ఉద్యోగులు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా వ్యాప్తితో ఆ ఇరుకు బిల్డింగులో డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు. స్థలం లేక మంత్రులు అక్కడో చోట, ఇక్కడో చోట పని చేస్తుండటంతో వాళ్ల కోసం ఎమ్మెల్యేలు చక్కర్లు కొడుతున్నారు.

పెద్ద ఎత్తున విమర్శలు

గతేడాది జూన్ 27న కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ బిల్డింగ్ లకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసినప్పటి నుంచి సెక్రటేరియట్ నిర్మాణంపై వివాదాలు చుట్టుముట్టాయి. గట్టిగా ఉన్న బిల్డింగ్స్ ను కూల్చి కొత్త సెక్రటేరియట్ కట్టాలన్న సర్కారు నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. కొందరు హైకోర్టుకు వెళ్లడంతో.. ప్రస్తుతమున్న బిల్డింగ్స్ ను ఎందుకు కూల్చుతారన్న ప్రశ్నలు వచ్చాయి. ఓవైపు కేసు విచారణలో ఉండగానే హడావుడిగా సెక్రటేరియట్ ను బీఆర్కే బిల్డింగ్​లోకి షిఫ్ట్​ చేశారు. మంత్రులకు సరైన చాంబర్లు లేకపోవడంతో ‘చెట్టుకొకరు పుట్టకొకరు’ అన్నట్టుగా ఒక్కో మంత్రి ఒక్కో దగ్గర చాంబర్ ఏర్పాటు చేసుకున్నారు.

ఇరుకు గదుల్లో డ్యూటీలు.. కరోనా భయాలు

సెక్రటేరియట్​ను బీఆర్కే బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేసినప్పటి నుంచి అధికారులు ఇరుకు గదుల్లో డ్యూటీలు చేస్తున్నారు. కొందరికి చాంబర్లు లేకపోవడంతో ఇద్దరు, ముగ్గురికి కలిపి ఓ చాంబర్ కేటాయించారు. ఇప్పుడు హైదరాబాద్​లో కరోనా వ్యాప్తి ఎక్కువవడంతో ఉద్యోగులు డ్యూటీకి రావడానికి భయపడుతున్నారు. ఇరుకు గదుల్లో పనిచేయడం కన్నా లాంగ్ లీవ్​ తీసుకుంటామన్నారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. కొత్త గైడ్ లైన్స్ జారీ చేస్తూ కొందరికి వారం తప్పించి వారం, మరికొందరికి రోజు విడిచి రోజు డ్యూటీకి వచ్చే వెసులు బాటిచ్చింది.

కోర్టు తీర్పు కోసం వెయిటింగ్

సెక్రటేరియట్ బిల్డింగ్​ల కూల్చివేతపై కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈలోపు లాక్ డౌన్ అమల్లోకి రావడంతో తుది విచారణ పెండింగ్ లో పడింది. కోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫడవిట్లో 9 అంతస్తులతో కొత్త సెక్రటేరియట్ కడతామని సర్కారు పేర్కొంది. ప్రస్తుత బిల్డింగ్స్ సేఫ్టీ రూల్స్​ ప్రకారం లేవని, కొన్ని కూలిపోయే దశలో ఉన్నాయని, పార్కింగ్ ఏరియా లేదని వివరించింది. అయితే నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో క్లారిటీ లేదని అధికార వర్గాలు అంటున్నాయి. ముందు రూ. 300 కోట్లు అంచనా వేయగా ఇప్పుడు రూ. 500 కోట్ల వరకు అవుతుందని చెబుతున్నారు. ఏదేమైనా కోర్టు తీర్పు కోసం సర్కారు వెయిట్​చేస్తోంది. అనుకూలంగా వస్తుందని భావిస్తోంది.

నిర్మాణం మరింత ఆలస్యం

కొత్త సెక్రటేరియట్ నిర్మాణం మరింత లేటయ్యే అవకాశముందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే భూమి పూజ చేసిన ఏడాదిన్నర లోపు నిర్మాణం పూర్తి చేయాలని సీఎం అనుకున్నారని, కానీ హైకోర్టులో కేసు పెండింగ్​లో ఉండటంతో బ్రేకు పడిందని అంటున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల నిర్మాణం లేటవొచ్చని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూ. 500 కోట్లు కేటాయించి నిర్మాణం చేపడితే విమర్శలొచ్చే చాన్స్​ఉందని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.

మినిస్టర్ల చాంబర్లపై కన్ఫ్యూజన్​

సెక్రటేరియట్ షిఫ్ట్​ చేశాక ఏ మంత్రి ఎక్కడి నుంచి పనిచేస్తున్నారో గందరగోళంగా ఉందని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను కలిసేందుకు వెళ్తే కలుస్తారనే నమ్మకం లేదని వాపోతున్నారు. గతంలో సెక్రటేరియట్ కు వస్తే ఒకేరోజు రెండు, మూడు పనులయ్యేవని.. ఇప్పుడు ఒకే పని కోసం రెండు, మూడు చోట్లు తిరగాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఏ టైమ్​లో మంత్రులు చాంబర్ లో ఉంటారో తెలియక అయోమయంగా ఉందని ఓ సీనియర్ ఎమ్మెల్యే అన్నారు. బీఆర్కే భవన్ లో ప్రస్తుతం మంత్రులు ఈటల, మల్లారెడ్డి, కొప్పుల పని చేస్తున్నారు. మిగతా మంత్రులు వేర్వేరు చోట్ల నుంచి పని చేస్తున్నారు. బీఆర్కేలోకి సెక్రటేరియట్ షిఫ్ట్ చేశాక విజిటర్స్ ను తగ్గించారు. ఈలోపు కరోనా రావడంతో ఇంకిన్ని ఆంక్షలు పెట్టారు.

ప్రభుత్వ శాఖల్లో పెద్ద పోస్టులన్నీ కేసీఆర్ కులపోళ్లకే

Latest Updates