తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువే

  • మార్చి 14 నుంచి వరుసగా నమోదవుతున్న కేసులు
  • పదిలక్షల మందిలో సగటున 455 శాంపుల్స్​ చెకింగ్
  • కరోనా లక్షణాలున్నోళ్లు, ఫస్ట్​ కాంటాక్ట్స్​కే టెస్టులు
  • ఎక్కువ కేసులున్న జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
  • సూర్యాపేట, వికారాబాద్‌‌లలో మూడురోజులుగా నిల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగుఇండియాలో కరోనా కేసుల సంఖ్య 24 వేలకు చేరువైంది. 90 శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే ఉన్నయి. అందులో మన రాష్ట్రం కూడా ఉంది. టెస్టులు చేస్తున్న కొద్దీ కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో టెస్టులు చేస్తూ కరోనా సోకినవారిని వేగంగా గుర్తిస్తున్నాయి. వారి నుంచి ఇతరులకు సోకకుండా కంట్రోల్​ చేసే పనిలో పడ్డాయి. మన రాష్ట్రంలో మాత్రం టెస్టుల సంఖ్య తక్కువగా ఉంటోంది.

కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల్లో ఆరు తెలంగాణ కంటే ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్నాయి. ఏపీలో రోజుకు ఐదారు వేల మందికి టెస్టులు చేస్తున్నారు. అక్కడ శుక్రవారం నాటికి 54,341 మందికి.. అంటే సగటున ప్రతి పది లక్షల మందిలో 1,018 మంది టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టుల సంఖ్య 18,200 మాత్రమే. అంటే సగటు టెస్టులు 455 మాత్రమే. కేసులు నమోదుకాని జిల్లాలతోపాటు, అధిక కేసులు వస్తున్న జిల్లాల్లో చేస్తున్న టెస్టుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. దీనివల్ల కేసులు నెమ్మదిగా పెరుగుతాయేతప్ప.. వైరస్ నుంచి విముక్తి దొరకదని, పైగా మరింత మందికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌‌‌‌ డౌన్  ఒక్కటే సరిపోదని, వీలైనన్ని టెస్టులు చేస్తూ పాజిటివ్​ వారి నుంచి వైరస్​ వ్యాపించకుండా చూడాలని సూచిస్తున్నారు.

దేశవ్యాప్తంగా చూస్తే..

ఢిల్లీలో అత్యధికంగా ప్రతి పది లక్షల మందిలో 1,567 మందికి టెస్టులు చేశారు. తర్వాత ఏపీలో 1,018, తమిళనాడు 857, రాజస్థాన్‌‌‌‌ 848, జమ్మూకశ్మీర్‌‌‌‌‌‌‌‌ 732, మహారాష్ట్ర 714,  గుజరాత్‌‌‌‌ లో సగటున 652, కేరళలో 593 సగటున టెస్టులు జరిగాయి. వెస్ట్‌‌‌‌ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్‌‌‌‌ రాష్ట్రాల సగటు మాత్రం మనకంటే తక్కువగా ఉంది.

మూడు రోజులుగా శాంపిల్స్‌‌‌‌ నిల్‌‌‌‌

సూర్యాపేట జిల్లాలో రెండ్రోజులుగా ఒక్క కేసు కూడా రాలేదు. టెస్టులు చేయించకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు సూర్యాపేటలో 83 కేసులురాగా.. మొత్తంగా చేసిన టెస్టులు 796 మాత్రమే. ప్రతి వంద శాంపిళ్లలో సగటున 10 మందికిపైగా పాజిటివ్ వస్తున్నాయి. అయినా గత మూడ్రోజుల్లో సూర్యాపేట జిల్లాలో ఒక్కరి శాంపిల్ కూడా సేకరించలేదని డీఎంహెచ్‌‌‌‌వో ఇచ్చిన బులెటిన్‌‌‌‌లో పేర్కొన్నారు. 38 పాజిటివ్  కేసులు నమోదైన వికారాబాద్‌‌‌‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అక్కడ 659 మందికి టెస్టులు చేయించారు. మూడ్రోజులుగా అక్కడ ఒక్కరి శాంపిల్  కూడా సేకరించలేదు. ఇక గద్వాలలో 570 మందికి టెస్టులు చేయించగా 45 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క శాంపిల్ కూడా తీయలేదు.

లక్షణాలు లేవని..

