డోంట్ వర్రీ డోర్ డెలివరీకి ఓకే.. ఇక ఇంటికే వస్తువులు

హైదరాబాద్, వెలుగుకరోనాతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయం.. గడప దాటాలంటే పోలీసుల లాక్​డౌన్​ ఆంక్షలు.. నిత్యావసరాలు, ఫుడ్​ కోసం బయటకొచ్చినా కనిపించని సూపర్ మార్కెట్లు, హోటళ్లు. ఒకటి అరా తెరిచి ఉన్నా విపరీతమైన రద్దీ. క్యూలో నిలబడి ఎలాగోలా కొందామనుకున్నా ఎవరు, ఎప్పుడు తుమ్ముతారో.. దగ్గుతారోననే టెన్షన్. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్, గ్రాసరీ డోర్​ డెలివరీ సర్వీసులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వారం రోజులుగా నిత్యావసరాలు, ఆహార పదార్థాల డోర్ డెలివరీపై ఉన్న ఆంక్షలను పోలీసులు ఎత్తేశారు. అత్యవసర సేవల కింద ఫుడ్, గ్రాసరీ డోర్ డెలివరీకి అనుమతించారు. దీంతో ఇంటి నుంచి కదల్లేని జనాలకు ఆన్ లైన్ బుకింగ్ సేవలు పొందే వీలు కలిగింది.

అందుబాటులో ఆన్ లైన్ యాప్స్

సిటీలో గ్రాసరీ కోసం గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్, ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్​కార్ట్, ఫుడ్​ డెలివరీ యాప్స్​ స్విగ్గీ, జొమాటో అందుబాటులో ఉన్నాయి. గ్రాసరీ డెలివరీకి 6 వేల మంది, ఈకామర్స్ వెబ్ సైట్లకు చెందిన 20 వేల మంది, ఫుడ్​ డెలివరీ చేసేందుకు 12 వేల మంది కలిపి సిటీలో దాదాపు 40 వేల మంది వరకూ డెలివరీ బాయ్స్ ఉన్నారు. ఒక్కో డెలివరీ బాయ్ గ్రాసరీ అయితే రోజుకు 3 నుంచి 6 ఆర్డర్లు, ఫుడ్ ఐటమ్స్ 10 నుంచి 20 ఆర్డర్లను డోర్ డెలివరీ చేయాలనే నిబంధన ఉంది. ఈ లెక్కన రోజులో కనీసం లక్ష కుటుంబాలకు గ్రాసరీ వస్తువులు, మరో 1.5 లక్షల ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేసే వీలుంది.

ఫోన్ బుకింగ్ సేవలు కూడా..

యాప్, ఆన్​లైన్​​బుకింగ్ చేసుకునే వెసులుబాటు లేని వారు హెరిటేజ్, మోర్, బిగ్ బజార్, స్పెన్సర్, రత్నదీప్ వంటి సూపర్ మార్కెట్లకు ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ చేస్తున్నాయి. సిటీలో 230 స్టోర్లకు పైగా ఉండగా, ఆయా స్టోర్ల నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో లిమిటెడ్ సేవలే అందిస్తుండగా రానున్న రోజుల్లో ఈ సేవలను విస్తరిస్తామని, లాక్ డౌన్ నేపథ్యంలో డెలివరీ బాయ్స్ ను తాత్కాలికంగా రిక్రూట్ చేసుకుంటున్నామని, ఫోన్ బుకింగ్స్ అన్నీ స్థానిక స్టోర్ల వద్ద నమోదు చేసుకున్న వారికే అందిస్తున్నామని పలువురు స్టోర్​ మేనేజర్లు తెలిపారు. సోమవారం నుంచి ఫుడ్ ఐటమ్స్ కూడా పూర్తి స్థాయిలో ఆన్ లైన్ బుక్ చేసుకునే వీలు కలగనుంది.

గంటల వ్యవధిలో డెలివరీ

ఉప్పు, పప్పులు, వంట సామగ్రి, నూనె, చక్కెర, బియ్యంతోపాటు చిన్న పిల్లలకు అవసరమైన సెరిలాక్స్, డైపర్లు, మెడిసిన్లు కూడా ఆన్​లైన్​ బుకింగ్​ ద్వారా పొందవచ్చు. మటన్, ఫిష్, చికెన్, గుడ్లు, పాలు, పెరుగు, కూరగాయలు కూడా లభ్యం అవుతున్నాయి. కొన్ని కంపెనీలు బుక్ చేసిన గంటల వ్యవధిలోనే డెలివరీ చేస్తే.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల మూడు గంటల వ్యవధిలో లేదంటే మరుసటి రోజున ఆర్డర్లను చేరవేస్తున్నాయి. పూర్తి స్థాయిలో హోటళ్లు తెరుచుకోకపోవడంతో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల కిచెన్లు, హోం ఫుడ్స్ అందించేవారు మాత్రమే ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఫుడ్ డెలివరీ చేస్తున్నారు.

