దత్తత ఇచ్చిన కొడుకును ఎత్తుకొచ్చిన తల్లిదండ్రులు.. అడ్డుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు

ములుగు జిల్లా: తాము దత్తత ఇచ్చిన కొడుకును తిరిగి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కిడ్నాప్ కు ప్రయత్నించగా.. గ్రామస్తులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ములుగు జిల్లా వెంకటాపురం  మండలం సూరవీడు గ్రామంలో జరిగిందీ ఘటన. హైదరాబాద్ కు చెందిన స్నేహ-మహేందర్ దంపతులు తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. స్నేహ 7 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు  సూరవీడు గ్రామానికి చెందిన తిరుమల నాగేశ్వరిని ఆశ్రయించారు. ఆమె దగ్గరుండి నాలుగు నెలల క్రితం కాన్పు చేయించింది. బాబు పుట్టిన తర్వాత మహేందర్ స్నేహ దంపతులు చిన్నారిని వద్దనుకున్నారు. దీంతో కాన్పు చేసిన నాగేశ్వరి బాబును పెంచుకుంటోంది. అయితే 4 నెలల తర్వాత మనసు మార్చుకున్న స్నేహ, మహేందర్ దంపతులు నిన్న రాత్రి 8 మందితో కారులో తమ బాబును పెంచుకుంటున్న సూరవీడు గ్రామంలోని నాగేశ్వరి ఇంటికి వచ్చారు. తమ బాబును తిరిగి ఇచ్చేందుకు నాగేశ్వరి నిరాకరించడంతో కళ్లలో కారం కొట్టి.. బాబుని తీసుకుని కారులో కారులో పారిపోయారు. నాగేశ్వరి వెంటనే కేకలు వేయడంతో.. ఇరుగు పొరుగు వారు అప్రమత్తం అయ్యారు. కారులో పారిపోతున్న వారిని కొద్దిమంది వెంటాడారు. మరికొంత మంది ముందున్న వెంకటాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని తీసుకుని పారిపోతున్న కారును యోగితానగర్ గ్రామం వద్ద పోలీసులు అడ్డుకుని నిలిపేశారు. గ్రామస్తులు వచ్చి వీరే కిడ్నాపర్లు అని నిర్ధారించడంతో  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Latest Updates