రవాణా శాఖ ఆదాయంతోపాటు పెరుగుతున్న పొల్యూషన్‌

  • ఏటా పెరుగుతున్న వెహికల్స్‌
  • అత్యధికంగా 92.63 లక్షల టూవీలర్స్‌
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఎక్కువ
  • రోజూ 3 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు
  • 2019లో 10,78,171 బండ్లకు రిజిస్ట్రేషన్‌

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో వెహికల్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బండ్ల సంఖ్య కోటి దాటి పరుగులు పెడుతోంది. తెలంగాణలో మొత్తం 1,24,60,204 వాహనాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 92,63,173 టూవీలర్స్‌ ఉండటం గమనార్హం. బండ్లపై క్రేజ్, అవసరాలు పెరగడంతో వెహికల్స్‌ సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో రోజుకు 3 వేల దాకా బండ్లు రిజిస్ట్రేషన్ అవుతున్నయ్​. దీంతో ఆర్టీఏకు మస్తు ఆదాయం వస్తోంది. వాహనాల సంఖ్య ఎక్కువవుతున్న కొద్దీ కాలుష్యం కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది.

రాష్ట్రవ్యాప్తంగా 92.6 లక్షల మోటార్‌‌ సైకిళ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా 14,85,805 కార్లు ఉన్నాయి. 1,28,420 మోటార్‌‌ క్యాబ్స్‌‌, 30,706 మ్యాక్సీ క్యాబ్స్‌‌ ఉన్నాయి. 27,477 ఎడ్యుకేషనల్‌‌ బస్సులు, 4,34,037 ఆటో రిక్షాలు, 4,99,568 గూడ్స్‌‌ క్యారేజ్‌‌లు, 4,89,717 ట్రాక్టర్స్ ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తం వాహనాల్లో సగం గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లోనే ఉన్నాయి. గ్రేటర్‌‌ పరిధిలో 60 లక్షల దాకా బండ్లు ఉండగా, ఇందులో 44 లక్షల బైక్‌‌లు, 11 లక్షల కార్లు , ఇతర వాహనాలు ఉన్నాయి. ఐదేళ్లలో 48,71,890 వాహనాలు రిజిస్టరయ్యాయి. ఇప్పటి వరకు 2018లోనే అత్యధికంగా 10,87,859 వాహనాలు రిజిస్టరయ్యాయి. 2019లో  10,78,171 రిజిస్టర్‌‌ అయ్యాయి.

ఇట్ల పెరుగుతున్నయ్‌‌

జీహెచ్‌‌ఎంసీ పరిధితో పాటు ఇతర ముఖ్య పట్టణాల్లో చిన్నచిన్న కంపెనీలు, పరిశ్రమలు, కొన్ని ప్రాంతాల్లో ఐటీ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరు ఏదో ఓ వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు కార్లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సొంత వాహనాలపైనే మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌‌లో కాలుష్యం పెరిగిపోతుండటంతో సేఫ్టీ కోసం కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా బైక్‌‌ తప్పనిసరి అయింది. ప్రజా రవాణా వ్యవస్థ అనుకున్నంత మేర అభివృద్ధి చెందకపోవడం కూడా వెహికల్స్ సంఖ్య పెరగడానికి కారణవుతోంది. మరికొందరు ప్రెస్టేజీ కోసం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బండ్లు వాడుతుండటం గమనార్హం.

పొల్యుషన్‌‌ కూడా..

వాహనాల సంఖ్యతో పాటు పొల్యూషన్‌ కూడా పెరిగిపోతోంది. బండ్ల నుంచి వచ్చే పొగతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పుడు పరిస్థితి అంతగా ఇబ్బంది పెట్టకున్నా.. భవిష్యత్‌‌లో ఢిల్లీ లాంటి అవస్థలు పడాల్సి వస్తుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రిజిస్ర్టేషన్ల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్‌‌, వెహికిల్ ట్రాన్స్‌‌ఫర్, వివిధ రకాల ట్యాక్స్‌‌లతో ఇన్‌‌కమ్‌‌ వస్తోంది. ఆర్టీఏ శాఖకు ఏడాదికి సుమారు రూ.3.5 వేల కోట్ల దాకా ఆదాయం వస్తోంది.

Latest Updates