గాంధీ ఆస్పత్రిలో గందరగోళం : ఒకరికి చేయాల్సిన ఆపరేషన్​ మరొకరికి

ఒకరికి చేయాల్సిన ఆపరేషన్​ మరొకరికి
ప్లేట్​లెట్స్​ తక్కువగా ఉన్న మహిళకు ప్రసవం    శిశువు మృతి.. తల్లి పరిస్థితి సీరియస్
తప్పులతడకగా ఉన్న కేస్​ షీట్..ఆపరేషన్​ అయిన మహిళకు బదులు మరొకరి పేరు
మగ బిడ్డ పుడితే.. ఆడ బిడ్డ అని రాశారు
చిలకలగూడ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు

పద్మారావునగర్(హైదరాబాద్), వెలుగు: ఓ గర్భిణికి చేయాల్సిన ఆపరేషన్​ మరో గర్భిణికి చేశారు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు. ప్లేట్​ లెట్స్​ తగ్గాయని వచ్చిన మహిళకు ఏడో నెలలోనే ప్రసవం చేయడంతో శిశువు మృతి చెందగా.. తల్లి పరిస్థితి సీరియస్​గా ఉంది. ఈ ఘటనపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నలుగురు డాక్టర్లతో కమిటీ వేసిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..

ప్లేట్​ లెట్స్​ తగ్గాయని వస్తే..

మహబూబాబాద్​ జిల్లా వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన సమత ఏడు నెలల గర్భిణి. ప్లేట్​లెట్స్​ తక్కువగా ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆమెను కొద్ది రోజుల క్రితం వరంగల్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. పరిస్థితి సీరియస్​గా ఉండటంతో ఈ నెల 11న గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే భవానీ అనే తొమ్మిది నెలల గర్భిణికి చేయాల్సిన ప్రసవాన్ని సమతకు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నెల 12న సమత ఆరోగ్య స్థితిని పరిగణనలోనికి తీసుకుని సిజరేయన్​ చేసి బిడ్డను తీశామని, మగ బిడ్డ పుట్టాడని, 900 గ్రాముల బరువు ఉండటంతో శిశువును ఐసీయూలో ఉంచామని సిబ్బంది తెలిపారని కుటుంబసభ్యులు చెప్పారు. 13న శిశువు చనిపోయిందని చెప్పగా ఖననం చేసేశామని సమత భర్త హరీష్​ తెలిపారు.

తప్పుల తడకగా కేస్​ షీట్?

మంగళవారం సమతను డిశ్చార్జ్​ చేసే సమయంలో డాక్టర్లు ఇచ్చిన కేస్​ షీట్​లో సమత పేరుకు బదులు భవాని అని, మగ బిడ్డ స్థానంలో ఆడ శిశువు అని రాసి ఉందని హరీష్​ ఆరోపించారు. సమతకు చేతికి కట్టిన ట్యాగ్​లో కూడా భవాని పేరే ఉందని అతడు చెప్పాడు. కాగా, మంగళవారం సాయంత్రం సమతకు బ్లీడింగ్​ ఎక్కువ కావడంతో ఓ పీజీ స్టూడెంట్​ ఇచ్చిన ఇంజక్షన్​ వికటించి ఆమె కాళ్లు, చేతులు ఉబ్బిపోయాయని హరీష్​ చెప్పారు. ప్రస్తుతం సమత పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీనిపై సమత కుటుంబ సభ్యులు మంగళవారం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ బాలగంగిరెడ్డి గాంధీ హాస్పిటల్​లో దర్యాప్తు చేసి స్టేట్​మెంట్​ రికార్డు చేశారు.

నలుగురు డాక్టర్లతో కమిటీ

పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హాస్పిటల్​ స్పష్టం చేసింది. నలుగురు డాక్టర్లతో కమిటీ వేశామని, ఆ కమిటీ బుధవారం రిపోర్ట్​ ఇస్తుందని, డాక్టర్ల పొరబాటు ఉందని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని గాంధీ సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రవణ్​​కుమార్​ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన గైనకాలజిస్ట్​ వార్డుకు వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి, వారి వాదనలు విన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, డాక్టర్ల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. బాధితురాలిని పోస్ట్​ ఆపరేటివ్​ వార్డు నుంచి ఎంఐసీయూ వార్డుకు తరలించామని చెప్పారు. డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీలేదని, విచారణలో వాస్తవాలు తేలుతాయని అన్నారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

Latest Updates