సర్కారు భూమికి పట్టాలు పుట్టించుకున్న వైనం

150 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చేశారు

జూలూరుపాడు మండలం నల్లబండబోడు గ్రామ పరిధిలో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఓ 150 ఎకరాల ప్రభుత్వ భూమి.. ఆ ప్రాంతానికి చెందిన నాయకులందరి కన్ను పడింది. ఓ అధికారి సహకరించారు. అంతే రాత్రికి రాత్రే అందరూ వాటాలు వేసుకున్నట్లు పట్టాలు పుట్టించుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారం తాహశీల్దార్ బదిలీ అయిన వెంటనే వెలుగులోకి వచ్చింది. అంతే ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. పేదలకు ఇవ్వాలంటే సవాలక్ష కారణాలు చెప్పే అధికారులు అడ్డంగా దోచుకున్నారంటూ మండిపడ్డారు. అఖిలపక్షం ఆధ్వర్యంల్  జూలూరుపాడు మండల కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో వ్యవహారం రచ్చ రచ్చ అయింది.

జూలూరుపాడు మండల పరిధిలోని నల్లబండబోడు గ్రామంలోని సర్వేనెంబర్ 38 లో 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని సొంతం చేసుకునేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రజాసంఘాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో అటు నేతలు గాని.. అధికారులు గాని ఏమీ చేయలేదు. అయితే ఇటీవల ఓ అధికారి బదిలపై వెళుతూ అందరికీ పట్టాలు మంజూరు చేసిన వైనం మీ సేవ కేంద్రంలో బయటపడింది. సర్వే నెంబర్ 38లో అనేక మందికి పట్టాలు ఇచ్చినవైనం వివాదాస్పదంగా మారింది.  అక్రమంగా పాస్ పుస్తకాలు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పట్టాలు వెంటనే రద్దు చేసి అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏం చేస్తారన్నది వేచి చూడాలి.

Latest Updates