కరోనా పాజిటివ్ వ్యక్తుల్లో 80 శాతం మందికి లక్షణాలు ఉండడం లేదు. ఐసీఎంఆర్‌‌‌‌ (ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్) నుంచి కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌‌‌ చేస్తున్న డాక్టర్ల దాకా అందరూ ఇదే మాట చెప్తున్నారు. లక్షణాలు లేనివాళ్లు వైరస్  క్యారియర్లుగా మారి.. వందల మందికి ఇన్ఫెక్ట్  చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సింప్టమ్స్‌‌‌‌ తో సంబంధం లేకుండా వీలైనంత ఎక్కువ మందికి టెస్టులు చేయాలని సూచిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భిన్నంగా వెళ్తోంది. కేవలం ప్రైమరీ కాంటాక్ట్స్‌‌‌‌కే టెస్టులు చేయాలని, సెకండరీ కాంటాక్ట్స్‌‌‌‌ లో లక్షణాలు లేనివాళ్లకు టెస్టులు చేయొద్దని నిర్ణయించింది. నిజానికి రాష్ట్రంలో చాలా కేసుల్లో సెకండరీ కాంటాక్ట్స్‌‌‌‌ కు కూడా వైరస్  పాజిటివ్ వచ్చింది. మర్కజ్  వెళ్లొచ్చిన వాళ్ల ద్వారా వారి కుటుంబీకులకు, వారి నుంచి ఇతరులకు వైరస్  సోకింది. అలాగే మంచిర్యాల, నారాయణపేట, గ్రేటర్  హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఏ లింకూ బయటపడని కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో సెకండరీ కాంటాక్ట్స్‌‌‌‌ కు టెస్టులు చేయించొద్దన్న నిర్ణయం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల తీరు..

(సగటున ప్రతి పదిలక్షల మందికి)

ఢిల్లీ                        1,567

ఏపీ                        1,018

తమిళనాడు               857

రాజస్థాన్‌‌                   848

జమ్మూకశ్మీర్‌‌             732

మహారాష్ట్ర                  714

గుజరాత్‌‌                   652

కేరళ                         593

హర్యానా                   544

హిమాచల్​ప్రదేశ్          538

చండీగఢ్                   525

తెలంగాణ                  455

కర్నాటక                   427

దేశవ్యాప్త సగటు         391

ఇట్లయితే డేంజరే..

లక్షణాలు లేనోళ్లకు టెస్టులు చేయకుండా, ప్రైమరీ కాంటాక్ట్స్‌‌కు మాత్రమే టెస్టులు చేసినంతకాలం పరిస్థితి ఇట్లానే ఉంటుంది. ఎక్కువ మందికి టెస్టులు చేయకుండా కరోనా వ్యాప్తి లేదనడం భ్రమలాంటిదే. చాలా జిల్లాల్లో ఇలాగే ఉంది. ఇట్లా కొనసాగితే రాష్ట్రంలో, దేశంలో త్వరలోనే అమెరికా లాంటి పరిస్థితి వస్తది. అలా జరగకూడదంటే వీలైనంత ఎక్కువ మందికి టెస్టులు చేయించాలి. స్టాటిస్టికల్‌‌ గా ర్యాండమ్‌‌ గా శాంపిల్స్ తీసుకోవాలి. 60 ఏండ్లు దాటిన వాళ్లను ఇండ్ల నుంచి బయటకు రాకుండా స్ట్రిక్ట్‌‌గా లాక్‌‌డౌన్ అమలు చేయాలి. హెర్డ్‌‌ ఇమ్యునిటీ కోసం యంగ్  పీపుల్‌‌ ను దశలవారీగా
బయటకు వదలాలి..

– డాక్టర్‌‌‌‌ బాబూరావు, ప్రొఫెసర్‌‌‌‌ & హెచ్​వోడీ, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌‌ మెంట్‌‌, సూర్యాపేట మెడికల్ కాలేజీ

హాట్‌‌ స్పాట్లలో అందరికీ చెయ్యాలె

‘‘లాక్​డౌన్​  వల్ల వైరస్‌‌ ఒకేసారి ఎక్కువ మందికి సోకకుండా మాత్రమే ఆపగలం. కరోనా చైన్ బ్రేక్ చేయాలంటే కంటెయిన్‌‌ మెంట్ జోన్లలో అందరికీ టెస్టులు చేయాల్సిందే.  స్ర్కీనింగ్ టెస్టుగా ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులు చేయడం మంచిదే.   కంటెయిన్‌‌మెంట్‌‌  జోన్లలో పది రోజుల వ్యవధిలో ఒక్కొక్కరికి రెండు సార్లు యాంటీ బాడీ టెస్ట్ చేయించాలి. దానివల్ల చాలా వరకు వైరస్ వ్యాప్తిని గుర్తించి, అడ్డుకోగలం.   వీలైనంత ఎక్కువ మందికి టెస్టులు చేయడమే వైరస్  కట్టడిలో ముఖ్యమైన అంశం. ఇంకో ఏడాది వరకూ వైరస్  కంట్రోల్​ కాదు. అప్పటిదాకా లాక్​డౌన్​లో ఉండలేం. వైరస్‌‌  వ్యాప్తి జరిగిందనుకున్న ప్రతిచోటా.. వీలైనంత తక్కువ టైమ్‌‌లో, ఎక్కువ మందికి టెస్టులు చేయడమే మంచిది..’’

– డాక్టర్‌‌  రంగారెడ్డి బుర్రి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌‌

 

 

Latest Updates