కబ్జా స్థలం స్మశానానికి కేటాయించాలంటూ.. మున్సిపల్ కౌన్సిల్ లోకి దూసుకెళ్లిన జనం

దమ్మాయిగూడ మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో వాగ్వాదం

మేడ్చెల్ జిల్లా: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడా మున్సిపాలిటీ లో సర్వే నెంబర్ 530ని కొందరు కబ్జా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు రియల్ వ్యాపారులు కుమ్మక్కై స్మశానాన్ని కబ్జా చేసి బాగోతం నడుపుతున్నారని ఆగ్రహంతో స్థానికులు మునిసిపల్ ఆఫీసును ముట్టడించారు. కబ్జాకు గురవుతున్న స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించాలంటూ వారు మునిసిపల్ సమావేశ మందిరంలోకి దూసుకెళ్లారు. పలువురు కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.

అది ప్రభుత్వ స్థలమేనని.. స్మశానినికి ఎందుకివ్వరంటూ దమ్మాయిగూడా సమావేశ మందిరం లో ప్రజలకు కౌన్సెలర్ లకు మధ్య గొడవ. జరిగింది. సర్వే నెంబర్ 530 ప్రభుత్వ స్థలాన్ని రియల్ ఎస్టేట్  వ్యాపారులు కబ్జా చేశారని స్థానికులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది దళారులు చివరకు  స్మశానాలను కూడా వదలని రీతిలో తయారయ్యారని మండిపడ్డారు. బహిరంగంగా ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు చోద్యం చూడడం సరికాదని వారు పేర్కొన్నారు. కొంత మంది ప్రజా ప్రతినిధులపైన ,అధికారులపైన వారు దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్స్ గా చేసి అమ్మడానికి అధికారం ఎవరిచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు ఉన్న స్మశానం  కేవలం 200 గజాలలో మాత్రమే ఉందని.. ఇందులోకనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు గుర్తించి స్మశానానికి కేటాయించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ వార్డు సభ్యుడు దాసరి నర్సింహారెడ్డి, దుర్గాప్రసాద్ గౌడ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.

 

Latest Updates