ఆర్డర్ చేతికివ్వద్దు.. క్యాష్ తీసుకోవద్దు

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించకపోయినా, మెటీరియల్ ఆధారంగా విస్తరించే చాన్స్​లు ఉన్న నేపథ్యంలో డెలివరీ చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయా కంపెనీలు, సంస్థలకు పోలీసులు, హెల్త్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసిన వస్తువులను నేరుగా కస్టమర్​కు ఇవ్వకూడదని, ఇంటి పరిసరాల్లో పెడితే అక్కడి నుంచి పిక్ చేసుకోవాలని చెపుతున్నారు. కస్టమర్లు నేరుగా డెలివరీ బాయ్ కి క్యాష్ ఇచ్చినా తీసుకోకూడదని అంటున్నారు. హోం క్యారంటైన్ లో ఉన్నవారు కూడా ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇంటికే సరుకులు తెప్పించుకునే వెసులుబాటు ఉంటుంది. వస్తువులను తీసుకునే క్రమంలో కస్టమర్లు డెలివరీ చేసిన వస్తువులను ముట్టుకోకుండా ప్లాస్టిక్ గ్లౌజ్ లను ధరించడం, లేదా ఆయా వస్తువులను శానిటైజర్లతో తుడిచిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లడం చేయాలని, డెలివరీ బాయ్స్ దగ్గరకు వెళ్లే క్రమంలో మాస్కులు, శానిటైజర్లను వాడాలని సూచించారు.

కరోనాతో తగ్గినా గిరాకీ..

కరోనా నేపథ్యంలో సిటీలో పది రోజులుగా ఆన్ లైన్ ఆర్డర్లు, బుకింగ్స్ తగ్గాయని స్విగ్గీ తెలిపింది. ప్రస్తుతం లిమిటెడ్ రైడర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని, పోలీసుల సూచనలు పాటించి డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొంది. గత నెలలో పంజాగుట్ట కేంద్రంగా పనిచేసేందుకు 120 మంది రైడర్లు ఉండగా నెలలో 40 వేల ఆర్డర్లను డెలివరీ చేశామని, శుక్ర, శనివారాల్లో 500 ఆర్డర్లే చేయగలిగామని, జనాలు కూడా బుకింగ్ చేసుకోవడం లేదని వివరించింది. మరోవైపు ఆన్ లైన్ బుకింగ్, డిజిటల్ పేమెంట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో సురక్షితమని, ఇంట్లో వాళ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని, వైరస్ వ్యాప్తి, చైన్ ఆగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ మార్కెట్లు, సూపర్ మార్కెట్లతో పోల్చితే ఆన్ లైన్ వస్తువులకు కాస్తా రేట్లు ఎక్కువగా ఉంటాయి. లాక్​డౌన్​ లాంటి అత్యవసర పరిస్థితుల్లో సాధారణ ధరలతో డెలివరీ చార్జీలు లేకుండా వస్తువులను అమ్మితే ఎంతో మంచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

నిత్యావసర వస్తువులు తక్కువే

వారం రోజులుగా నిత్యావసర వస్తువుల బుకింగ్స్​ తక్కువే ఉన్నాయి. ప్రతి నెలా మొదటివారంలో బుకింగ్స్​ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో జనాలు కూడా భయపడుతున్నారు. లాక్​డౌన్​ వల్ల అన్ని ప్రాంతాలకు సరుకులు చేరవేయలేకపోతున్నాం.

‑ ముజఫర్, గ్రోఫర్ డెలివరీ బాయ్

ఫుడ్ కంటే జ్యూస్ లకు ప్రయార్టీ

ఫుడ్ కంటే జ్యూస్​లు, హెల్త్​ డ్రింక్స్, స్మూతీల బుకింగ్స్ ఎక్కువగా వస్తున్నాయి. రెండు రోజుల్లో 30 ఆర్డర్లు చేశాను. డ్రెస్ కోడ్, చేతులకు గ్లౌజ్​లు, శానిటైజర్ల వాడకం తప్పనిసరి చేయాలని పోలీసులు సూచించారు. హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది అవుతోందిది.

‑ రాజు, స్విగ్గీ రైడర్

లిమిటెడ్ టైమ్​లోనే స్టోర్ ఓపెన్​

నిత్యావసర వస్తువులపై ఆంక్షలు ఎత్తివేసినా.. కస్టమర్లు లేకపోవడంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే స్టోర్ తెరిచి ఉంచుతున్నాం. పోలీసుల సూచనలు మేరకు టైం పొడిగించే అవకాశం ఉంది. సోమవారం నుంచి హోం డెలివరీ మొదలు పెడతాం.

‑ రమ్య, మోర్ స్టోర్ మేనేజర్

పీఎం కేర్ నిధి ఏర్పాటు చేసిన మోడీ

 

Latest Updates