ఒక వైపు ధరల మోత మరో వైపు కూలీల కొరత..ఇండ్లు కట్టుడెట్లా?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరిగిన ఇసుక, ఇటుక, సిమెంట్ ధరలతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఇండ్లు కట్టుకోవడం తలకు మించిన భారంగా మారింది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ తర్వాత బిల్డింగ్ కన్​స్ట్రక్షన్ సామగ్రి ధరలు చుక్కలనంటడంతో ఇండ్ల నిర్మాణానికి వెనకంజ వేస్తున్నారు. ముందు అనుకున్న దానికంటే ఖర్చు కూడా మించిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ శివారులో బిల్డింగ్​లు, అపార్ట్​మెంట్లు కట్టించి, అమ్మే బిల్డర్లను పెరిగిన ధరలు, కూలీల కొరత వేధిస్తున్నాయి. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లకు అగ్రిమెంట్ ప్రకారం సకాలంలో నిర్మాణం పూర్తి చేసి అందించలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా కన్​స్ట్రక్షన్ వర్క్ వేసవిలోనే ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి సడలింపులు ఇచ్చే వరకు నెలన్నర వరకు రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. మే మొదటి వారంలో భవన నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఇసుక, ఇటుకల ధరలు ఒక్కసారిగా పెరగడంతో పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన కూలీలు సొంతూళ్లకు వెళ్లడంతో కూలీల కొరత కూడా తీవ్ర సమస్యగా మారింది.

లారీ ఇసుకకు రూ. లక్ష..

లాక్ డౌన్ తో సిమెంట్ ఉత్పత్తి, శాండ్ రీచ్​ల నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయిందని, ఇటుక బట్టీ కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారనే సాకుతో వీటి ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. ఇసుక రీచ్​ల్లో క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.600 చొప్పున 12 టైర్ల లారీలో 16 క్యూబిక్ మీటర్ల ఇసుక(రూ.9,6‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00), 14 టైర్ల లారీలో 20 క్యూబిక్ మీటర్ల ఇసుక (రూ.12,000)ను తరలిస్తుంటారు. హైదరాబాద్​కు తరలించేసరికి రూ.30 వేల వరకు ఖర్చవుతోంది. సాధారణ రోజుల్లో లారీ ఇసుకను రూ.40 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేవారు. కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఇసుక రవాణా తగ్గడంతో లారీ లోడ్ ఇసుక రూ.90 వేల నుంచి రూ.లక్ష ధర పలుకుతోంది. టన్నుల లెక్కన చూస్తే లాక్ డౌన్​కు ముందు టన్ను ఇసుకకు 1200 నుంచి రూ.1500 ఉండగా.. ఇసుక ప్రస్తుతం రూ.2,500 నుంచి 3,500 వరకు అమ్ముతున్నారు.

రూ.110 పెరిగిన బస్తా సిమెంట్ రేటు

లాక్ డౌన్​కు ముందు రూ.270 వరకు పలికిన బస్తా సిమెంట్ ధర రూ.380కి చేరింది. కొన్ని కంపెనీల సిమెంట్ బస్తా రూ.400పైగా పలుకుతోంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలంటే సిమెంట్ ధరలు తగ్గించాలని కంపెనీల యజమానులను వారం క్రితం మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి కోరారు. వారంలో నిర్ణయం ప్రకటిస్తామన్న యజమానులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సిమెంట్ రేట్లు పెరగడంతో సిమెంట్ ఇటుక ధర కూడా రూ.32 నుంచి37కు పెరిగింది. ఇటుక బట్టీల్లో కూలీలు లేక మట్టి ఇటుకల తయారీ నిలిచిపోవడంతో వెయ్యి ఇటుకలకు రూ.5 వేలు – రూ.6 వేలు ఉన్న ధర రూ.8 వేలకు చేరింది.

వలస కూలీలు వస్తేనే..

రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు, పట్టణాల్లో పేద, మధ్య తరగతి వర్గాలు కట్టుకునే ఇళ్లను ఎక్కువగా లోకల్ కూలీలు, మేస్త్రీలు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ఇతర రాష్ట్రాల కూలీలు, మేస్త్రీలే భారీ భవనాలు, అపార్ట్​మెంట్ల నిర్మాణాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బిహార్‌‌‌‌‌‌‌‌, జార్ఖండ్, చత్తీస్‌‌‌‌‌‌‌‌గడ్‌‌‌‌‌‌‌‌, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 4 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లిపోవడంతో కన్ స్ట్రక్షన్ రంగంపై ఈ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. వారు వచ్చేవరకు ఈ భారీ నిర్మాణాలు పూర్తి కావడం కష్టమేనని బిల్డర్స్ అంటున్నారు.

Latest Updates