రాష్ట్రంలో ఎన్​హెచ్​లకు రూ. 2 వేల కోట్లు కావాలె

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులు ఇయ్యాలె
భూసేకరణ ఖర్చును 50% భరిస్తాం
కేంద్ర మంత్రి గడ్కరీకి రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని నేషనల్ హైవేల అభివృద్ధికి రూ. 2 వేల కోట్లు ఇవ్వాల‌ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవ‌నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమ‌వారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ‘వన్ నేషన్- వన్ ట్యాగ్’ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో పాటు మంత్రి వేముల హజరయ్యారు. సదస్సుకు కేంద్ర మంత్రి గడ్కరీ ముఖ్య అతిథిగా వచ్చారు. సదస్సు తర్వాత మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న హైవేలు, రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వాలని కోరామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవేల భూసేకరణకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 50% ఖర్చును భరిస్తుందని చెప్పామన్నారు.

భారత్ మాల పరియోజన పథకం కింద అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమిటర్లు 4 లైన్లుగా డెవలప్ చెయ్యాలని, అలాగై నేషనల్ హైవే 365ని కోదాడ నుంచి ఖమ్మం వరకు31 కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్లుగా డెవలప్ చెయ్యాలని కోరినట్లు చెప్పారు. టోల్‌ ప్లాజాల వద్ద ప్రయాణికుల సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసేందుకు ‘వన్‌ నేషన్‌ వన్‌ ఫాస్ట్‌ ట్యాగ్‌’ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. త్వరలో అన్ని నేషనల్ హైవేల్లో టోల్ ప్లాజాలను ఎలక్ట్రిక్ టోల్ ప్లాజాలుగా మార్చాలని కేంద్రం యోచిస్తోందన్నారు. దీనికోసం కేంద్రం ప్రత్యేకంగా యాప్ కూడా రూపొందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ‘వన్ నేషన్ వన్ టాగ్ ఫాస్ట్ టాగ్’ అమలుకు ఆమోదం తెలిపామన్నారు.

Latest Updates